కేంద్రమంత్రి పదవికి కావూరి రాజీనామా
కేంద్ర మంత్రి పదవికి ఏలూరు లోక్సభ సభ్యుడు కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. కావూరి తన రాజీనామా లేఖను గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్కు స్వయంగా అందజేశారు. రాష్ట్ర విభజనే...పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్ పెండింగ్‌లో పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఈ సందర్భంగా ప్రధానితో కావూరి పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి కావూరి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలను ముమ్మరం చేశారు. కావూరి రాకను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారు.
అయితే పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు మాత్రం కావూరి రాకను పూర్తిగా వ్యతిరేకించారు. ఒకానొక క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం నాయకులకు, చంద్రబాబు నాయుడుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సదరు జిల్లా నాయకుల మాటలకు తలవంచక తప్పలేదు. దాంతో చంద్రబాబు మరో పార్టీ చూసుకో అని కావూరికి ఓ సలహా పడేశారంటా. దాంతో బీజేపీలోకి వెళ్లేందుకు కావూరి ఇప్పటికే తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారని సమాచారం. అయితే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దగ్గుబాటి పురందేశ్వరీ ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.