కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.
మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.
నటుడు సిద్దిఖీ పై ఆరోపణ
మలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్‌లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.
ఎం.ఎల్.ఏ పేరు
మరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.
మేము న్యాయపోరాటాలు చేయలేం
ఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.
కాంప్రమైజ్ – అడ్జస్ట్
ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడు
ఫ్యాన్స్ ఆర్మీ
లైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.
తలుపు విరిగేలా బాదుతారు
‘ఔట్‌డోర్ షూటింగ్‌లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.
మోహన్‌లాల్ రాజీనామా
30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్‌స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది.
మెంబర్‌షిప్‌కు వెళ్లినా
‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్‌రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్‌బుక్‌లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది.
– ఫ్యామిలీ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment