వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఆర్థిక శాఖ ప్రతిపాదన
{పస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులే.. అయితే ఆరునెలలకే
రాష్ట్రం విడిపోతే వేర్వేరు బడ్జెట్‌లు
సాక్షి, హైదరాబాద్: 2014లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలతో ఫైలును ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించనున్నారు. 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా కూడా ఆరు నెలల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులనే వచ్చే ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ పొందుపరుస్తారు. అయితే ఆరు నెలలకు మాత్రమే కేటాయింపులను పరిమితం చేయనున్నారు. ఏ పథకానికి కానీ, కార్యక్రమానికి కానీ కేటాయింపులను పెంచడం కానీ, తగ్గించడం కాని ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి.
అలాగే కొత్త కార్యక్రమాలు, పథకాలకు కేటాయింపులు ఉండవని పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద 1,61,368 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఇందులో ప్రణాళిక వ్యయం కింద 59,442 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం కింద 1,01,926 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరు నెలలకు అంటే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద 80,684 కోట్ల రూపాయలకు మాత్రమే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ బడ్జెట్‌ను రూపొందించనున్నారు. ఒక వేళ అప్పటికి రాష్ర్టం విడిపోయి రెండు ప్రభుత్వాలు ఏర్పాటైతే రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించుకుంటాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్!
Published Thu, Nov 14 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement