బడ్జెట్టు.. కనికట్టు | Anam Ramanarayana Reddy introduces Budget in Assembly | Sakshi
Sakshi News home page

బడ్జెట్టు.. కనికట్టు

Published Tue, Feb 11 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

బడ్జెట్టు.. కనికట్టు

బడ్జెట్టు.. కనికట్టు

సాక్షి, ఏలూరు: రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో జిల్లాకు ఇచ్చిన కేటాయింపులు కేవలం ఓట్ల కోసం చేసిన అంకెల గారడీగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదు. అరకొర కేటాయింపులతోనే సరిపెట్టారు. అది కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధులు విదిల్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. నాలుగు జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగించేందుకు రూ.457.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు సైతం నామమాత్రంగానే నిధులు కేటాయించారు. డెల్టా ఆధునికీకరణకు కంటి తుడుపుగా రూ.180 కోట్లు ఇస్తున్నట్టు చూపించారు.
 
 పోలవరానికి అంతంతే..
 ఏటా బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అరకొర కేటాయింపులే ఇస్తున్నారు. 2012-13 బడ్జెట్‌లో రూ.850 కోట్లు కేటాయిస్తే.. 2013-14లో రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈసారి ఓట్ ఆన్ బడ్జెట్‌లో రూ.457.50 కోట్లు కేటాయించారు.పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడుతుంది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి, 23.44 టీఎంసీల నీటిని విశాఖ పరిసర 560 గ్రామాల్లో తాగునీటి, పరిశ్రమల అవసరాలకు ఎడమ కాలువ ద్వారా సరఫరా అవుతారుు. ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేపల పెంపకం, జలరవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి. ప్రాజెక్టు వ్యయం రూ.17,500 కోట్లుగా నిర్ణయించారు. రూ.16,010 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి వచ్చింది. దాదాపు 14 వందల ఎకరాల భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. నిర్వాసితులకు ఇప్పటివరకూ పూర్తిగా పునరావాసం చూపించలేదు. ఇటీవల ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి రూ.4,054 కోట్ల విలువైన పనులను అప్పగించారు. 
 
 డెల్టా ఆధునికీకరణ ఇంకెలా.. 
 ఎన్నో ఏళ్లుగా పంటలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువలు, డ్రెయిన్లు పూడకుపోయూయి. చాలా చోట్ల గట్లు తెగిపోతున్నాయి. చిన్నపాటి వర్షాలకే చేలల్లోకి నీరుచేరి పంటలు రోజుల తరబడి ముంపులోనే ఉంటున్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే డెల్టా ఆధునికీకరణ ఒక్కటే శరణ్యం. అయితే మూడేళ్లుగా ఆధునికీకరణ పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు.
 
 ఎప్పటికప్పుడు పంట ఆలస్యం కావడం, వెంటనే రెండో పంట వేసేస్తుండటంతో సమయం సరిపోవడం లేదు. దీంతో పనులు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. డెల్టా ఆధునికీరణ పనులను జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లాంగ్ క్లోజర్ ఇద్దామనుకున్నా రైతులు అంగీకరించకపోవడంతో షార్ట్ క్లోజర్ ద్వారా అయినా పనులు చేయాలనుకుంటున్నారు. అయితే ఓటాన్ బడ్జెట్‌లో డెల్టా ఆధునికీకరణకు రూ.180 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉభయగోదావరి జిల్లాల్లో సాగునీటి అవసరాలకు కాలువలు, డ్రెయిన్లే ప్రధాన ఆధారం. 2007-08లో వీటిని ఆధునీకరించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించగా 2008-09లో ఆమోదం లభించింది.
 
 పశ్చిమలో డెల్టా ఆధునికీకరణ పనుల కోసం రూ.1,383 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆధునీకరణ పూర్తి చేసేందుకు రూ.1464.44 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఐదేళ్లలో 2 లాంగ్ క్లోజర్లు (180 రోజుల చొప్పున), 2 షార్టు క్లోజర్లు (70 రోజుల చొప్పున) ఇచ్చి పనులు చేయాల్సి ఉంది. కానీ.. 2011-12లో ఒక్కసారి మాత్రమే లాంగ్ క్లోజర్ ఇచ్చి పనులు చేశారు. 2008-09లో రూ.23.20 కోట్లు, 2009-10లో రూ.8.65 కోట్లు, 2010-11లో రూ.16.60 కోట్లు, 2011-12లో రూ.68.63 కోట్లు, 2012-13లో రూ.115.08 కోట్లు, 2013-14లో రూ.91.25 కోట్ల విలువైన పనులు చేశారు. ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం రూ.323.41 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యూరుు. ఈ ఏడాది రూ.1,824 కోట్ల విలువైన పనులకు ప్యాకేజీలు ఖరారయ్యాయి. ‘పశ్చిమ’లో రూ.వెరుు్య కోట్లతో డెల్టాను ఆధునికీరించాలనుకుంటున్నారు. కానీ కేటాయించిన రూ.180 కోట్లు ఏ మూలకూ సరిపోవు.
 
 చింతలపూడికి ఎత్తిపోతలకు రూ.70 కోట్లు
 ప్రస్తుత ఓట్ ఆన్ బడ్జెట్‌లో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.70 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701కోట్లు. 2012-13 బడ్జెట్‌లో రూ.70 కోట్లు, గతేడాది బడ్జెట్‌లో దాదాపు రూ.70 కోట్లు కేటాయించారు. 2015లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగా ఉండటంతో ఇప్పటివరకూ దాదాపు రూ.280 కోట్లు ఖర్చు చేశారు.
 
 తాడిపూడికి రూ.60 కోట్లు
 తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.60 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.526.27 కోట్లు కాగా, 2012-13 బడ్జెట్‌లో రూ.61 కోట్లు, గతేడాది బడ్జెట్‌లో దాదాపు రూ.40 కోట్లు కేటాయించారు. గతేడాదే పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు నేటికీ సాగుతోంది.   
 కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.332.51కోట్లు
 కృష్ణా డెల్టా ఆధునికీకరణకు (కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు కలిపి) ఈ బడ్జెట్‌లో రూ.332.51కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో కొంత మన జిల్లాలో పనులకు ఉపయోగిస్తారు. ఏలూరు కాలువను 2 ప్యాకేజీలుగా విభజించి 2008లో పనులు చేపట్టారు. ప్యాకేజీ విలువ మన జిల్లాలో రూ.65.52 కోట్లు. నిధులు చాలక పనులు పూర్తికాకపోవడంతో గతేడాది   గడువు పొడిగించినా పూర్తికాలేదు. 2012లో రూ.4.15కోట్లు, 2013లో 9.72 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తిచేశారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement