'తెలుగు బిడ్డలా లేక ఇటలీ బిడ్డలా'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన విషయంలో కేంద్ర మంత్రులు, సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు అనుసరిస్తున్న వైఖరి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రలు తెలుగు బిడ్డల్లా కాకుండా ఇటాలీయన్ బిడ్డల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేంద్ర మంత్రులు నడుకుంటున్నారా లేక కేంద్ర మంత్రులు చెప్పినట్లు బాబు నడుచుకుంటున్నారో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఇంత మంది ఉండి కూడా విభజనను ఆప లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ విధంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రమంత్రులు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని గతంలో కేంద్రమంత్రులు చేసిన భీష్మ ప్రతిజ్ఞలు ఏ గాలికి కొట్టుకుపోయాయని ఆమె ఎద్దేవా చేశారు. తడి గుడ్డతో గొంతులు కోసే వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అందుకు అత్యుత్తమ ఉదాహరణ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని అభివర్ణించారు. ప్రజల ఓట్లతో కాకుండా పైరవి నుంచి వచ్చిన సీఎం కాబట్టే కిరణ్ అధిష్టానం వద్ద విభజన అని, రాష్ట్రంలో మాత్రం సమైక్యం అంటు పాట పాడుతున్నారని ఆరోపించారు.
విభజనలో కిరణ్ ఓ పావు మాత్రమే అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బినామీల పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారన్ని అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలను ఏమనాలని ఆమె ప్రశ్నించారు. ఆ నేతలను వారివారి కుటుంబసభ్యులే ఛీదరించుకుంటున్న సంగతిని ఆమె గుర్తు చేశారు.
అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో ఓట్లు, సీట్లు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. అందుకే విభజన కోసం ప్యాకేజీలు, సమన్యాయం అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే ఓ రాష్ట్రంలో ఓట్లతో కొడుకును ప్రధాని చేయడానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా ఆలోచిస్తుందని అన్నారు.
సమైక్యానికి మద్దతుగా ఎందుకు లేఖ ఇవ్వలేకపోతున్నారంటూ చంద్రబాబును వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. విభజనపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వారికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.