విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం
ఏడాది సమయమున్నా పాలకవర్గంతో రాజీనామాలు చేయించిన వైనం
ఆ వెంటనే వాటికి ఆమోదం.. త్రీమెన్ కమిటీ ఏర్పాటు
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత వ్యవస్థలను స్వా«దీనం చేసుకునే పనిలో నిమగ్నమైన ‘పచ్చ ముఠా’ క్రీడా సంఘాల్లోకి కూడా చొరబడుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)ను హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కేంద్రంగా ఈ క్రీడా రాజకీయం కొనసాగుతోంది.
ప్రస్తుతం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌చంద్రారెడ్డి, గోపినాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేశ్, కోశాధికారిగా ఎ.వి.చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పురుషోత్తం వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంకా ఏడాది సమయముంది. కానీ ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, క్రికెట్ అకాడమీల ప్రతినిధులు కలిపి మొత్తం 33 మంది హాజరయ్యారు.
గోపినాథ్‌రెడ్డి, రాకేశ్, చలం తమ రాజీనామా పత్రాలతో పాటు మిగిలిన వారివి కూడా తీసుకొని సమావేశానికి వచ్చారు. ఎలాంటి చర్చ లేకుండానే పాలకవర్గం రాజీనామాలను ఆమోదించినట్లు విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుతో ఎంపీ కేశినేని చిన్ని ప్రకటింపజేశారు. ఆ వెంటనే గోపీనాథ్‌రెడ్డి, చలం వెళ్లిపోయారు.
ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్..
ఏసీఏకు ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు విష్ణుకుమార్‌రాజు మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీలో ఆర్.వి.ఎస్.కె.రంగారావు, మాంచో ఫెర్రర్, మురళీమోహనరావును నియమించినట్లు తెలిపారు. వారిలో ఇద్దరికి చెక్ పవర్ ఇచ్చామన్నారు. ఎన్నికలు జరిగే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు.
పాలకవర్గానికి ఉన్న మిగిలిన ఏడాది కాలానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించామన్నారు. సెపె్టంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తారని వెల్లడించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లోని క్రికెట్ సంఘాలను సందర్శించి క్రికెట్ సంఘాల్లో ఉన్న సమస్యలను, క్రీడాకారుల ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment