మళ్లీ కలసి విన్నవిద్దాం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్లటానికి సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఆ పార్టీ ఎంపీలు సాహసించటంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగినా అంతా సోనియా దయకే వదిలేయాలని నిర్ణయించారు. సమైక్య ఉద్యమంపై ఇప్పటికే అనేకసార్లు కలసి వివరించినప్పటికీ మరోసారి అదే విషయాన్ని సోనియా ముందు విన్నవిద్దామని తీర్మానించారు. శనివారం మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో జరిగిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సమావేశంలో.. పదవులకు రాజీనామా చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. పదవులు వదులుకుంటే అధిష్టానంతో మాట్లాడేందుకు అవకాశం కోల్పోతామని, అందువల్ల రాజీనామాల జోలికి వెళ్లొద్దన్న నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తామంతా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలసి.. ఆంటోనీ కమిటీనీ సీమాంధ్రలో పర్యటింపచేయటం, ఆ తరువాత నివేదిక రూపకల్పన, ఆ నివేదికను పరిశీలించి సాధ్యాసాధ్యాలను చర్చించాకనే తెలంగాణపై ముందుకు వెళ్లాలని కోరటం వంటి అంశాలపై సమాలోచనలు జరిగాయి. సోనియాను కలసిన తర్వాత ఆమె సూచనలేమిటో విన్న తర్వాత ముందుకు వెళ్లాలన్న భావనకు మంత్రులు, ఎంపీలు వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో తాజా పరిస్థితులపై రాజకీయ కోణంలోనే సాగినట్లు తెలుస్తోంది.
సమావేశానికి కేంద్రమంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, అనంతవెంకటరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, ఎస్.పి.వై.రెడ్డి, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, బొత్స ఝాన్సీ హాజరయ్యారు. మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి గైర్హాజరయ్యారు. ఎంపీలు హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, చింతామోహన్, రత్నాబాయి, సుబ్బరామిరెడ్డి హాజరుకాలేదు. నేదురుమల్లి అనారోగ్యం కారణంగా రాలేకపోగా మరో ఎంపీ సబ్బంహరి కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు తొలినుంచి దూరంగానే ఉంటున్నారు. మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆ తర్వాత కావూరికి ఫోన్‌చేసి సమావేశానికి తాను రాలేకపోయినా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తాను కూడా కలసి ఉంటానని చెప్పినట్లు సమాచారం.
అది నన్ను ఉద్దేశించే అన్నట్లుంది: చిరు
ఈ సమావేశంలో మంత్రి చిరంజీవి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజనకు కొంతమంది సీమాంధ్ర మంత్రులు సహకరిస్తున్నారని లగడపాటి ఇటీవల చేసిన ప్రకటన, గుంటకాడ నక్కల్లా ముఖ్యమంత్రి పదవికోసం కాచుక్కూర్చున్నారంటూ వస్తున్న విమర్శల గురించి చిరంజీవి సమావేశంలోనే ప్రస్తావించి.. ఇది కేవలం తననుద్దేశించి చేసిన ప్రకటనగానే కనిపిస్తోందంటూ లగడపాటిపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని లగడపాటి బదులిచ్చినట్లు సమాచారం.