న్యూఢిల్లీ: డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలడిగిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన దర్శన్ హీరానందాని, ఇతర వ్యక్తులతో కలిసి మహువా కుట్ర పన్నారని, పార్లమెంటు కల్పించిన ప్రత్యేక హక్కులను సొంతానికి వాడుకుని జాతి భద్రతను ప్రమాదంలో పడేశారని కేసు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
లోక్‌పాల్ ఆదేశాల మేరకు మార్చ్ 21నే సీబీఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ కేసులో మహువాతో పాటు చేర్చిన ఇతర నిందితుల పేర్లు, సెక్షన్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణలో సీబీఐ ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని మహువా ఇళ్లపై ఇటీవల సీబీఐ సోదాలు కూడా జరిపింది. కాగా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని వద్ద డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లక్ష్యంగా మహువా ప్రశ్నలడిగారన్న ఆరోపణలపై లోక్‌సభ నుంచి ఆమె సభ్యత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 8న స్పీకర్ రద్దు చేశారు.
అంతకుముందు ఈ వ్యవహారంలో విచారణ జరిపిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఆమె స్నేహితుడు హీరానందాని స్వయంగా లేఖ రాశారు. మహువా తన పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తనకు ఇచ్చారని దీని ద్వారా తాను ప్రశ్నలను నేరుగా పోస్ట్ చేయగలిగానని లేఖలో తెలిపారు. ఇది మోదీ రాయించిన లేఖ అని అప్పట్లో మహువా మండిపడ్డారు. కాగా, తాజాగా కేసులో మహువాతో పాటు హీరానందానిని కూడా ప్రధాన నిందితునిగా చేర్చడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment