విభజన జరిగిపోయింది... మీకేం కావాలో చెప్పండి | Andhra Pradesh State Division Conform, Says AK Antony Committee | Sakshi
Sakshi News home page

విభజన జరిగిపోయింది... మీకేం కావాలో చెప్పండి

Published Fri, Aug 16 2013 1:16 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

మీడియాతో మాట్లాడుతున్న దిగ్విజయ్. చిత్రంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న దిగ్విజయ్. చిత్రంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు

* సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఆంటోనీ కమిటీ స్పష్టీకరణ
* మీ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడుకునే ప్రతిపాదనలు చేయండి
* రెండో ఎస్సార్సీ ఏర్పాటు ప్రతిపాదనకు నో చెప్పిన హైకమాండ్ పెద్దలు
 
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రుల డిమాండ్‌ను ఆంటోనీ కమిటీ తిరస్కరించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని లేదా దేశంలో ‘ప్రత్యేక’ డిమాండ్లనన్నింటినీ పరిశీలించేందుకు రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్(ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసి సీమాంధ్రలో కాంగ్రెస్‌ను కాపాడుకొనే ప్రయత్నం చేయాలన్న సూచనను కూడా అధిష్టానం పెద్దలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు తెలిసింది.

పార్టీలో అత్యున్నత స్థాయిలో నిర్ణయం జరిగిపోయినందున మీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అవసరమైన ప్రతిపాదనలు మాత్రమే చేయాలని ఆంటోనీ కమిటీ సీమాంధ్ర ప్రతినిధులకుస్పష్టంచేసింది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకే సంప్రదింపుల ప్రక్రియను చేపట్టామని తెలిపింది. గురువారం కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రాత్రి పొద్దుపోయిన తర్వాత కమిటీ సభ్యులైన ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, వి.కిశోర్‌చంద్ర దేవ్, ఎం.ఎం.పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జె.డి.శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, తిరుపతి ఎంపీ చింతా మోహన్ సమావేశమయ్యారు.

దాదాపు గంటన్నరకుపైగా ఈ భేటీ సాగింది. సమావేశంలో ముందుగా కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, వివిధ వర్గాలలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను వివరించినట్లు తెలిసింది. రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకోవడాన్ని కిశోర్‌చంద్ర దేవ్ ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నిర్ణయం వెలువడినప్పటి నుంచీ కోస్తా, రాయలసీమల్లో ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం తీరుతెన్నులను మిగిలిన మంత్రులు వివరించారు.

రాష్ట్రాన్ని విడదీస్తూ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని, ప్రజలు తమంతట తాముగా స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తున్నారని, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాలు ప్రజల ఆందోళనలు చేస్తున్నారని, పార్టీని, పదవులను వదులుకోవాల్సిందిగా తమపై విపరీతమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాల శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా ఢిల్లీ తరహాలో ప్రకటించాలన్న వాదనను కూడా కమిటీ సభ్యులు కొట్టిపారేసినట్లు తెలిసింది.

హైదరాబాద్ లేకుండా రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 80, 90 స్థానాలు మాత్రమే ఉంటాయని, దానివల్ల నిరంతరం రాజకీయ అస్థిరత సమస్య తలెత్తే ప్రమాదముందని ఆంటోనీ అభిప్రాయపడినట్లు సమాచారం. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించినంత కాలం మాత్రం ైెహ దరాబాద్ పరిధిలో శాంతిభద్రతల వంటి కొన్ని శాఖలు గవర్నర్ అధీనంలో ఉంచుతామని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం.

ప్రజల ఆందోళనలను వివరించాం: పల్లంరాజు, చిరంజీవి
రాష్ట్ర విభజనతో ఎదురయ్యే తీవ్రమైన సమస్యలను ఆంటోనీ కమిటీకి  వివరించామని, ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని గట్టిగా కోరుకొంటున్నారన్న విషయాన్ని చెప్పినట్లు కేంద్ర మంత్రి పల్లంరాజు వెల్లడించారు. తాము ప్రస్తావించిన సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేస్తామని కమిటీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు,  హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను కమిటీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాలని, తుది నిర్ణయం ఏదైనా ఉభయతారకంగా ఉండాలని చెప్పినట్లు మరో కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పారు. సమన్యాయం అంటే రాష్ట్ర విభజనకు అంగీకరించి సమస్యలను పరిష్కరించమని కోరినట్లేనా అన్న విలేకరుల ప్రశ్నలకు ఆయన  సూటిగా సమాధానమివ్వలేదు. సమన్యాయం అంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చూడడమని అర్థం అంటూ దాటవేశారు.

వార్ రూమ్‌లో రేణుకా చౌదరి
ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర నేతల సమావేశం ప్రారంభమైన సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కాంగ్రెస్ వార్‌రూమ్‌కు రావడం చర్చనీయాంశమైంది. అయితే, తాను ఇతర పార్టీ పనులపై మాత్రమే వార్‌రూమ్‌కు వచ్చానని, ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర నేతల సమావేశానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని పది నిమిషాలలో బయటకు వచ్చిన ఆమె చెప్పారు.
 
త్వరలో హైదరాబాద్ వెళ్తా: దిగ్విజయ్
సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాలను, వాదనలను గట్టిగా వినిపించారని, వారు లేవనెత్తిన అంశాలన్నింటినీ కమిటీ అధ్యక్షుడు ఆంటోనీ నోట్ చేసుకొన్నారని భేటీ అనంతరం దిగ్విజయ్ విలేకరులకు తెలిపారు.

రాష్ట్ర విభజన సమస్యపై ఆంటోనీ కమిటీ సంప్రదింపులు ఈనెల 19, 20 తేదీల్లో కూడా కొనసాగుతాయని, ఈరోజు చర్చలకు హాజరు కాలేకపోయిన సీమాంధ్ర ఎంపీల వాదనలను సోమ, మంగళవారాలలో తెలుసుకొంటామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఇతర నేతలతో, వివిధ వర్గాలు, ప్రజాసంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించేందుకు కమిటీ తరపున త్వరలో హైదరాబాద్ సందర్శిస్తానని సీమాంధ్ర మంత్రులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement