సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసిందే. తామంతా స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించినట్లు వీరు గతంలోనే ప్రకటించారు. వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్ వద్దకు వెళ్లి ఆమెకు తమ రాజీనామాకు గల కారణాలేంటో వెల్లడించారు. స్పీకర్ వద్దకు వెళ్లిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు. అయినా.. ఇప్పుడు స్పీకర్ మీరాకుమార్ మాత్రం అందరి రాజీనామాలను మూకుమ్మడిగా తిరస్కరించారు.
రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరారు), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగడపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు.
స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు.
13 మంది ఎంపీల రాజీనామాల తిరస్కరణ
Published Fri, Oct 18 2013 3:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement