
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలోని పీఎం పాలెంలో గల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్‌బాబు తెలిపారు.
ఇక ఈ వన్డే టోర్నీ గ్రూప్-డిలో భాగంగా డిసెంబరు 21 నుంచి జనవరి 5 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్- మిజోరం జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఇక 23న మిజోరం- ఉత్తర్‌ప్రదేశ్, 26న తమిళనాడు- ఉత్తర్‌ప్రదేశ్, 28న చండీగఢ్- విదర్భ, 31న తమిళనాడు- విదర్భ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.
అదే విధంగా.. జనవరి 3న చత్తీస్‌గఢ్- జమ్ము కశ్మీర్, 5న చండీగఢ్- జమ్ము కశ్మీర్ జట్లు తలపడతాయి.ఇక విజయ్ హజారే ట్రోఫీ కోసం వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఇక టోర్నీకి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను జియో సినిమాతో పాటు.. ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్‌సైట్లలో వీక్షించవచ్చు.