‘అనంత’లో విద్యార్థుల ఆందోళన
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ, జేఏసీల బైఠాయింపు
సాక్షి, అనంపురం,తిరుపతి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో గురువారం రాత్రి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన వెల్లువెత్తింది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నిరసనలతో దద్దరిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను, వారి ఉద్యమాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్కేయూలో జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై సమైక్యాంధ్ర... జైజై సమైక్యాంధ్ర అంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై టైర్లకు నిప్పంటించి సమైక్య నినాదాలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి సుమారు గంట పాటు రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున వర్సిటీ వద్దకు చేరుకున్నారు. వర్సిటీ చుట్టూ వలయంలా ఏర్పడి విద్యార్థులు అడుగు ముందుకు వేయకుండా కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ జేఏసీ నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే పడుకొని జేఏసీ నాయకులు, విద్యార్థులు నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ శుక్రవారం నుంచి వర్సిటీలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.
సమైక్యవాదుల ఆగ్రహం
చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనరు నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పూడి రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి భవానీ నగర్ సర్కిల్ వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఉపాధ్యాయ జేఏసీ, ఏపీ ఎన్జీవో నేతలు రోడ్డుపై టైర్లు కాల్చి, నిరసన వ్యక్తం చేశారు.
కేబినెట్ నిర్ణయంపై నిరసన
Published Fri, Dec 6 2013 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement