తెలంగాణ బిల్లుకు సవరణ సంకటం!
* 25 సవరణలకు పట్టుబట్టిన బీజేపీ
* రాజ్యసభకు రాని విభజన బిల్లు
* వెంకయ్య, జైట్లీలతో ప్రధాని మన్మోహన్ చర్చలు
* సీమాంధ్రకు ‘ప్రత్యేక ప్రతిపత్తి’కి సోనియా సూచన
* దీనిపై సభలో ప్రధానమంత్రి ప్రకటన చేసే అవకాశం
* బిల్లుకు సవరణలు లేకుండా మధ్యే మార్గం యోచన
* ఎటూ తేలని పరిస్థితి.. నేడు రాజ్యసభకు టీ-బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరంభమైనప్పటి నుంచీ రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు.. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందటంతో ఇక ఓ కొలిక్కి వచ్చినట్లేనని అంతా భావిస్తుండగా.. గురువారం అనూహ్య మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో బేషరతు మద్దతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ.. అదే బిల్లుకు రాజ్యసభలో సవరణలు ప్రతిపాదిస్తామంటూ కొత్త మెలిక పెట్టింది.
బీజేపీ ఇవే సవరణలను లోక్‌సభలో ఎందుకు తేలేదు? రాజ్యసభలో సవరణలకు పట్టుబట్టడం వెనుక ఆ పార్టీ ఉద్దేశం ఏమిటి? బీజేపీ కోరిన సవరణలను రాజ్యసభలో ఆమోదిస్తే.. ఆ బిల్లును తిరిగి లోక్‌సభకు తెచ్చి ఆమోదించుకోవాలి కాబట్టి.. మరి అప్పుడు బీజేపీ మళ్లీ మద్దతిస్తుందా? లేక బిల్లును ఓడిస్తుందా? అసలు బీజేపీ స్వరం మార్చటంలో ఉద్దేశం ఏమిటి? అనేవి అర్థంకాక కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్నాయి. దీంతో.. ఎజెండాలో ఉన్నప్పటికీ కేంద్రం బుధవారం రాజ్యసభలో విభజన బిల్లును ప్రవేశపెట్టకుండా ఆపేసింది. ప్రతిపక్ష నేతలతో మంతనాలు జరుపుతున్న ప్రభుత్వ పెద్దలు బిల్లును గురువారం రాజ్యసభలో పెట్టనున్నారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించకపోవటంతో.. బిల్లు మళ్లీ ఎటు తిరుగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
జైట్లీ, వెంకయ్యలతో ప్రధాని భేటీ...
రాజ్యసభలో బిల్లు బుధవారమే ఆమోదం పొందితే రాష్ట్రంలో (ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో) రాష్ట్రపతి పాలన కాకుండా.. ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం వరకూ భావించింది. కానీ బీజేపీ లోక్‌సభకు.. రాజ్యసభకు మధ్య భిన్నవైఖరి ప్రదర్శించటంతో కేంద్రం ఖంగుతిన్నది. దీంతో స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రంగంలోకి దిగారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడులతో పార్లమెంటులోనే భేటీ అయ్యారు. అదే సమావేశంలో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కమల్‌నాథ్, జైరాంరమేశ్, అహ్మద్‌పటేల్ కూడా ఉన్నారు. ఈ భేటీలో గంటపాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. పార్టీ తరఫున 25 సవరణలు ప్రతిపాదించినట్లు, వీటిలో తాను 20, జైట్లీ 3, ప్రకాశ్ జవదేకర్ 2 సవరణలు ప్రతిపాదించినట్లు వెంకయ్యనాయుడు ఆ తర్వాత మీడియాకు తెలిపారు.
సోనియా ‘స్వయం ప్రతిపత్తి’ సూచన!
అయితే.. రాజ్యసభలో ఇప్పుడు ఏ సవరణ ఆమోదించుకున్నా.. దాన్ని తిరిగి లోక్‌సభలో ఆమోదించుకోవాల్సి ఉంటుందని, అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ప్రధాని బీజేపీ నేతలతో భేటీలో సందేహం వ్యక్తంచేసినట్లు సమాచారం. బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లినా మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అనుమానాలు అక్కర్లేదని వెంకయ్యనాయుడు వివరించినట్లు తెలిసింది. అయితే.. ఇదే సందర్భంలో సోనియాగాంధీ సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలన్న యోచనను ప్రధానమంత్రికి ప్రతిపాదించినట్లు సమాచారం. బీజేపీ సవరణల ప్రతిపాదనలతో కేంద్రం దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రితో భేటీ అనంతరం బీజేపీ నేతలు పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ప్రధానితో చర్చల సారాంశాన్ని వివరించారు.
క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాలా?
‘పార్టీపరంగా మేం కోరిన సవరణలన్నీ మీరు అధికారికంగా ప్రవేశపెడతారని భావించాం. అందుకే మేం లోక్‌సభలో ఇవ్వలేదు. కానీ మీరు అధికారిక సవరణల్లో ఇవ్వలేదు. అందుకే రాజ్యసభలో ప్రతిపాదించబోతున్నాం...’ అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని వద్ద తాము చేసిన ప్రతిపాదనలపై కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా రాలేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. అయితే.. అసలు బీజేపీ అగ్రనేతల్లోనే అయోమయం ఉందని.. అందుకే సభను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సీనియర్ కేంద్రమంత్రి ఒకరు విమర్శించారు. మొత్తంగా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఎవరికి వారుగా క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాని ప్రత్యేక ప్రకటన అవకాశం?
మరోవైపు.. ఇంతగా సహకరిస్తున్నందున ప్రతిపక్షం కూడా భంగపడరాదని, ఆ పార్టీకి కూడా ఇబ్బంది కలగకుండా ఏదైనా ఉపశమనంగా ప్రధానమంత్రి ద్వారా ప్రత్యేక ప్రకటన చేయించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందుకు బీజేపీ కూడా సానుకూలంగా స్పందిస్తే గురువారం రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుంది. లేదంటే రాజ్యసభలో సవరణలు ఆమోదం పొంది.. తిరిగి లోక్‌సభకు వచ్చి ఆమోదం పొందాలంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరికొంత కాలం పొడిగించాల్సి ఉంటుంది. కానీ కేంద్రం వద్ద అంత సమయం కనిపించడంలేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు బీజేపీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది.
వెంకయ్య ప్రతిపాదించిన సవరణల్లో ముఖ్యమైనవి
- మొదట చెప్పినట్లుగా కుకునూరు, వేల్పేరుపాడు, బూర్గుంపాడు (పాల్వంచ రెవెన్యూ డివిజన్), చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలను సీమాంధ్రలో కలపాలి. (నిజానికి కేబినెట్ సవరణలను ఆమోదించినపుడు ఈ ఏడు మండలాలను సీమాంధ్రకే కలిపింది. అయితే ఖమ్మం జిల్లా నాయకుల అభ్యంతరాలతో నిర్ణయం మార్చుకొని పోలవరం కింద ముంపుకు గురయ్యే గ్రామాలను మాత్రమే సీమాంధ్రకు కలుపుతామని ప్రకటించింది. వెంకయ్యనాయుడు మాత్రం భద్రాచలం పట్టణం మినహా మొదట చెప్పినట్లుగా ఈ ఏడు మండలాలను పూర్తికే సీమాంధ్రకే ఇవ్వాలని కోరారు)
- ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు వీలుగా గవర్నర్‌కు అధికారాలను కల్పిస్తూ 121వ రాజ్యాంగ సవరణ చేయాలి. పేర్కొన్న కాలానికి (పదేళ్లు) హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి ఇది రాజ్యాంగబద్ధతను ఇస్తుంది. ‘371కె’గా దీన్ని రాజ్యాంగంలో చేర్చాలి.
- విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ఉండే రెవెన్యూ లోటును అంచనా వేయడానికి స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించడం కేంద్రం బాధ్యత. ఈ లోటును పూడ్చడానికి భారత సంచిత నిధి నుంచి కనీసం పదేళ్ల వరకు దశలవారీగా నిధులు విడుదల చేయాలి. విభజన జరిగిన తొలి ఏడాదిలోనే కేంద్రం 10 వేల కోట్లు ఇవ్వాలి.
- పోలవరం నిర్మాణానికయ్యే ఖర్చును, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఇచ్చే ప్యాకేజీల వ్యయాన్ని భారత సంచిత నిధి నుంచి భరించాలి.
- పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తూ... బిల్లులో ‘సాగునీటి ప్రాజెక్టు’ అనే స్థానంలో ‘బహుళార్థ సాధక ప్రాజెక్టు’గా మార్చాలి.
- ‘ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది’ అని బిల్లులో ఉంది. ఇక్కడ తీసుకుంటుందనే పదాన్ని తొలగించాలి. నిర్దిష్టంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తుందని ఉండాలి.
- సీమాంధ్రకు పన్నుల మినహాయింపు ఇవ్వటం
- నీటిపారుదలలో ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హామీలు ఇవ్వటం
మాట నిలబెట్టుకోలేనందుకే సవరణలు
‘‘విభజన బిల్లుకు మేం ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. లోక్ సభలోనే మేం ఈ సవరణలను ప్రతిపాదించేవాళ్లం.. కానీ అంతకుముందు మా నాయకురాలు (లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్) అసలు బిల్లును సభలో పెట్టినట్టే కాదని అన్నందున.. మేం సవరణ లు ప్రతిపాదించదలుచుకోలేదు. పైగా.. మాతో అంతకుముందు కేంద్రమంత్రి జైరాంరమేశ్ తదితరులు చర్చలు జరిపినప్పుడు బీజేపీ చేస్తున్న ప్రతిపాదనలన్నీ అధికారిక సవరణలుగా తెస్తామని చెప్పారు. కానీ వారు మాట నిలబెట్టుకోలేదు. అందుకే రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించబోతున్నాం. ఒక్క చెన్నై - విశాఖ కారిడార్ ఏర్పాటుకు మాత్రమే కేంద్రం సుముఖంగా ఉంది...’’
- వెంకయ్యనాయుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు
(ప్రధానితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ)
బీజేపీ 24 గంటల్లో మాట మార్చింది
‘‘బీజేపీ 24 గంటల్లో మాట మార్చింది. లోక్‌సభలో మద్దతిచ్చి.. ఇప్పుడు సవరణలు అంటోంది..’’
- కమల్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి