‘లేపాక్షి బసవన్న రంకె’లో గర్జించిన సమైక్యవాదులు
ఢిల్లీలో సోనియా పాదపూజ ఇక చాలించండి
2014 వరకు తెలంగాణ ఏర్పడే ప్రసక్తే లేదు
ఉద్యమంలోకి రాని నేతలకు రాజకీయ సమాధేనని హెచ్చరిక
తెలంగాణ బిల్లు పెడితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్
ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటన
సాక్షి, అనంతపురం: ‘లేపాక్షి బసవన్న రంకె వేస్తే కలియుగం అంతం అవుతుందని నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు.. నేడు ‘లేపాక్షి బసవన్న రంకె’ పేరుతో సమైక్య వాదుల గర్జనతో యుపీఏ ప్రభుత్వం అంతమవ్వడం ఖాయమ’ని సమైక్య వాదులు ముక్తకంఠంతో నినదించారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన లక్ష జనగళ సమైక్య గర్జనకు జనం పోటెత్తారు. శాంతి కపోతాలను ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు పరుచూరిఅశోక్‌బాబు మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే వారికి ప్రజలే రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు.
విభజన నోట్ తయారీకి ముందే.. సమైక్య ఉద్యమానికి మద్దతుగా పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేసే ఎంపీలను, మంత్రులను తామే గెలిపించుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ప్రసక్తే లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రోజుకో మాట.. పూటకో ప్రకటన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు రోడ్లపై ఉద్యమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాద పూజ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఈనెల 24న సీమాంధ్రకు చెందిన ఏడుగురు ఎంపీలు రాజీనామా చేయనున్నారని, అదే జరిగితే కేంద్రంలో కీలకమార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ బిల్లును కేబినెట్ ఆమోదానికి పంపితే హైదారాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 10లక్షల మందితో మిలియన్‌మార్చ్ నిర్వహిస్తామని అశోక్‌బాబు పేర్కొన్నారు.
గతం మరచిన తెలంగాణవాదులు..
1956కు ముందు తెలంగాణ వాసులు నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయారని, ఆప్పట్లో అందరూ కూలీలే తప్ప సెంటు భూమి ఉన్న రైతులు లేరని అశోక్‌బాబు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాయలసీమ వాసులు కూడా పాల్గొని నిజాంపాలనను అంతమొందించి.. వారికి విముక్తి కల్పించారన్నారు.అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడులు పెట్టడంతోనే హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లిన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అడుగడుగునా అవమానాలు, దాడులు జరిగినా ఈ ప్రాంతానికి చెడ్డపేరు రాకూడదనే కారణంతోనే సంయమనం పాటించామని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలుస్తాం..
సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలనూ కలసి విన్నవిస్తామని అశోక్‌బాబు తెలిపారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కొమ్మరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మునిసిపల్ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కృష్ణమోహన్ తదితరులు మాట్లాడారు.
సోనియాకూ తెలిసొచ్చింది
తాము చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్, సమ్మె కారణంగా కేంద్రం ఆర్థికంగా ఎంత చితికిపోతోందో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంలకు తెలిసొచ్చిందని అశోక్‌బాబు అన్నారు. సభకు ముందు హిందూపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కరోజు బ్యాంకుల స్తంభన వల్ల జరిగిన ఆర్థిక నష్టం గురించి ప్రజలకు తెలియకపోయినా చిదంబరానికి మాత్రం తెలిసొచ్చిందన్నారు. నష్టానికి సంబంధించిన నివేదికలను తెప్పించుకున్న ఆయన.. బవాటిని చూసి నిర్ఘాంతపోయారన్నారు.
ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో తారస్థాయికి చేరుతోంది. సమ్మెకు సంఘీభావంగా సోమవారం నుంచి నిరవధికంగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న నిరసనలు, ఆందోళనలతో వరుసగా 55వరోజూ ఉద్యమం మిన్నంటింది. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు 400మీటర్ల జాతీయ జెండా చేతపట్టుకుని మద్దిలపాలెం వరకు ర్యాలీగా వెళ్లి జాతీయరహదారిని దిగ్బంధించారు. గోపాలపట్నంలో ప్రాంతీయ మార్కెటింగ్‌శాఖకు చెందిన ఐదు జిల్లాల ఉద్యోగులు మహా ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణాశాఖ ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో మహార్యాలీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా లోని సుమారు 700 పంచాయతీలలో సమైక్యాంధ్రను కొనసాగించాలంటూ తీర్మానాలను ఆమోదించినట్టు పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ నాయకుడు వీజీఎంఆర్ కృష్ణారావు తెలిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 12 గంటల పాటు నిర్విరామ ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఐకేపీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, కూడేరు మండలాల్లోని గ్రామాల సర్పంచులు సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పదివేల మంది విద్యార్థులతో మహోద్యమ రిలే దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యురాలు ఆర్‌కే.రోజా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ చేపట్టారు. గుంటూరులో క్రేన్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని నిమ్మకాయల రైతులు రోడ్డుపై వంటావార్పు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో బంగారు వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు.
నేడు సీమాంధ్ర బంద్
రహదారుల దిగ్బంధం చేయాలని జేఏసీ నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం సీమాం ధ్రలో బంద్ జరగనుంది. బంద్‌తోపాటు రహదారులను దిగ్బంధం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. కాగా, 25, 26 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బంద్‌కు జేఏసీ పిలుపు ఇచ్చింది. అందువల్ల మంగళవారం బంద్‌తో కలిసి వరుసగా మూడు రోజులు ప్రైవేటు బస్సుల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.
తిరుమలకు వాహనాల బంద్: రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డుపై వాహనాలు అడ్డుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ‘తిరుమలకు వాహనాల రాకపోకలు ఉండవు. ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని’ చెప్పారు. ఏపీ ఎన్‌జీవోలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును కూడా దిగ్బంధించనున్నారు.
ఇక యూపీఏ పతనమే ! : అశోక్‌బాబు
Published Tue, Sep 24 2013 2:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement
Advertisement