బంగ్లాలో హిందూ టీచర్లపై దాడులు | Bangladesh interim govt faces backlash over Hindu teachers forced resignations | Sakshi
Sakshi News home page

బంగ్లాలో హిందూ టీచర్లపై దాడులు

Published Mon, Sep 2 2024 4:28 AM | Last Updated on Mon, Sep 2 2024 4:28 AM

Bangladesh interim govt faces backlash over Hindu teachers forced resignations

బలవంతపు రాజీనామాలు 

వాళ్లను స్టూడెంట్లే బెదిరిస్తున్న వైనం 

ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందూ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలైన హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇలా 50 మంది దాకా రాజీనామా చేశారు. వెలుగులోకి రాని ఉదంతాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. 
 
ఆఫీసును ముట్టడించి... 
బరిషాల్‌లోని బేకర్‌గంజ్‌ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్‌ శుక్లా రాణి హాల్దర్‌ కార్యాలయాన్ని ఆగస్టు 29న మూకలు ముట్టించాయి. వీరిలో బయటి వ్యక్తులతో పాటు ఆ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు! తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గంటల తరబడి బెదిరింపులకు దిగారు. దాంతో వేరే మార్గం లేక ఖాళీ కాగితం మీదే ‘నేను రాజీనామా చేస్తున్నాను’ అంటూ సంతకం చేసిచ్చారామె. అజీంపూర్‌ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్‌ గీతాంజలి బారువాతో పాటు అసిస్టెంట్‌ హెడ్‌ టీచర్‌ గౌతమ్‌ చంద్ర పాల్‌ తదితరులతో బలవంతంగా రాజీనామా చేయించారు. వారంతా తన కార్యాలయంపై దాడి చేసి తనను అవమానించారని గీతాంజలి వాపోయారు. 

వైరలవుతున్న వీడియోలు... 
బంగ్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలంటూ హిందూ టీచర్లను, ఇతర సిబ్బందిని బలవంతం చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేధింపుల దెబ్బకు ప్రొక్టర్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచి్చందని కాజీ నజ్రుల్‌ వర్సిటీ పబ్లిక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌ ముఖర్జీ తెలిపారు. 

ఖండించిన తస్లీమా 
ఈ ఘటనలపై బంగ్లాదేశ్‌ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్‌ మండిపడ్డారు. మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. ‘‘హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు హత్యలకు, వేధింపులకు గురవుతున్నారు. జైలుపాలవుతున్నారు. దర్గాలను కూలి్చవేస్తున్నారు. అయినా యూనస్‌ నోరు విప్పడం లేదు’’ అంటూ ఎక్స్‌లో దుయ్యబట్టారు. టీచర్లపై వేధింపులను బంగ్లా ఛత్ర ఐక్య పరిషత్‌ ఖండించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement