కలుపుమొక్కలను ఏరేయాలి: అశోక్‌బాబు | Ashok babu Takes on Seemandhra MPs, Minisers | Sakshi
Sakshi News home page

కలుపుమొక్కలను ఏరేయాలి: అశోక్‌బాబు

Published Thu, Oct 3 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

Ashok babu Takes on Seemandhra MPs, Minisers

‘కృష్ణా’ రైతు మహాగర్జన పిలుపు
రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు ద్రోహులే..: అశోక్‌బాబు
సమైక్యాంధ్ర ద్రోహులకు 2014లో ఓటెయ్యొద్దు
{పాణాలైనా అర్పించి కేంద్ర కేబినెట్ నోట్‌ను అడ్డుకుంటాం
సమైక్యవాదం 19 జిల్లాలకు విస్తరించింది
రాహుల్ చెబితే నేరచరిత్ర ఆర్డినెన్సును ఆపేశారు.. మరి కేబినెట్ నోట్‌కూడా కాని తెలంగాణ నిర్ణయం విరమించలేరా?

 

సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారెయ్యాలని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్‌జీవోల సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు రైతులకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌లో బుధవారం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు  ద్రోహులే అన్నారు. వీరు నిజంగా తెలుగు తల్లికి పుట్టి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేసే ఏ పార్టీ నాయకుడైనా ఓటెయ్యవద్దని, అటువంటి అవకాశ రాజకీయ నాయకులకు 2014 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే బుల్లెట్‌తో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
 
  ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మారిన సంగతి గత ఎన్నికలు రుజువు చేశాయని, 2014 ఎన్నికల్లో అదే చరిత్ర పునారావృతం అవుతుందని హెచ్చరించారు. 2004లో తెలంగాణాపై రెండో ఎస్సార్సీ అన్న పార్టీకి పట్టం కట్టామని, 2009లో అసలు రాష్ట్ర విభజన ప్రాస్తవన లేని పార్టీని గెలిపించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా రాష్ట్ర విభజనను అడ్డుకునే నాయకులకే అండగా నిలుస్తామని అశోక్‌బాబు స్పష్టంచేశారు. తమ ప్రాణాలైనా అర్పించి తెలంగాణా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదానికి రాకుండా అడ్డుకుంటామన్నారు.
 
 రాజకీయాల్లో నేర చరితులు అనే విషయంలో బిల్లు దశకు వచ్చి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిన తరుణంలో కేవలం రాహుల్ గాంధీ అభ్యంతరం చెప్పారని బుట్టదాఖలు చేశారని, అలాంటింది కేబినెట్ నోట్‌గా కూడా రాని తెలంగాణా అంశాన్ని ఎందుకు ఆపలేరని ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు 110 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా సహనానికి కేంద్రంలోని యూపీఏ సర్కార్ పరీక్ష పెడుతోందని, మా చేతల్లో, మాటల్లో గాంధీ ఉన్నా, గుండెల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ ఉన్నారన్న విషయం చాటిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రలోని 13 జిల్లాలకే పరిమితం కాలేదని, ఇది ఖమ్మం, నల్గొండ, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకూ విస్తరించిందన్నారు. అచ్చమైన రైతులే రోడ్డెక్కి గర్జించడం చూస్తే ఈ జిల్లా వాడిగా గర్వపడుతున్నానన్నారు.
 
 కలియుగ ‘హంస’ కేసీఆర్
 పాలు, నీరును వేరుచేసే ప్రత్యేక లక్షణం హంసకు మాత్రమే ఉందని, అలాంటి పాలు, నీరులా కలిసి ఉన్న తెలంగాణా, సీమాంధ్రను వేరుచేసే హంసను తయారు చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని అశోక్‌బాబు విమర్శించారు. తెలంగాణ ఉద్యమం వాస్తవాలపై నిర్మించలేదని, మీడియా, సాహిత్యంవల్లే దానికి ఒక ఊపు వచ్చిందని, అటువంటి జోష్ మన ఉద్యమానికి కూడా అవసరమని అశోక్‌బాబు అన్నారు.
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే  తెలంగాణ వాళ్లకే ఐదేళ్లపాటు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధం కావాలని, అప్పుడైనా ఉద్యమాలు లేని ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుందేమో ఆలోచించాలని అశోక్‌బాబు అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణాకు మద్దతు పలికే మంద కృష్ణమాదిగ గుంటూరులో సభ పెడతానని ప్రకటించారని, ఆయన్ను ఇక్కడ కాలుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఈ రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు  ఆకట్టుకున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement