ఉద్యమిస్తేనే ‘సమైక్య’ ఫలం | samaikya activists calls to everybody Integrity in samaikyandhra movement | Sakshi
Sakshi News home page

ఉద్యమిస్తేనే ‘సమైక్య’ ఫలం

Published Sat, Aug 24 2013 3:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

samaikya activists calls to everybody Integrity in samaikyandhra movement

సాక్షి, గుంటూరు: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో ఉద్యమపథాన పయనించాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. గుంటూరులోని కావటిశంకరరావు కల్యాణ మండపంలో శుక్రవారం ‘సాక్షి’పత్రిక, టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఎవరెటు? చర్చా వేదికలో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఉద్యమసంఘాల నేతలు పాల్గొన్నారు. రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలుగుజాతిని రెండు ముక్కలుగా చేసి రాష్ట్ర రాజకీయాలను బలహీనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
 
  సమైక్యాంధ్ర పరిరక్షణ  కోసం కలిసిరాని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎంపీడీవోలసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవానికి భంగం వాటిల్లే క్రమంలో తెలుగు మాట్లాడేవారందరూ కలసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమం ద్వారా తెలుగు పౌరుషాన్ని ఢిల్లీదాకా వినిపించాలని సూచించారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర పాతికేళ్లు వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మందపాటి శంకరరావు మాట్లాడుతూ చంద్రబాబు లేఖ ఇవ్వడం ద్వారానే రాష్ట్ర విభజనకు కారణమైందని చెప్పారు.
 
  సమన్యాయం కోసం ఐదురోజులుగా చిత్తశుద్ధితో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ విజయమ్మ సమరదీక్ష ప్రజాప్రతినిధులందరికీ స్ఫూర్తిగా మారాలన్నారు. ఏపీ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం జేఏసీ సంయుక్త కన్వీనర్ మేకల రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య మానవసంబంధాలు ఘోరంగా దెబ్బతింటాయని, వైరి వర్గాలుగా ఏర్పడి కత్తులు దూసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం సలహాదారు మోహనకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అసలు చట్టబద్దతే లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ను సవరిస్తేనే విభజన సాధ్యమవుతుందన్న విషయాన్ని కేంద్రం గుర్తెరగాలన్నారు. అధికారాన్ని తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేసిన వ్యక్తుల్లో సోనియానే ప్రథమురాలని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement