sonia Gandhi
న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఏడుగురు కేంద్ర మంత్రులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రం విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమం గురించి మంత్రులు క్షేత్రస్థాయిలో సోనియాకు వివరించారు. సమైక్యాంధ్ర వాణి వినిపించారు. రాజధాని, హైదరాబాద్ అంశం, నదీజలాలు, ఉద్యోగుల భద్రతపై వారు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టత కావాలని సీమాంధ్ర మంత్రులు సోనియాను కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పురందేశ్వరీ, కిల్లి కృపారాణి, చిరంజీవి, జెడి శీలం పాల్గొన్నారు. కేంద్ర సహాయమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన ఉదయం కర్నూలు జిల్లా నేతలతో కలిసి వెళ్లి సోనియాను కలిశారు.
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు నిన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలిన విషయం తెలిసిందే. వారందరూ సమైక్యవాదాన్ని వినిపించారు. నిన్న దిగ్విజయ్ సింగ్ను కలిసినవారిలో ఈ ఏడుగురు మంత్రులతోపాటు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర తీర్మానాన్ని వారు దిగ్విజయ్ సింగ్కు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి, జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్పై తాము లేవనెత్తి అంశాలను లిఖితపూర్వకంగా తెలియజేయమని దిగ్విజయ్ సింగ్ కోరినట్లు చెప్పారు. హైలెవల్ కమిటీ ముందు త్వరలోనే తమ వాదనలను వినిపిస్తామన్నారు.