
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మార్ఫింగ్ ఫొటోలను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్న వ్యవహారంలో పోలీసులు నిజానిజాలను వెలికి తీశారు. ఫేక్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించిన ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, చలసాని అజయ్‌కుమార్, అమ్మినేని శివప్రసాద్, కొత్తపల్లి సీతాంశులతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడు రాజధానులు వద్దని, అమరావతిలోనే అన్నీ ఉంచాలంటూ ఈ నెల 10న బందరు రోడ్డుపై నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ వ్యవహారంపై పోలీస్ అసోసియేషన్ ఆదివారం రాత్రి విజయవాడలో ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ ఫొటో వెనుక ఉన్న నిజాలను వెలికి తీశారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు 2017లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సందర్భంలో ఒక మహిళను మహిళా పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలిస్తున్న దృశ్యాన్ని కొందరు వీడియో, ఫొటోలు తీశారు. ఆ ఫొటోను అప్పట్లో కాంగ్రెస్ నేతలు కొందరు మార్ఫింగ్ చేసి పోలీసులపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడదే ఫొటోను మరోసారి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.