నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె: అశోక్‌బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెను ఆఖరి అస్త్రంగా ఉపయోగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చిన వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. రైల్‌రోకో, బంద్, చలోఅసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈసారి నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు.
విభజనపై కేంద్రం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలైనా సమైక్యవాదాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించాలని కోరారు. ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించేందుకు స్టీరింగ్ కమటీ ఏర్పాటు చేస్తున్నామని అశోక్బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు సమైక్య ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చలసాని శ్రీనివాస్ అన్నారు.