'ఉమ్మడి' అంటే ఆంధ్రా సీఎంను అవమానించటమే
హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో ఇప్పటివరకూ స్తబ్ధుగా ఉన్న కేంద్ర మంత్రి పురందేశ్వరి ఎట్టకేలకు మేల్కొన్నారు. తమ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి శనివారం బంజారాహిల్స్లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను పరిష్కరించకుంటే విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందన్నారు. విభజన అనివార్యమని తెలియటంతో తాము సీమాంధ్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టామన్నారు. అయితే పోలవరం, భద్రాచలం అంశాలు విషయం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. పోలవరం పూర్తిగా ఆంధ్రా ప్రాంతంలో ఉండాల్సిందన్నది తన అభిప్రాయమన్నారు.
ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో లేదన్నారు. జాయింట్ కాపిటల్ అంటే ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిని అవమానించటమేనని పురందేశ్వరి అన్నారు. ఆంధ్రా సీఎం హైదరాబాద్లో ఉంటే ఆ ప్రాంత ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారని ఆమె ప్రశ్నించారు. సీమాంధ్రలో ఉన్నత విద్యాసంస్థలు ఇస్తామని అధిష్టానం పెద్దలు చెబుతున్నారని, అయితే నిధుల విషయంలో స్పష్టం లేదన్నారు. ఉన్నత విద్య విషయంలో సీమాంధ్ర ప్రాంత విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం చెబుతున్నట్లయితే సీమాంధ్రలో 2021కి విద్యాసంస్థలు పూర్తవుతాయన్నారు. పెట్టుబడులు సరిగా రాకుంటే ...భవిష్యత్లో ఉద్యోగాలు ఉండవన్నారు. తాము ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని పురందేశ్వరి స్పష్టం చేశారు.