అన్ని జిల్లాలకు అదనపు బలగాలు
ప్రత్యేక బలగాలతో జిల్లా కేంద్రాల్లో కవాతు
మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్ల వద్ద భద్రత
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముంద్ర వేయడాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో సమైక్య వాదులు ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు యంత్రాంగాన్ని డీజీపీ బి.ప్రసాదరావు అప్రమత్తం చేశారు. ఇప్పటికే సీమాంధ్రలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా హెచ్చరించింది. దీంతో సున్నితమైన ప్రాంతాలు, అలజడులు చెలరేగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించాలని డీజీపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడాన్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకుని బందోబస్తును పెంచినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఉన్న కేంద్ర పారామిలటరీ బలగాలు, రాష్ట్రానికి చెందిన ఏపీఎస్పీ బలగాలకు తోడుగా మరో పది కంపెనీల కేంద్ర బలగాలను కూడా అక్కడికి తరలించేలా డీజీపీ ఆదేశించారు. ఈ విషయమై రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కె కౌముది రాత్రి సీమాంధ్రలో బందోబస్తులో ఉన్న సీనియర్ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే, బస్సు డిపోల వద్ద సాయుధ పోలీసు పికెట్లను ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని కోరారు.
ఎక్కడ కూడా పరిస్థితి అదుపు తప్పకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. సీమాంధ్రకు చెందిన మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్ల వద్ద భద్రత పటిష్టం చేశారు. అనంతపురంలో డీఎస్పీ నాగరాజ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమావేశ భవనంలో పోలీసు అధికారులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ఉద్యమాలు చేపట్టినా, అవి శాంతియుతంగానే ఉండాలని సూచించారు. కాగా విజయనగరంలో పరిస్థితి అదుపుతప్పకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో 16వ నంబర్ జాతీయ రహదారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి దిగ్బంధించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ హైవే దిగ్బంధం కొనసాగింది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. జ్యోతుల నెహ్రూతో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్తు చేశారు.
భద్రతా వలయంలో సీమాంధ్ర
Published Fri, Dec 6 2013 3:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement