* టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే
* 12న రాజ్యసభకు బిల్లు
* భద్రాద్రి రామయ్య తెలంగాణకు
* ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు
* అసెంబ్లీ చర్చించిన బిల్లుకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
* బిల్లును యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయం
* దానితో పాటే అసెంబ్లీ, మండలి ‘తిరస్కరణ తీర్మానాలు’ కూడా
* మొత్తం 32 సవరణలకు అంగీకారం.. అందులో కీలకమైనవి కొన్నే
* పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు సీమాంధ్రలో..
* కొత్త రాజధాని ఏర్పాటుకు అధ్యయనానికి ఆరు నెలల సమయం
* ఈ సవరణలను పార్లమెంటులోనే ప్రతిపాదించనున్న హోంశాఖ
* మంత్రివర్గ భేటీలో నిర్ణయం.. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో చర్చ
* హైదరాబాద్ యూటీ, రాయల తెలంగాణ కోరికలకు తిరస్కారం
* కేంద్ర కేబినెట్ నిర్ణయంపై పూర్తి వివరాలు 2, 4 పేజీల్లో
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలిల్లో చర్చించి కేంద్రానికి తిప్పి పంపిన ఈ బిల్లును యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచాలని తీర్మానించింది. రాష్ట్ర ఉభయ సభలు బిల్లును తిరస్కరిస్తూ చేసిన తీర్మానాలను కూడా ఈ బిల్లుతో పాటే జత చేయనుంది. అలాగే.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ పార్టీలు చేసిన డిమాండ్లు, సూచించిన సవరణల్లో కొన్నింటికి అంగీకరిస్తూ.. బిల్లుకు 32 సవరణలను ఖరారు చేసింది.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే కీలక సవరణ చేర్చింది. కానీ.. ముంపు ప్రాంతంలో భాగమైన భద్రాచలం డివిజన్‌లో భద్రాద్రి ఆలయం గల భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రం మినహాయించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత ఈ సవరణలను అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించింది. న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు పాత ముసాయిదాను మాత్రమే ప్రవేశపెట్టనుంది.
పార్లమెంటు ఉభయసభల్లో తొలుత ఏ సభలో, ఎప్పుడు పెట్టాలనే అంశాన్ని మాత్రం కాంగ్రెస్ నాయకత్వానికి అప్పగించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన ఈ కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే.. కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా ప్రధాని నివాసంలోనే సమావేశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. విభజన బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సహకరిస్తే ఈ నెల 12వ తేదీన (బుధవారం) పెద్దల సభలో బిల్లును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. విభజన బిల్లు తక్షణం రాష్ట్రపతికి వెళుతుందా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
హైదరాబాద్ యూటీకి నో...
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, సీమాంధ్రలో పోలవరం ముంపు గ్రామాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సిందేనని సీమాంధ్ర కేంద్ర మంత్రులు పట్టుపట్టినప్పటికీ కేబినెట్ మాత్రం అంగీకరించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిషోర్ చంద్రదేవ్‌లు విభజన వల్ల సీమాంధ్రకు జరుగుతున్న నష్టాన్ని ఏకరువు పెట్టారు.
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులకు రక్షణ ఉండే పరిస్థితి లేదని పేర్కొంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కావూరి ప్రస్తావించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్రులకు అడ్మిషన్ వచ్చినా చేరని పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఇబ్బంది ఉండదని కోరారు. విభజన జరిగినప్పటికీ యూటీ చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలు సంతృప్తి చెందే అవకాశముందని చెప్పారు. పళ్లంరాజు సైతం సీమాంధ్ర ప్రజల వ్యతిరేకత చల్లారాలంటే హైదరాబాద్‌ను యూటీ చేయడం మినహా మరో మార్గం లేదని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ యూటీ అంశాన్ని ప్రస్తావించని కిషోర్ చంద్రదేవ్ సైతం ఈ సమావేశంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలని పట్టుబట్టారు. జైపాల్‌రెడ్డి మాత్రం వారి వాదనలు అసమంజసమని వ్యాఖ్యానించారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కుల మేరకు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు.
కావూరి, పళ్లంరాజులు రాయల తెలంగాణ కోసం కూడా పట్టుపట్టగా జైపాల్‌రెడ్డి దీనిని ప్రతిఘటించారు. ఇందుకు ఎంఐఎం ఒప్పుకోదని, దీనిపై చర్చలు, సంప్రదింపులు జరపడం ఎవరితోనూ సాధ్యం కాదని పేర్కొన్నారు. సీమను కూడా విభజిస్తారా? అన్న ఉద్వేగాలు పెరిగిపోతాయని, బీజేపీ కూడా దీనిని వ్యతిరేకిస్తుందని వివరించారు. ప్యాకేజీలన్నింటిపై ఆర్థిక సంఘం అధ్యయనం చేశాక మాత్రమే ఆర్థిక సాయం మొత్తాన్ని ఇదమిత్థంగా చెప్పగలమని కేబినెట్ తేల్చింది. అడ్మిషన్ల వ్యవహారం పదేళ్లు కాకుండా ఎప్పటికీ కొనసాగాలని పళ్లంరాజు ప్రతిపాదించగా కేబినెట్ తిరస్కరించింది. హైదరాబాద్ ఆదాయం పంపిణీపై పట్టుపట్టినా దీనికి కూడా ఒప్పుకోలేదు.
గవర్నర్ అధికారాలు రాజ్యాంగ సమ్మతమేనా?
కేబినెట్ సమావేశంలో శరద్‌పవార్ మాట్లాడుతూ.. తాము యూపీఏ-1 ప్రారంభం నుంచే తెలంగాణకు కట్టుబడిన సంగతిని వివరించారు. రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదని, అలాంటప్పుడు గవర్నర్‌కు శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను ఇవ్వడం రాజ్యాంగ సమ్మతమేనా అని ప్రశ్నించారు. దీనివల్ల న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పవార్, సీమాంధ్ర మంత్రుల అభ్యంతరాలకు జీవోఎం సభ్యుడు జైరాంరమేశ్ వివరణ ఇచ్చారు.
యూటీ అవసరం లేకుండానే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేర్చేందుకు రాజ్యాంగంలోని మూడో అధికరణ.. కేంద్రానికి సర్వాధికారాలను కల్పిస్తోందని చెప్పారు. ఆర్థికమంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ అన్నీ అధ్యయనం చేసిన తరువాత సీడబ్ల్యూసీ తీర్మానంలో ఈ అంశాన్ని పొందుపర్చామని, ఆ తీర్మానాన్ని యథాతథంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు. వివిధ శాఖలు, ప్లానింగ్ కమిషన్‌తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైరాం వివరించారు. అసెంబ్లీ నుంచి వివిధ పార్టీల నుంచి అనేక సవరణలు వచ్చిన నేపథ్యంలో జీవోఎం ఈ శాఖలతో చర్చించిందని.. ఈ నెల 4, 5, 6 తేదీల్లో జీవోఎం వరుస భేటీలు జరిపి పరిశీలించిందని తెలిపారు.
కేబినెట్ భేటీ నిర్ణయాల్లో కొన్ని ముఖ్యాంశాలు...
* బిల్లును ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014గా మార్చుతూ సవరణ
* బిల్లులో ఉన్నవాటికి అదనంగా సీమాంధ్రలో ఒక పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు
* నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు
* ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు ఆరు నెలల్లో అధ్యయనం
* వైఎస్సార్ జిల్లాలో సెయిల్ ప్లాంటు ఏర్పాటుకు, విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు అధ్యయనం
* ఏడాదిలోగా విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్
* తెలంగాణ శాసనమండలి కొత్త చైర్మన్ వచ్చే వరకు డిప్యూటీ చైర్మన్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు
‘ముంపు’ సీమాంధ్రకు
Published Sat, Feb 8 2014 1:20 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement