నిరాశపర్చిన ఓటాన్ బడ్జెట్
జిల్లాకు నిధుల కేటాయింపు అరకొరే
సాగునీటి ప్రాజెక్టులకు మొండిచేయి
ప్రతిపాదనలతో పొంతనలేని మంజూరు
రాయలసీమ యూనివర్సిటీ, పెద్దాసుపత్రిలపై శీతకన్ను
సాక్షి, కర్నూలు:
ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజానీకానికి నిరాశ మిగిల్చింది. వచ్చే ఆరు నెలల కాలానికి ఉద్దేశించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో జిల్లాకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తారని భావించిన రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. హంద్రీనీవా, కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టులకు తప్ప ఎల్‌ఎల్‌సీ, గాజులదిన్నె తదితర ప్రాజెక్టులన్నింటికీ నిధుల్లో కోత పెట్టారు. ఇక ఆరు జిల్లాలకు పెద్దదిక్కుగా వైద్య సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రూ.2 కోట్ల మాత్రమే విదిల్చడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే హంద్రీనీవాకు రూ.416 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ, పంట కాలువలు, లిఫ్ట్‌ల వద్ద తాత్కాలిక మరమ్మతులు, ప్రధాన కాలువ లైనింగ్ పనులకు రూ.900 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే గత ఏడాది తరహాలోనే 50 శాతానికి పైగా కోత పెట్టారు.
కర్నూలు-అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవాకు గత ఏడాది కేటాయించిన నిధుల్లో 60 శాతం కూడా వ్యయం చేయలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే తెలుగుగంగ ప్రాజెక్టుకు ఈ ఏడాది కూడా రూ.154 కోట్లు మాత్రమే కేటాయించారు. జిల్లాతో పాటు చెన్నైవాసులకు తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు ఏటా అరకొర నిధులను కేటాయిస్తుండటంతో ప్రధాన కాలువ లైనింగ్ పనులకు ఇప్పట్లో మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం కుడిగట్టు కాలువ పనులకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ కాలువతో గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపి నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో 200 గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నారు. అరకొర నిధుల కారణంగా కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో 15 శాతం గ్రామాలకు కూడా తాగునీటిని అందించలేకపోతున్నారు. ఇక కర్నూలుతో పాటు కడప జిల్లాకు తాగు, సాగునీటిని అందించే కేసీ కెనాల్‌కూ రూ.70 కోట్లతో సరిపెట్టారు. 2.75 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాలువకు పలుచోట్ల లైనింగ్ దెబ్బతినడం.. మరమ్మతులకు నోచుకోకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం గమనార్హం. తుంగభద్ర దిగువ కాలుల పరిధిలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఎల్‌ఎల్‌సీ కాలువ ఆధునికీకరణ పనులకు బడ్టెట్‌లో రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారు. పైనున్న కర్ణాటక రాష్ట్రంలో నీటి చౌర్యంతో పాటు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో 75వేల ఎకరాలకు నీరందడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ నిధులు పెంచకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘రాయలసీమ’కు రూ.5 కోట్లు
రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి సుమారు రూ.170 కోట్లు కేటాయించాలని గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. అయితే బడ్జెట్‌లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
కర్నూలు పెద్దాసుపత్రికి రూ.2కోట్లే
ఆరు జిల్లాలకు పెద్దదిక్కుగా వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వాసుపత్రి తక్షణ అవసరాలకు రూ.2 కోట్ల బడ్జెట్‌తో సరిపెట్టారు. ఇప్పటికీ సరిపడా పడకలు లేక రోగుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో సరైన సౌకర్యాలు కరువై ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం అత్తెసరు నిధులతోనే సరిపెట్టింది.
కేటాయింపులు అంతంతే
Published Tue, Feb 11 2014 5:31 AM | Last Updated on Mon, May 28 2018 4:15 PM
Advertisement
Advertisement