
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మూడు గంటల దీక్ష
Published Wed, Sep 4 2013 1:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అంగీకరించేది లేదంటూ కొద్ది రోజుల కిందట ఢిల్లీలో హడావుడి చేసిన అదే పార్టీ సీమాంధ్ర నేతలు.. తాజాగా శాసనసభ ఆవరణను వేదికగా ‘మూడు గంటల దీక్ష’ చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత మంత్రులు కూడా పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలనూ ఒప్పుకోబోమంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర ప్రజలు సాగిస్తున్న ఉద్యమానికి, ఏపీఎన్‌జీఓలు 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. తమ ఉద్యమాన్ని ఇక ఉధృతం చేస్తామని, వినాయకచవితి తరువాత హైదరాబాద్‌లో 48 గంటల నిరశన దీక్ష చేపడతామని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని, యాత్రలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ‘‘కొత్త రాజధానికి ఐదు లక్షల కోట్లు ఇవ్వాలని బేరం పెట్టిన చంద్రబాబు దానికి కట్టుబడి ఉన్నారా? గెలిపిస్తే ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తానని, విడిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. మీ మాటలు నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులనుకున్నారా? సీమాంధ్రలో టీడీపీ, వైఎస్సార్‌సీపీలు కొంగజపం చేస్తుంటే తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీలు కూడా దొంగనాటకాలే ఆడుతున్నాయి’’ అని విమర్శించారు. ఎన్.టి.రామారావుపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవమనటం సిగ్గుచేటన్నారు. సీమాంధ్ర ప్రజలే కాకుండా తెలంగాణలోని 30 శాతం మంది ప్రజలు సమైక్యాన్నే కోరుకుంటున్నారని వివరించారు.
రాష్ట్ర సమైక్యతను కొనసాగించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరటానికే తామీ దీక్ష చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, దుర్మార్గమైన విభజన నిర్ణయం తీసుకుందని సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణపై ప్రకటన చేస్తూ రాష్ట్రంలోని భాగస్వాములందరినీ సంప్రదించాకనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేశారే తప్ప తెలంగాణ ఇచ్చేయాలనలేదని స్పష్టంచేశారు. ఉదయం పది గంటల నుంచి మూడు గంటల పాటు సాగిన దీక్షలో 18 మంది మంత్రులు, 48 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు బాలరాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్, టి.జి.వెంకటేశ్‌లు హాజరుకాలేదు.
పొంగులేటి గులాబీలు: సీమాంధ్ర నేతల దీక్షా స్థలి వద్ద తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాసేపు హడావుడి చేశారు. సీమాంధ్ర నేతలకు గులాబీలు ఇచ్చి విభజనకు సహకరించాలని కోరబోయారు. దీనిపై మంత్రులు, ఇతర నేతలు అభ్యంతరపెట్టారు. కొందరు నేతలు గులాబీ పువ్వులను తిరిగి పొంగులేటిపైకే విసిరేయగా మరి కొందరు చెవిలో పెట్టుకొని నిరసన తెలిపారు.
Advertisement
Advertisement