చర్చ లేకుండానే... ముగింపు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఎలాంటి చర్చ లేకుండానే గందరగోళం మధ్య బడ్జెట్ పద్దులకు బుధవారం ఆమోదముద్ర పడింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే టీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. ‘ఇదేం సభ.. సీమాంధ్ర సభ’ ‘సీమాంధ్ర సీఎం మాకొద్దు’ ‘జెతైలంగాణ’.. అంటూ నినాదాలు చేశారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తొలి 5 నిమిషాల్లోనే వాయిదా పడింది.
అంతకుముందు వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. 11.45 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. గందరగోళం మధ్యే ఆరు నెలల కాలానికి అవసరమయ్యే రూ.79 వేల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దుకు ఆమోదం తెలిపే తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత సభ ఆమోదానికి ప్రవేశపెడతారు. ఈసారి మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే తీర్మానాన్ని సభ ఆమోదానికి పెట్టినట్లు స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఈ వ్యవహారం మొత్తం ఐదు నిమిషాల్లో ముగిసింది. అనంతరం సభను గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు.
‘ద్రవ్య బాధ్యత’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: వివిధ శాఖలు ఇష్టానుసారం పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయకుండా నియంత్రించే ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు’కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఫలితంగా.. బడ్జెట్ కేటాయింపులకు 3 రెట్లకు మించకుండా మాత్రమే పనులకు పాలనా అనుమతులు ఇవ్వాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. మూడు రెట్లకు మించితే తప్పనిసరిగా శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
5 నిమిషాల్లో బడ్జెట్ పద్దులకు ఆమోదం
Published Thu, Feb 13 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement