కాంగ్రెస్ నేతలకు సమైక్య సెగ
సాక్షి నెట్‌వర్క్ : కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ వేదికపైకి మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్‌తోపాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు రాగా, సమైక్యవాదులు జోక్యం చేసుకుని వేదికపై నుంచి దిగిపోవాలని, లేదంటే దాడి చేస్తామంటూ చెప్పులు పైకి ఎత్తి చూపారు. గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని ఉద్యమకారులు ముట్టడించి ధర్నా చేపట్టారు.
నెల్లూరులో విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. కర్నూలుకు వచ్చిన మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే ఊర్లోఉన్న పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పార్టీకి రాజీనామాచేయాలని న్యాయవాదులు డిమాండ్ చేయడంతో ఆయన, మైకుతో ఓ న్యాయవాది ముఖంపై కొట్టారు. దీంతో న్యాయవాదులు తిరగబడ్డారు. క్షమాపణ చెప్పాలని కోరగా, ‘చెప్పే ప్రసక్తే లేదు. ఏం పీకుతారో చూస్తా’నంటూ వెళ్లిపోయారు. న్యాయవాదులు తనపై దాడి చేశారన్నారు.