సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రకటన
కేంద్ర మంత్రి కావూరి నివాసంలో గంటకుపైగా భేటీ
పనబాక, కిశోర్ మినహా మంత్రులంతా హాజరు
బీజేపీ కాళ్లు పట్టుకుంటున్న కాంగ్రెస్..
సొంత ఎంపీలకు ఏమి కావాలో అడగలేదా?
బిల్లును అడ్డుకొనేందుకు వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్న ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు స్పష్టంచేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఢి ల్లీలోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో బుధ వారం రాత్రి ఎనిమిది గంటలకు సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. గంటకుపైగా సాగిన ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పల్లంరాజు, జేడీ శీలం, చిరంజీవి, ఎంపీలు బొత్స ఝాన్సీ, అనంత వెంకటరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు, బహిష్కృత ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, సబ్బం హరి, సాయిప్రతాప్, ఉండవల్లిఅరుణ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన అరగంట తర్వాత కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు వచ్చారు. తెలంగాణ బిల్లు, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపైనా చర్చించినట్లు సమాచారం. బీజేపీ కాళ్లు పట్టుకుని బిల్లుకు మద్దతు కోరుతున్న కాంగ్రెస్ పెద్దలు.. సొంత పార్టీ ఎంపీలను చేతులు పట్టుకుని ఏం కావాలో అడగలేని స్థితిలో ఉన్నారని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకోవాలని వీరంతా నిర్ణయించినట్లు తెలిసింది.
సమావేశం అనంతరం ఎంపీలు మాగుంట శ్రీనివాసులు, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్ విలేకరులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకునేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు వస్తోందన్నారు. రైల్వే బడ్జెట్ సమయంలోనూ నలుగురు కేంద్ర మంత్రులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన తెలిపారని, పార్లమెంటు చరిత్రలోనే ఇది మొదటిసారి అని తెలిపారు. తెలంగాణ బిల్లు పెడితే మిగిలిన మంత్రులు కూడా వెల్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బహిష్కృత ఎంపీ సాయిప్రతాప్‌తో అవిశ్వాస తీర్మానం పెట్టిస్తామని, ఇందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగడుతున్నామని చెప్పారు. నలుగురు కేంద్ర మంత్రులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో ప్రభుత్వానికి దిమ్మతిరిగిందని లగడపాటి అన్నారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని కవచంలా అడ్డు పెట్టుకుంటామన్నారు. కాగా, ఈ సమావేశానికి సీమాంధ్రకే చెందిన కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిశోర్‌చంద్రదేవ్ హాజరుకాలేదు.
అవిశ్వాసానికి మద్దతివ్వను : కనుమూరి బాపిరాజు
పార్లమెంటులో సహచర ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తాను మద్దతివ్వనని లోక్‌సభ సభ్యుడు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. ప్రజల మనోభావాలు తెలిపేందుకు మూడు రోజులుగా లోక్‌సభలో వెల్‌లోకి వచ్చి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. 36 ఏళ్ల తన రాజకీయ జీవితంలో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలా వెల్‌లోకి వెళ్లలేదని అన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పదేళ్లు యూటీ చేస్తే ఓకే: కావూరి
పదేళ్లపాటు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే తెలంగాణ బిల్లుకు శాస్త్రీయత వస్తుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. పది సంవత్సరాల్లో సీమాంధ్రలో అన్ని సదుపాయాలూ అభివృద్ధి చేసుకునే వీలుంటుందని, అప్పుడు రాష్ట్రం విడిపోయినా ఏ ప్రాంతానికీ ఇబ్బంది ఉండదన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని విజయ్‌చౌక్‌వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం ఆత్మగౌరవం, స్వయంపాలన అన్న అంశాల ప్రాతిపదికనే రాష్ట్రాన్ని విభజించడం సరికాదన్నారు. ఇలా చేస్తే దేశంలో అన్ని ప్రాంతాలనూ ముక్కలు చేయాల్సి వస్తుందన్నారు. ఎంపీగా ఏనాడూ సభలో వెల్‌లోకి వెళ్లని తాను ప్రజల భావాలు తెలిపేందుకు కేంద్ర మంత్రిగా ఉన్నా ఈ రోజు వెల్‌లోకి వెళ్లానని చెప్పారు. తనది ప్రాంతీయ వాదంకాదని, దే శీయవాదం అని పేర్కొన్నారు.
తెలుగు జాతి పరువు తీశారు: టీ ఎంపీలు
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, టీడీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్ సందర్భంగా సభలో తెలుగు జాతి పరువు తీశారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. సభలో వెల్‌లోకి దూసుకెళ్లడం, అధికారులను దూషించడం, బడ్జెట్ కాగితాలను చించివేయడం, పెన్నులు లాక్కోవడం అవమానకరంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేశ్‌షెట్కార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు బుధవారం విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు.