రాజీనామాల ఆమోదం స్పీకర్ నైతిక బాధ్యత
రాజీనామాలపై స్పీకర్ ఈరోజే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శనివారం మధ్యాహ్నం స్పీకర్ మీరాకుమార్ను విడివిడిగా ఆమె ఛాంబర్లో కలిసి, తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ప్రజల కోరిక మేరకే తాము రాజీనామాలు చేస్తున్నామని, సీమాంధ్రుల మనోభావాలు అధిష్ఠానం దృష్టికి తెచ్చామని చెప్పారు. రాజీనామాలు చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని ప్రజలు చెప్పబట్టే వాటి ఆమోదానికి వచ్చామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని అందరూ వ్యక్తిగతంగా చెప్పామని, వాటిని ఆమోదించడం స్పీకర్ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు.
సాధారణంగా స్పీకర్ శని, ఆదివారాల్లో పార్లమెంటుకు రారని, కానీ తమ ఒత్తిడి మేరకు ఆమె వచ్చి.. తమ నలుగురితో మాట్లాడారని సాయిప్రతాప్ చెప్పారు. తాము ఎంతమంది, ఎవరెవరు వచ్చామో కూడా టిక్ పెట్టుకున్నారని, గతంలోనే చేసిన రాజీనామాలు ఆమోదించాలని మరోతూరి కోరామని ఆయన అన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందని, మా కర్తవ్యాన్ని స్పీకర్ ముందు చెప్పామని అన్నారు.
ఇదే సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ''స్పీకర్ను వ్యక్తిగతంగా చాంబర్లో కలిశాం. ఆగస్టు 2న రాజీనామాలు చేశాం. గతంలోనూ ఓసారి చెప్పాం. ఇప్పటికి 57 రోజులైపోయింది, అయినా సమాధానం లేదు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయొద్దని కోరాం. రాతపూర్వకంగా మరోసారి ఇచ్చాం. సాయంత్రంలోగా ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెబుతాం'' అని అన్నారు.
ఎంపీలు రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని ఉద్యమిస్తున్న ప్రజలు చెప్పడంతో తాము ఆలోచించుకుని.. ఆమోదానికి పట్టుబట్టామని ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. సాయంత్రానికి లెక్కలన్నీ తేలిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం యథార్థ పరిస్థితిని చెప్పారని, ఈ రాష్ట్రాన్ని విడదీయాలనే ప్రయత్నంలో ఎన్ని చిక్కుముడులున్నాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విశ్లేషించారని అన్నారు. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే, సీమాంధ్రులు పట్టుకుని వదలట్లేదన్న అపోహ సరికాదని, రాజధాని అక్కడే ఉంది. విడదీయలేనంత బలమైన లింకులున్నాయని, అందుకే సమైక్యంగా ఉండాలంటున్నామని ఆయన చెప్పారు.