- ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ ఆకాంక్ష
- త్వరలోనే విశాఖకు టెస్టు హోదా
- ముగిసిన ఏసీఏ వజ్రోత్సవాలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఆకాంక్షించారు. ఇక్కడి అకాడమీలలో అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఉన్నాయని, వర్ధమాన ఆటగాళ్లు వాటిని ఉపయోగించుకొని కెరీర్‌లో ఎదగాలని ఆయన సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఏసీఏ వజ్రోత్సవాలు ఆదివారం ఇక్కడ ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసన్, చక్కటి స్టేడియం ఉన్న విశాఖకు త్వరలోనే టెస్టు హోదా కల్పిస్తామని చెప్పారు. టెస్టు హోదా గురించి బీసీసీఐ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఐసీసీ పరిశీలనలో ఉందని అన్నారు.
క్రికెట్ అభివృద్ధి కోసం ఒక్కో అసోసియేషన్‌కు బీసీసీఐ దాదాపు రూ. 50 కోట్లు కేటాయిస్తోందని, అన్ని ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధిపై బోర్డు దృష్టి పెట్టిందన్నారు. ‘జార్ఖండ్ తదితర రాష్ట్రాలు ఈ నిధులతో కొత్త స్టేడియాలు నిర్మించుకున్నాయి. గతంతో పోలిస్తే చిన్న నగరాలనుంచి ఆటగాళ్లు ఇప్పుడు ఎక్కువ మంది పెద్ద స్థాయికి చేరుకుంటున్నారు. ధోని ఇందుకు చక్కటి ఉదాహరణ’ అని శ్రీని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో బీసీసీఐతో పాటు ఐసీసీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని, ఐపీఎల్ కారణంగా కూడా ఆదాయం పెరుగుతోందని శ్రీనివాసన్ వెల్లడించారు.
ఆంధ్ర మాజీ క్రికెటర్లకు ఆర్థిక సహాయం నిమిత్తం ఏసీఏ ప్రకటించిన చెక్‌ను అందజేసిన ఐసీసీ చైర్మన్... బీసీసీఐ కూడా గతంలోనే మాజీ ఆటగాళ్లు, అంపైర్ల సంక్షేమం కోసం ‘వన్ టైమ్ బెనిఫిట్ స్కీమ్’ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు శివలాల్ యాదవ్, సంజయ్ పటేల్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు డీవీ సుబ్బారావు, గోకరాజు గంగరాజు, ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీఏ 13 జిల్లాల ప్రతినిధులు శ్రీనివాసన్‌ను గజమాలతో సత్కరించారు.
జాతీయ క్రీడలకు ఆతిథ్యమిస్తాం...
2017లో జరిగే జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర క్రీడా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగు పర్చుకునేందుకు జాతీయ క్రీడల నిర్వహణ మంచి అవకాశమన్న ఆయన... కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వవచ్చని వెల్లడించారు.