samaikya agitators
-
అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: దానం
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకోవడంపై మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి .. .పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన గురువారమిక్కడ ఖండించారు. పార్టీలో కీలక పదవులు పొందిన జేసీ ఇప్పుడు సోనియాను విమర్శించటం తగదన్నారు. ఎవరైనా సోనియాని విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అనడానికి అశోక్ బాబు ఎవరంటూ దానం ప్రశ్నించారు. అశోక్ బాబు ఒక ఉద్యోగ సంఘం నేతగా వాళ్ల సమస్యలనే ప్రస్తావించాలే కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని దానం అన్నారు. హైదరాబాద్‌పై అందరికి సమానంగా హక్కు ఉందని దానం అన్నారు. అన్నదమ్ముల్లా విడపోవాలంటే...రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. -
కేబినెట్ నిర్ణయంపై నిరసన
‘అనంత’లో విద్యార్థుల ఆందోళన చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ, జేఏసీల బైఠాయింపు సాక్షి, అనంపురం,తిరుపతి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో గురువారం రాత్రి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన వెల్లువెత్తింది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నిరసనలతో దద్దరిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను, వారి ఉద్యమాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్కేయూలో జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై సమైక్యాంధ్ర... జైజై సమైక్యాంధ్ర అంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై టైర్లకు నిప్పంటించి సమైక్య నినాదాలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి సుమారు గంట పాటు రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున వర్సిటీ వద్దకు చేరుకున్నారు. వర్సిటీ చుట్టూ వలయంలా ఏర్పడి విద్యార్థులు అడుగు ముందుకు వేయకుండా కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ జేఏసీ నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే పడుకొని జేఏసీ నాయకులు, విద్యార్థులు నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ శుక్రవారం నుంచి వర్సిటీలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. సమైక్యవాదుల ఆగ్రహం చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనరు నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పూడి రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి భవానీ నగర్ సర్కిల్ వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఉపాధ్యాయ జేఏసీ, ఏపీ ఎన్జీవో నేతలు రోడ్డుపై టైర్లు కాల్చి, నిరసన వ్యక్తం చేశారు. -
భద్రతా వలయంలో సీమాంధ్ర
అన్ని జిల్లాలకు అదనపు బలగాలు ప్రత్యేక బలగాలతో జిల్లా కేంద్రాల్లో కవాతు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్ల వద్ద భద్రత సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముంద్ర వేయడాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో సమైక్య వాదులు ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు యంత్రాంగాన్ని డీజీపీ బి.ప్రసాదరావు అప్రమత్తం చేశారు. ఇప్పటికే సీమాంధ్రలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా హెచ్చరించింది. దీంతో సున్నితమైన ప్రాంతాలు, అలజడులు చెలరేగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించాలని డీజీపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడాన్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకుని బందోబస్తును పెంచినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఉన్న కేంద్ర పారామిలటరీ బలగాలు, రాష్ట్రానికి చెందిన ఏపీఎస్పీ బలగాలకు తోడుగా మరో పది కంపెనీల కేంద్ర బలగాలను కూడా అక్కడికి తరలించేలా డీజీపీ ఆదేశించారు. ఈ విషయమై రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కె కౌముది రాత్రి సీమాంధ్రలో బందోబస్తులో ఉన్న సీనియర్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే, బస్సు డిపోల వద్ద సాయుధ పోలీసు పికెట్లను ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని కోరారు. ఎక్కడ కూడా పరిస్థితి అదుపు తప్పకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. సీమాంధ్రకు చెందిన మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్ల వద్ద భద్రత పటిష్టం చేశారు. అనంతపురంలో డీఎస్పీ నాగరాజ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమావేశ భవనంలో పోలీసు అధికారులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ఉద్యమాలు చేపట్టినా, అవి శాంతియుతంగానే ఉండాలని సూచించారు. కాగా విజయనగరంలో పరిస్థితి అదుపుతప్పకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో 16వ నంబర్ జాతీయ రహదారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి దిగ్బంధించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ హైవే దిగ్బంధం కొనసాగింది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. జ్యోతుల నెహ్రూతో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్తు చేశారు. -
కిరణ్ది తుగ్లక్ పాలన: చంద్రబాబునాయుడు
తణుకు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ తీరు పిచ్చి తుగ్లక్ పాలన మాదిరిగా ఉందని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బుధవారం తణుకులోని ఆంధ్రా సుగర్స్ సమావేశ మందిరంలో జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమర్థ ప్రభుత్వం కావడంతోప్రజలకు సహాయం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం మెడలు వంచైనా సహాయం అందేలా చేస్తామన్నారు. వరి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ దిగుబడి మాత్రం రాదని, రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని విభజించి మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు ఆరు నెలలపాటు వ్యాపారాలను పక్కనపెట్టి, పార్టీ కార్యక్రమాల్లో మునిగి తేలాలని హితవు పలికారు. అడుగడుగునా సమైక్య సెగ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరిచేలను పరిశీలించేందుకు వచ్చిన చంద్రబాబుకు తణుకు, అత్తిలి మండలాల్లో అడుగడుగునా సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తొలుత నరేంద్ర సెంటర్లో ఎన్జీవో జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద పెద్దఎత్తున విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ అనాలని బాబును పట్టుబట్టారు. అందుకు ససేమిరా అన్న ఆయన.. వాస్తవాలను తెలుసుకోవాలంటూ.. ప్రసంగించడంతో విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాంగ్రెస్ పరిస్థితి బాగుండకపోవడంతో సోనియా తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీతో పొత్తులు పెట్టుకుని పైకి రాష్ట్ర విభజన అంటూ నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శలకు దిగారు. హైదరాబాద్, సైబరాబాద్‌లను సింగపూర్‌కు దీటుగా అభివృద్ధి చేశానని చెప్పడంతో మళ్లీ నిరసన ఎదురైంది. అనంతరం దువ్వ-వరిఘేడు ప్రాంతంలోని దానమ్మగుడి ప్రాంతంలో సమైక్యవాదులతో జత కలిసిన టీడీపీ కార్యకర్తలు సైతం ‘సమైక్యాంధ్ర కావాలి. సమన్యాయం కాదు. జై సమైక్యాంధ్ర అనండి’ అంటూ పట్టుబట్టారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమైక్యవాదులు రోడ్డుపై చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. వరిఘేడు, తిరుపతిపురం, రామచంద్రపురం సెంటర్లలో నిలదీసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. -
ఇక యూపీఏ పతనమే ! : అశోక్‌బాబు
‘లేపాక్షి బసవన్న రంకె’లో గర్జించిన సమైక్యవాదులు ఢిల్లీలో సోనియా పాదపూజ ఇక చాలించండి 2014 వరకు తెలంగాణ ఏర్పడే ప్రసక్తే లేదు ఉద్యమంలోకి రాని నేతలకు రాజకీయ సమాధేనని హెచ్చరిక తెలంగాణ బిల్లు పెడితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటన సాక్షి, అనంతపురం: ‘లేపాక్షి బసవన్న రంకె వేస్తే కలియుగం అంతం అవుతుందని నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు.. నేడు ‘లేపాక్షి బసవన్న రంకె’ పేరుతో సమైక్య వాదుల గర్జనతో యుపీఏ ప్రభుత్వం అంతమవ్వడం ఖాయమ’ని సమైక్య వాదులు ముక్తకంఠంతో నినదించారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన లక్ష జనగళ సమైక్య గర్జనకు జనం పోటెత్తారు. శాంతి కపోతాలను ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరిఅశోక్బాబు మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే వారికి ప్రజలే రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. విభజన నోట్ తయారీకి ముందే.. సమైక్య ఉద్యమానికి మద్దతుగా పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేసే ఎంపీలను, మంత్రులను తామే గెలిపించుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ప్రసక్తే లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రోజుకో మాట.. పూటకో ప్రకటన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు రోడ్లపై ఉద్యమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాద పూజ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఈనెల 24న సీమాంధ్రకు చెందిన ఏడుగురు ఎంపీలు రాజీనామా చేయనున్నారని, అదే జరిగితే కేంద్రంలో కీలకమార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ బిల్లును కేబినెట్ ఆమోదానికి పంపితే హైదారాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 10లక్షల మందితో మిలియన్‌మార్చ్ నిర్వహిస్తామని అశోక్‌బాబు పేర్కొన్నారు. గతం మరచిన తెలంగాణవాదులు.. 1956కు ముందు తెలంగాణ వాసులు నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయారని, ఆప్పట్లో అందరూ కూలీలే తప్ప సెంటు భూమి ఉన్న రైతులు లేరని అశోక్‌బాబు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాయలసీమ వాసులు కూడా పాల్గొని నిజాంపాలనను అంతమొందించి.. వారికి విముక్తి కల్పించారన్నారు.అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడులు పెట్టడంతోనే హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లిన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అడుగడుగునా అవమానాలు, దాడులు జరిగినా ఈ ప్రాంతానికి చెడ్డపేరు రాకూడదనే కారణంతోనే సంయమనం పాటించామని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలుస్తాం.. సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలనూ కలసి విన్నవిస్తామని అశోక్‌బాబు తెలిపారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కొమ్మరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మునిసిపల్ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కృష్ణమోహన్ తదితరులు మాట్లాడారు. సోనియాకూ తెలిసొచ్చింది తాము చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్, సమ్మె కారణంగా కేంద్రం ఆర్థికంగా ఎంత చితికిపోతోందో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంలకు తెలిసొచ్చిందని అశోక్‌బాబు అన్నారు. సభకు ముందు హిందూపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కరోజు బ్యాంకుల స్తంభన వల్ల జరిగిన ఆర్థిక నష్టం గురించి ప్రజలకు తెలియకపోయినా చిదంబరానికి మాత్రం తెలిసొచ్చిందన్నారు. నష్టానికి సంబంధించిన నివేదికలను తెప్పించుకున్న ఆయన.. బవాటిని చూసి నిర్ఘాంతపోయారన్నారు. ఉవ్వెత్తున ఉద్యమం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో తారస్థాయికి చేరుతోంది. సమ్మెకు సంఘీభావంగా సోమవారం నుంచి నిరవధికంగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న నిరసనలు, ఆందోళనలతో వరుసగా 55వరోజూ ఉద్యమం మిన్నంటింది. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు 400మీటర్ల జాతీయ జెండా చేతపట్టుకుని మద్దిలపాలెం వరకు ర్యాలీగా వెళ్లి జాతీయరహదారిని దిగ్బంధించారు. గోపాలపట్నంలో ప్రాంతీయ మార్కెటింగ్‌శాఖకు చెందిన ఐదు జిల్లాల ఉద్యోగులు మహా ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణాశాఖ ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో మహార్యాలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా లోని సుమారు 700 పంచాయతీలలో సమైక్యాంధ్రను కొనసాగించాలంటూ తీర్మానాలను ఆమోదించినట్టు పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ నాయకుడు వీజీఎంఆర్ కృష్ణారావు తెలిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 12 గంటల పాటు నిర్విరామ ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఐకేపీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, కూడేరు మండలాల్లోని గ్రామాల సర్పంచులు సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పదివేల మంది విద్యార్థులతో మహోద్యమ రిలే దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యురాలు ఆర్కే.రోజా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా రుద్రవరంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ చేపట్టారు. గుంటూరులో క్రేన్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులోని నిమ్మకాయల రైతులు రోడ్డుపై వంటావార్పు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో బంగారు వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. నేడు సీమాంధ్ర బంద్ రహదారుల దిగ్బంధం చేయాలని జేఏసీ నిర్ణయం.. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం సీమాం ధ్రలో బంద్ జరగనుంది. బంద్‌తోపాటు రహదారులను దిగ్బంధం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. కాగా, 25, 26 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బంద్‌కు జేఏసీ పిలుపు ఇచ్చింది. అందువల్ల మంగళవారం బంద్‌తో కలిసి వరుసగా మూడు రోజులు ప్రైవేటు బస్సుల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. తిరుమలకు వాహనాల బంద్: రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డుపై వాహనాలు అడ్డుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ‘తిరుమలకు వాహనాల రాకపోకలు ఉండవు. ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని’ చెప్పారు. ఏపీ ఎన్జీవోలు ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును కూడా దిగ్బంధించనున్నారు. -
31రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్యోద్యమం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 31వ రోజుకు చేరింది. రాష్ర్ట విభజన కోరుతూ ప్రజలు వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో 20వేల మందికిపైగా సమైక్యవాదులు ప్రజాగర్జన పేరుతో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎస్ కోటలో రహదారిపై, అలాగే తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేట వద్ద జాతీయ రహదారిపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయం ఆవరణలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఆర్యవైశ్య సింహగర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించి పట్టణంలో బంద్ చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతపురంలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు కాగడాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో 10వేల మందికిపైగా మహిళలు క్రాస్ రోడ్డు వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద విద్యార్థులు రహదారిని దిగ్బంధించారు. విజయవాడ రామవరప్పాడు రింగ్సెంటర్లో సమైక్యవాదులు భారీ మానవహారం చేపట్టారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది. బాపట్లలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 30వేల మంది ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు శతసహస్ర సమైక్యస్వరాగం పేరిట గర్జించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలో విద్యార్థులు విభజన వద్దు అంటూ అక్షర రూపంలో కూర్చోగా.. పాలకొండలో విద్యార్థులు సమైక్యాంధ్రప్రదేశ్ చిత్రపటం రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. ఐదు నిమిషాలపాటు ముక్తకంఠంతో జైసమైక్యాంధ్ర అంటూ గర్జించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో రజక వృత్తి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో విద్యార్థులు లాంగ్‌మార్చ్ నిర్వహించారు. ఉద్యమంలో తామూ పాల్గొంటున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కొనసాగుతున్న ఉద్యోగుల రిలే దీక్షల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రజని పాల్గొన్నారు. దీంతో సహఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలి సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని చూపించని జాతీయ న్యూస్ ఛానళ్ల ప్రసారాలను సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవోల నేత ఎ. విద్యాసాగర్ విజయవాడలో ప్రకటించారు. దీనిపై ఆయా చానళ్ల ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లతో కూడా మాట్లాడుతున్నామన్నారు. కాంగ్రెస్ నేతలూ.. గోబ్యాక్ సాక్షి నెట్వర్క్ : అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లింగారెడ్డిని అడ్డుకుని రాజీనామా ఆమోదింపజేసుకుని రావాలంటూ నినదించారు. బద్వేలులో జరిగిన ఆర్యవైశ్య సింహగర్జనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కమలమ్మ రాగా, సమైక్యవాదులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానంటూ రాజీనామా చేస్తున్నట్లు సంతకం పెట్టి చూపించినప్పటికీ సమైక్యవాదులు శాంతించలేదు. దీంతో పోలీసుల సహకారంతో ఆమె అక్కడనుంచి వెనుతిరిగారు. శ్రీకాకుళంలో సభలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడేందుకు సిద్ధంకాగానే సమైక్యవాదులు అడ్డుకుని ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు ధర్నా చేపట్టగా, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను రాజీనామా చేయాలని ఓ ఉద్యోగి నిలదీశారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్‌బాబును సమైక్యవాదులు గోబ్యాక్ అంటూ అడ్డుకున్నారు. కదం తొక్కిన టీటీడీ ఉద్యోగులు వేలాది మంది టీటీడీ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో గర్జించారు. తిరుపతిలో శుక్రవారం సద్భావన శాంతి ర్యాలీ చేపట్టారు. గోవిందనామ స్మరణ, న ృత్యాలు, డప్పు వాయిద్యాలు, విద్యార్థుల సమైక్య నినాదాలతో నగరవీధులు దద్దరిల్లాయి. అన్ని స్థాయిల వారూ ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా టీటీడీ వేదపండితులు ఉద్యమంలో పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. డాలర్ శేషాద్రి మాట్లాడుతూ తెలుగోడిపై ఢిల్లీ లొల్లి ఏంటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుమల ఆలయంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగాయని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. -
కాంగ్రెస్ నేతలకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్ : కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ వేదికపైకి మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్‌తోపాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు రాగా, సమైక్యవాదులు జోక్యం చేసుకుని వేదికపై నుంచి దిగిపోవాలని, లేదంటే దాడి చేస్తామంటూ చెప్పులు పైకి ఎత్తి చూపారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని ఉద్యమకారులు ముట్టడించి ధర్నా చేపట్టారు. నెల్లూరులో విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. కర్నూలుకు వచ్చిన మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే ఊర్లోఉన్న పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పార్టీకి రాజీనామాచేయాలని న్యాయవాదులు డిమాండ్ చేయడంతో ఆయన, మైకుతో ఓ న్యాయవాది ముఖంపై కొట్టారు. దీంతో న్యాయవాదులు తిరగబడ్డారు. క్షమాపణ చెప్పాలని కోరగా, ‘చెప్పే ప్రసక్తే లేదు. ఏం పీకుతారో చూస్తా’నంటూ వెళ్లిపోయారు. న్యాయవాదులు తనపై దాడి చేశారన్నారు. -
ఉద్యమిస్తేనే ‘సమైక్య’ ఫలం
సాక్షి, గుంటూరు: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో ఉద్యమపథాన పయనించాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. గుంటూరులోని కావటిశంకరరావు కల్యాణ మండపంలో శుక్రవారం ‘సాక్షి’పత్రిక, టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఎవరెటు? చర్చా వేదికలో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఉద్యమసంఘాల నేతలు పాల్గొన్నారు. రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలుగుజాతిని రెండు ముక్కలుగా చేసి రాష్ట్ర రాజకీయాలను బలహీనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కలిసిరాని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎంపీడీవోలసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవానికి భంగం వాటిల్లే క్రమంలో తెలుగు మాట్లాడేవారందరూ కలసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమం ద్వారా తెలుగు పౌరుషాన్ని ఢిల్లీదాకా వినిపించాలని సూచించారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర పాతికేళ్లు వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మందపాటి శంకరరావు మాట్లాడుతూ చంద్రబాబు లేఖ ఇవ్వడం ద్వారానే రాష్ట్ర విభజనకు కారణమైందని చెప్పారు. సమన్యాయం కోసం ఐదురోజులుగా చిత్తశుద్ధితో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ విజయమ్మ సమరదీక్ష ప్రజాప్రతినిధులందరికీ స్ఫూర్తిగా మారాలన్నారు. ఏపీ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం జేఏసీ సంయుక్త కన్వీనర్ మేకల రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య మానవసంబంధాలు ఘోరంగా దెబ్బతింటాయని, వైరి వర్గాలుగా ఏర్పడి కత్తులు దూసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం సలహాదారు మోహనకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అసలు చట్టబద్దతే లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ను సవరిస్తేనే విభజన సాధ్యమవుతుందన్న విషయాన్ని కేంద్రం గుర్తెరగాలన్నారు. అధికారాన్ని తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేసిన వ్యక్తుల్లో సోనియానే ప్రథమురాలని దుయ్యబట్టారు.