ఇది మరో డ్రామానా? | Is it another Drama? | Sakshi
Sakshi News home page

ఇది మరో డ్రామానా?

Published Thu, Sep 19 2013 9:32 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

ఇది మరో డ్రామానా?

ఇది మరో డ్రామానా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి 50 రోజులు గడిచిన తరువాత ఎట్టకేలకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయడానికి  సిద్ధపడ్డారు. మరో పక్క ఎంపి లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి రాజీనామాలు చేయకుండా ఉండాలని అంటున్నారు. వారి మాటలలో స్పష్టత లోపించినట్లు కనిపిస్తోంది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది జులై 30న  రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ప్రజా ఉద్యమం ఊపందుకుంది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేశారు. ఉద్యమం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత అండలేకుండా ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ తరువాత ఎన్జీఓలు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు మొదలు పెట్టారు. దాంతో ఉద్యమం ఉధృతమైంది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, టిడిపి  ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎదోఒకటి చెబుతూ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు.

 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి  నోట్‌ సిద్ధమైనట్లు  కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు ప్రకటించడంతో  సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలలో కలకలం మొదలైంది. వాస్తవానికి షిండే మొదటి నుంచి విభజన ప్రక్రియ ఆగదని చెబుతూనే ఉన్నారు.  కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో  సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ  లేదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్లు ఈ నెల 3న ప్రకటించారు.  నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యం జరగదని కూడా చెప్పారు. ఆ ప్రకారంగా 20 రోజులు కూడా కాక ముందే నోట్ సిద్దమైనట్లు ప్రకటించారు.  హైదరాబాద్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా షిండే చెప్పారు. అయితే రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాదని చెప్పారు. నోట్ను పరిశీలించిన తరువాత న్యాయశాఖ పరిశీలనకు పంపుతామన్నారు.

షిండే ప్రకటనతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులలో కదలిక వచ్చింది. నోట్పై మంత్రి మండలి  చర్చిస్తే పరిస్థితి విషమించుతుందన్న ఆందోళన వారిలో మొదలైంది. అందరితో చర్చలు జరిపి సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని భావించారు. కాని ఇప్పుడు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్ర ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేయడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారందరూ కలిసి ఈరోజు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేసినా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు ఒక అడుగు ముందుకు వేసి రాజీనామా లేఖపై సంతకాలు కూడా చేశారు. ఆ లేఖను పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించాడానికి సిద్ధపడ్డారు.  ఈ నెల 24న లోక్సభ స్పీకర్ మీరా కుమార్ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు.

ఆ తరువాత ఎంపి లగడపాటి మాట్లాడుతూ అంతిమ విజయం సమైక్యవాదానిదేనన్నారు. సమైక్యాంధ్ర మినహా హైదరాబాబ్ కేంద్ర పాలిత ప్రాంతం గానీ, మరే ఇతర ప్రత్యామ్నాయానికి తాము అంగీకరించం అని చెప్పారు. విభజన దిశగా ఒక్క అడుగు ముందుకేసినా తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ వద్ద మొండికేసుకొని కూర్చుంటామన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇవ్వకుండా ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదులేనన్నారు. శిలాశాసనానికి చోటులేదు-ప్రజా శాసనానికే చోటు అన్నారు. తమని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని, పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. తెలంగాణ అంశంలో కేంద్రం ముందుకెళ్లదని భరోసా కల్పిస్తేనే రాజీనామా ప్రతిపాదన విరమించుకుంటామని చెప్పారు.  షిండే కేబినెట్‌ నోట్‌ నిజమని తేలితే రాజీనామా చేస్తామని చెప్పారు. ఇన్ని మాటలు చెప్పిన లగడపాటి చివరగా పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి తాము ఉండి తీరాలన్నారు.

లగడపాటి చూస్తే స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులు తమ రాజీనామా పత్రాలు స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం అంతా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఉత్తుత్తి రాజీనామా ప్రకటనలుగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిని మరో డ్రామాగా పలువురు భావిస్తున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement