నేడే రైల్వే బడ్జెట్: ఖర్గే | Interim rail budget: Premium trains likely to be the highlight | Sakshi
Sakshi News home page

నేడే రైల్వే బడ్జెట్: ఖర్గే

Published Wed, Feb 12 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

నేడే రైల్వే బడ్జెట్:  ఖర్గే

నేడే రైల్వే బడ్జెట్: ఖర్గే

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఖర్గే
 న్యూఢిల్లీ: రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంటులో తన మొట్టమొదటి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రైల్వే చార్జీల భారం పెద్దగా మోపకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో లోటు బడ్జెట్‌లా కాకుండా, దీన్ని అభివృద్ధి దాయక బడ్జెట్‌లా రూపొందించారని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే, 2013 ఏప్రిల్, డిసెంబర్ నెలల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణా ఆదాయం భారీగా తగ్గినందువల్ల ప్రయాణికుల చార్జీల తగ్గింపు ఉండకపోవచ్చని తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రయాణ చార్జీల ఆదాయంలో రూ. 4 వేల కోట్లు, సరకుల రవాణా ఆదాయంలో రూ. 850 కోట్ల తగ్గుదల కనిపించింది. రైల్వే వర్గాలు తెలిపిన ఇతర వివరాలు..
 
     ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక ప్రకటనలు ఉండకపోవచ్చు.
     మరిన్ని రైళ్లు, రైల్వే లైన్లు, ప్రయాణికుల సౌకర్యాలను ప్రకటించవచ్చు.
     {పయాణికుల భద్రతకు సంబంధించిన పలు చర్యలను ప్రకటించవచ్చు.
     ఎంపీల డిమాండ్ మేరకు పలు లైన్ల పొడిగింపు, కొత్త లైన్ల కొరకు సర్వే తదితర ప్రకటనలు ఉండొచ్చు.
     మరో 1500 కిమీల రైల్వేలైన్ విద్యుదీకరణకు నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం 65 వేల కి.మీ.ల రైల్వేలైన్లో ఇప్పటివరకు కేవలం 24 వేల కి.మీ.ల లైన్‌ను మాత్రమే విద్యుదీకరించారు.
     రద్దీ అధికంగా ఉండే మార్గాల్లోని 20 ప్రధాన రైళ్లలో డిమాండ్ ఆధారిత చార్జీల విధానం అమలు చేసి.. ఆదాయ లోటును తగ్గించుకునే దిశగా ఒక ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు.
     2009 ఎన్నికల సంవత్సరం నాటి బడ్జెట్లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయాణికుల చార్జీలను 2 శాతం తగ్గించారు. అయితే, ఈ సారి ఆశించిన ఆదాయం లేకపోవడంతో తగ్గుదల నిర్ణయం ఉండకపోవచ్చు.
     {పయాణికులపై భారం తగ్గించే దిశలో ఇంధన సర్దుబాటు చార్జీలో మార్పులు చేయొచ్చు.
  పలు రైళ్లలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలను కూడా రైల్వేమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. ముఖ్యమైన రైళ్లలో అగ్నిప్రమాదాల నిరోధానికి చేపట్టిన చర్యలను వివరించే అవకాశముంది.
     అన్ని స్టేషన్లలో ఆధునీకరించిన రైల్వే సమాచార వ్యవస్థ ఏర్పాటు, ప్రధానస్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌ల ఏర్పాటుపై ప్రకటన చేయొచ్చు.
 సంస్కరణలు కోరుకునే మంత్రిగా పేరున్న ఖర్గే.. రైల్వే ఆదాయాన్ని పెంచే దిశగా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీలు, దురంతో ట్రైన్ల చార్జీల్లో పెంపు మొదలైనవి అందులో ఉన్నాయి. అలాగే,  ఢిల్లీ- ముంబై మార్గంలో ప్రత్యేక రైళ్లలో డిమాండ్ ఆధారిత చార్జీల విధానం అమలు చేయడం వల్ల దాదాపు 35 శాతం అధిక ఆదాయం లభించింది.
 
 తప్పుడు నిర్ణయాలతో రైల్వేకు
 రూ. 2,486 కోట్ల నష్టం: కాగ్
 న్యూఢిల్లీ: సరుకుల రవాణాలో ద్వంద్వ చార్జీల విధానానికి సంబంధించి అవకతవక నిర్ణయాల వల్ల రైల్వేశాఖకు 2008-12 మధ్యకాలంలో రూ. 2486.68 కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వెల్లడించింది. ముడి ఇనుము ఖనిజ రవాణాకు తగ్గింపు చార్జీలను వర్తింపజేయడం వల్ల ఈ నష్టం జరిగినట్లు పేర్కొం ది. కాగ్ పేర్కొన్న వివరాలు..  2008 మేలో రైల్వే శాఖలో ద్వంద్వ చార్జీల విధానాన్ని ప్రారంభిం చారు.
 
 దీనివల్ల ముడి ఇనుము ఖనిజం ఎగుమతి రవాణా చార్జీలు.. దేశీయ అవసరాల కోసం జరిపే రవాణా చార్జీల కన్నా 3 రెట్లు ఎక్కువ.  దేశీయ రేట్ల వర్తింపునకు అర్హత కల్పించే ఎలాంటి పత్రాలను సమర్పించకపోయినా.. 358 సంస్థలకు దేశీయ రేట్లను వర్తింపజేశారు.  వాటిలో 153 సంస్థలు అసలే పత్రాలను అందించలేదు. వీటికి తగ్గింపు చార్జీలను వర్తింపజేయడం వల్ల 2008-12 మధ్య రూ.258.38 కోట్లను రైల్వేశాఖ నష్టపోయింది.  205 సంస్థలు కొన్ని డాక్యుమెంట్లను  అందించాయి. వీటికి దేశీయ రేట్లను అంగీకరించడంతో రూ.2,228.30 కోట్ల నష్టం వాటిల్లింది.  
 
 ఈ ఏడాది ‘ప్లాన్ హాలిడే’: దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ
 గుంతకల్లు, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్‌కోసం ఆర్థిక అంశాలతో ముడిపడిన ఏ కొత్త ప్రతిపాదనను పంపలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి గుంతకల్లులో విలేకరులతో మాట్లాడారు. 15 రోజులక్రితం న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు కార్యాలయంలో జనరల్ మేనేజర్ల సమావేశంలో గత ప్రతిపాదనలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యతివ్వాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే భారీగా నిధులు అవసరమవుతాయని, అందువల్ల ఆ ప్రయత్నాన్ని ఈ ఏడాది విరమించామని చెప్పారు. ఈ ఏడాది రైల్వేలో పరోక్షంగా ‘ప్లాన్ హాలిడే’ ప్రకటించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో కోచ్ రీహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి అవసరమైన రూ.250 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించే అవకాశముం దన్నారు. డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడంతో రైల్వేపై భారం పడుతోందని, దీంతో విద్యుదీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement