రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల తీవ్రతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని.. త్వరలోనే విభజన నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల తీవ్రతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని.. త్వరలోనే విభజన నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందేనన్నారు. హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకోవటంలో మూడు ప్రాంతాల ప్రజల పాత్ర, కృషి ఉందని.. రాజధాని నగరం తెలుగు ప్రజలందరికీ చెందాల్సిందేనని పేర్కొన్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రిపదవులకు రాజీనామాలు చేయటంతో సహా ఎలాంటి చర్యకైనా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగిస్తే ఒనగూరే ప్రయోజనాలను శాస్త్రీయబద్ధంగా ఆంటోనీ కమిటీకి నివేదిస్తామని చెప్పారు.