31రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్యోద్యమం
సాక్షి నెట్‌వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 31వ రోజుకు చేరింది. రాష్ర్ట విభజన కోరుతూ ప్రజలు వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో 20వేల మందికిపైగా సమైక్యవాదులు ప్రజాగర్జన పేరుతో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎస్ కోటలో రహదారిపై, అలాగే తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేట వద్ద జాతీయ రహదారిపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయం ఆవరణలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఆర్యవైశ్య సింహగర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించి పట్టణంలో బంద్ చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు.
అనంతపురంలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు కాగడాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో 10వేల మందికిపైగా మహిళలు క్రాస్ రోడ్డు వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద విద్యార్థులు రహదారిని దిగ్బంధించారు. విజయవాడ రామవరప్పాడు రింగ్‌సెంటర్‌లో సమైక్యవాదులు భారీ మానవహారం చేపట్టారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది. బాపట్లలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 30వేల మంది ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు శతసహస్ర సమైక్యస్వరాగం పేరిట గర్జించారు.
శ్రీకాకుళం జిల్లా సారవకోటలో విద్యార్థులు విభజన వద్దు అంటూ అక్షర రూపంలో కూర్చోగా.. పాలకొండలో విద్యార్థులు సమైక్యాంధ్రప్రదేశ్ చిత్రపటం రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. ఐదు నిమిషాలపాటు ముక్తకంఠంతో జైసమైక్యాంధ్ర అంటూ గర్జించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో రజక వృత్తి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో విద్యార్థులు లాంగ్‌మార్చ్ నిర్వహించారు. ఉద్యమంలో తామూ పాల్గొంటున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కొనసాగుతున్న ఉద్యోగుల రిలే దీక్షల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రజని పాల్గొన్నారు. దీంతో సహఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు.
చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలి
సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని చూపించని జాతీయ న్యూస్ ఛానళ్ల ప్రసారాలను సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవోల నేత ఎ. విద్యాసాగర్ విజయవాడలో ప్రకటించారు. దీనిపై ఆయా చానళ్ల ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లతో కూడా మాట్లాడుతున్నామన్నారు.
కాంగ్రెస్ నేతలూ.. గోబ్యాక్
సాక్షి నెట్‌వర్క్ : అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లింగారెడ్డిని అడ్డుకుని రాజీనామా ఆమోదింపజేసుకుని రావాలంటూ నినదించారు. బద్వేలులో జరిగిన ఆర్యవైశ్య సింహగర్జనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కమలమ్మ రాగా, సమైక్యవాదులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానంటూ రాజీనామా చేస్తున్నట్లు సంతకం పెట్టి చూపించినప్పటికీ సమైక్యవాదులు శాంతించలేదు. దీంతో పోలీసుల సహకారంతో ఆమె అక్కడనుంచి వెనుతిరిగారు.
శ్రీకాకుళంలో సభలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడేందుకు సిద్ధంకాగానే సమైక్యవాదులు అడ్డుకుని ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు ధర్నా చేపట్టగా, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను రాజీనామా చేయాలని ఓ ఉద్యోగి నిలదీశారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్‌బాబును సమైక్యవాదులు గోబ్యాక్ అంటూ అడ్డుకున్నారు.
కదం తొక్కిన టీటీడీ ఉద్యోగులు
వేలాది మంది టీటీడీ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో గర్జించారు. తిరుపతిలో శుక్రవారం సద్భావన శాంతి ర్యాలీ చేపట్టారు. గోవిందనామ స్మరణ, న ృత్యాలు, డప్పు వాయిద్యాలు, విద్యార్థుల సమైక్య నినాదాలతో నగరవీధులు దద్దరిల్లాయి. అన్ని స్థాయిల వారూ ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా టీటీడీ వేదపండితులు ఉద్యమంలో పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. డాలర్ శేషాద్రి మాట్లాడుతూ తెలుగోడిపై ఢిల్లీ లొల్లి ఏంటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుమల ఆలయంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగాయని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు.