19న ‘టీ’ ఓటు ?
అదే రోజు బిల్లుపై లోక్‌సభలో చర్చ... మూజువాణి ఓటుతో ఆమోదం!
ఆ వెంటనే రాజ్యసభకు పంపి.. అక్కడా అలాగే ఆమోదింపచేసే ఆలోచన
17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. 18న ఇతర బిల్లులకు ఆమోదంతో సరి
పార్లమెంటు ముగిసే ఒక రోజు ముందే టీ-బిల్లును గట్టెక్కించే వ్యూహం
సీమాంధ్ర కేంద్రమంత్రుల ఆందోళననూ అనుకూలంగా మార్చుకునే ఆలోచన
బిల్లు ఆమోదంపై ప్రతిపక్ష బీజేపీతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవగాహన?
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును గురువారం నాడు జరిగిన ఘర్షణ మధ్య లోక్‌సభలో ప్రవేశపెట్టారా? లేదా? అనే అంశంపై ఒకవైపు వివాదం నడుస్తుండగానే.. కేంద్ర ప్రభుత్వం బిల్లు విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 17న (సోమవారం) తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ.. ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ అంశాన్ని అజెండాలో చేర్చలేదు. మరుసటి రోజు అంటే ఈ నెల 18న సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సిన బిల్లులు అనేకం ఉన్నాయి. వాటిని మాత్రమే లోక్‌సభ అజెండాలో చేర్చినందున ఆ రోజు కూడా సభలో విభజన బిల్లు చర్చకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
కేంద్రవర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఈ నెల 19న లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించి వెనువెంటనే ఆమోదింప జేసుకునేలా కాంగ్రెస్, యూపీఏ సర్కారు పెద్దలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే అదే రోజు రాజ్యసభకు విభజన బిల్లును పంపాలనీ యోచిస్తున్నారు. మొత్తమ్మీద ఓటాన్ అకౌంట్ సమావేశాలు ముగియటానికి ఒక రోజు ముందే (ఈ నెల 20 నాటికే) ఉభయ సభల్లోనూ విభజన బిల్లును గట్టెక్కించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఉభయసభల్లోనూ ఓటింగ్‌తో పనిలేకుండా మూజువాణి ఓటుతోనే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సీమాంధ్ర ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసినందున.. బిల్లును ఆమోదింపజేసుకునేందుకు పెద్దగా అవరోధాలేమీ ఉండవనే ధీమాతో ఉన్నట్లు సమాచారం.
సీమాంధ్ర కేంద్ర మంత్రులను ఈ విషయంలో దారికి తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. ఒకవేళ ఆ ప్రాంత కేంద్రమంత్రులు వెల్‌లోకి వచ్చి గొడవ చేస్తే ఏం చేయాలనే దానిపైనా వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే కేంద్రం నెత్తిన పాలుపోసినట్లేనని, చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లును పాస్ చేయించుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్తున్నారు. విభజన బిల్లు విషయంలో పూర్తిగా తమకే రాజకీయ లబ్ధి దక్కే విధంగా కాంగ్రెస్ వ్యూహాన్ని అమలు చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విపక్షాలు, సొంత పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చామనే సంకేతాలను ఆ ప్రాంత ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారని.. ఈ విషయంలో బీజేపీని కూడా ముద్దాయిగా చేర్చేందుకు యత్నిస్తున్నారని.. వారు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ విషయంలో స్వరం మార్చుకుందని విమర్శిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఏ కారణాలవల్లనైనా విభజన బిల్లు అర్థంతరంగా నిలిచిపోతే అందుకు బీజేపీనే పూర్తి బాధ్యురాలిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్-బీజేపీ అవగాహన!: మరోవైపు తెలంగాణ విషయంలో కాంగ్రెస్-బీజేపీ అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు కాంగ్రెస్ పెద్దలు అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్ తదితరులు బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ల తో మాట్లాడినప్పుడే ఇరు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చాయని, ఆ తరువాతే విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలోప్రవేశపెట్టిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరు పార్టీలు ఏకమయ్యాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళితే నష్టమనే భావనతో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పైకి మాత్రం పరస్పరం కత్తులు దూసుకుంటూ రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.