'స్వర్గీయ' వాజ్పేయి అట!!
ఆయన ఏ భాషలో మాట్లాడినా, ప్రసంగాల్లో ప్రాస కోసం పాకులాడతారు. అధికార యావతో అవసరాన్ని బట్టి రెండు నాల్కలూ వాడతారు. తమ కారణంగానే తెలంగాణ ఏర్పాటయిందంటారు. అవసరాన్ని బట్టి ఆయన రెండు నాల్కలు ఒకదాని వెంట ఒకటి ఆటోమేటిగ్గా బయటకొచ్చేస్తాయి. బతికున్న వాజ్‌పేయిని స్వర్గీయ నాయకుడిగా చెప్పగలగడం కూడా బహుశా ఆయన ఒక్కడికే చెల్లుతుంది. ఆయనే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు. ఏప్రిల్ 30న తెలంగాణలో పోలింగ్ పూర్తవగానే మోడీ బీజేపీ ఒక నాలుకను లోపలికి తోసేసి.. రెండో నాల్కను బైటకు తెచ్చింది. రాష్ట్ర విభజనపై మొసలి కన్నీరు కార్చడం మొదలెట్టింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా.. అడ్డంగా దగ్గరుండి రెండు ముక్కలు చేసిన బీజేపీ.. విభజనపై ఇప్పుడు వెంకయ్యనాయుడు గొంతుతో భిన్న స్వరం వినిపిస్తోంది.
రాష్ట్ర విభజనపై ఇప్పుడు నీతివాక్యాలు వల్లిస్తున్న బీజేపీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేనాటికే.. తాను ఆడాల్సిన నాటకాన్ని బీజేపీ రచించుకుంది. లోక్‌సభలోను, రాజ్యసభలోను నాటకాన్ని రక్తికట్టించే మహా నటుల్ని ఎంచుకుంది. లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీకి బదులు వెంకయ్యనాయుడు. మొదట బిల్లు ప్రవేశపెట్టిన తీరుపై మండిపడినా, అరగంటలో అంతా వదిలేసి అసలు రూపం బయట పెట్టుకున్నారు. అధికార పార్టీతో చేతులు కలిపేసి ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా నరికేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాక.. తెలంగాణ ఏర్పాటులో పెద్దమ్మ సోనియాతో పాటు.. చిన్నమ్మనూ గుర్తుపెట్టుకోమన్నారు సుష్మా స్వరాజ్.
లోక్‌సభలో తతంగం పూర్తయ్యాక.. రాజ్యసభలో వెంకయ్యనాయుడు తన వంతు పాత్రను అమోఘంగా పోషించే ప్రయత్నం చేశారు. తన తాపత్రయం తెలుగువారికి అర్థం కావాలన్నట్లు రాజ్యసభలో తెలుగులోనూ మాట్లాడారు. సవరణలు ప్రతిపాదిస్తూ.. ఓటింగ్‌కు పట్టుబడతామన్నారు. అయితే ఓటింగ్‌కు పట్టుబట్టకపోగా.. కొన్ని సవరణల ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నారు. మరికొన్నిటిని రాజ్యసభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. చేయాల్సింది అంతా చేసేసి.. మా కారణంగానే సీమాంధ్రకు ఆ మాత్రం న్యాయమైనా జరిగిందంటున్నారు వెంకయ్యనాయుడు. అయితే.. తల్లిని చంపేసి బిడ్డను బతికించిందంటూ ఇప్పుడు చిలకపలుకులు వల్లిస్తున్న మోడీకి.. ఆ తల్లిని చంపడంలో తమ చేతికంటిన రక్తం సంగతేంటని జనం ప్రశ్నిస్తున్నారు. తెలుగుతల్లిని చంపిన నేరంలో బీజేపీ పాత్రను సీమాంధ్రజనం మరచిపోలేరంటున్నారు.
బీజేపీ వాళ్ళకి ఆరాధ్య దైవమైన వాజ్‌పేయిని సైతం స్వర్గీయ నాయకుడిగా చెప్పిన వెంకయ్య నాయుడు.. స్పృహ కోల్పోయారనీ,ఎవరికో మేలుచేసే ఆలోచనలో ఏదేదో మాట్లాడేస్తున్నారనీ విమర్శకులంటున్నారు. సీమాంధ్రలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండగా.. రాష్ట్ర విభజనపై వెంకయ్యనాయుడు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు పచ్చముసుగులో ఓట్లు దోచుకోడానికి చేస్తున్న వృధా ప్రయత్నాలే తప్ప..మాట నిలకడ లేని మనుషుల్ని, వారి నాయకత్వాన్ని జనం విశ్వసించరనీ ఓట్లు వేయరనీ అంటున్నారు సీమాంధ్ర ప్రాంతవాసులు.