మీరు రాజీనామాలు చేయండి.. మేం విరమిస్తాం!
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా సీమాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. అదేసమయంలో రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో చేరాలని సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డిలు స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామాలు చేస్తే చేసుకోండి’ అన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేందుకు యూపీఏ సర్కారు, లోక్‌సభ స్పీకర్‌ను అందుబాటులో లేకుండా చేసిందని విమర్శించారు. రాజీనామాలకు యూపీఏ భయపడుతోందని విమర్శించారు. ‘సీమాంధ్ర ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో దాక్కోవచ్చు. 2014 ఎన్నికల్లో ప్రజల ముందుకు రాకతప్పదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. ఉద్యమం నుంచి తప్పించుకుంటున్న నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ నెల 30 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వాళ్లే హైదరాబాద్ విడిచిపెట్టాలన్న వాఖ్యలపై.. హైదరాబాద్ అందరిదీ అని చెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సీమాంధ్రలో మంగళవారం జరిగిన బంద్ విజయవంతమైందన్నారు.