కోల్‌కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్‌కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
క్యాష్ ఫర్ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు.
డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్‌ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment