కిరణ్‌ది తుగ్లక్ పాలన: చంద్రబాబునాయుడు
తణుకు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ తీరు పిచ్చి తుగ్లక్ పాలన మాదిరిగా ఉందని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బుధవారం తణుకులోని ఆంధ్రా సుగర్స్ సమావేశ మందిరంలో జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమర్థ ప్రభుత్వం కావడంతోప్రజలకు సహాయం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం మెడలు వంచైనా సహాయం అందేలా చేస్తామన్నారు. వరి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ దిగుబడి మాత్రం రాదని, రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని విభజించి మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు ఆరు నెలలపాటు వ్యాపారాలను పక్కనపెట్టి, పార్టీ కార్యక్రమాల్లో మునిగి తేలాలని హితవు పలికారు.
అడుగడుగునా సమైక్య సెగ
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరిచేలను పరిశీలించేందుకు వచ్చిన చంద్రబాబుకు తణుకు, అత్తిలి మండలాల్లో అడుగడుగునా సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తొలుత నరేంద్ర సెంటర్‌లో ఎన్జీవో జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద పెద్దఎత్తున విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ అనాలని బాబును పట్టుబట్టారు. అందుకు ససేమిరా అన్న ఆయన.. వాస్తవాలను తెలుసుకోవాలంటూ.. ప్రసంగించడంతో విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
కాంగ్రెస్ పరిస్థితి బాగుండకపోవడంతో సోనియా తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీతో పొత్తులు పెట్టుకుని పైకి రాష్ట్ర విభజన అంటూ నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శలకు దిగారు. హైదరాబాద్, సైబరాబాద్‌లను సింగపూర్‌కు దీటుగా అభివృద్ధి చేశానని చెప్పడంతో మళ్లీ నిరసన ఎదురైంది. అనంతరం దువ్వ-వరిఘేడు ప్రాంతంలోని దానమ్మగుడి ప్రాంతంలో సమైక్యవాదులతో జత కలిసిన టీడీపీ కార్యకర్తలు సైతం ‘సమైక్యాంధ్ర కావాలి. సమన్యాయం కాదు. జై సమైక్యాంధ్ర అనండి’ అంటూ పట్టుబట్టారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమైక్యవాదులు రోడ్డుపై చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. వరిఘేడు, తిరుపతిపురం, రామచంద్రపురం సెంటర్లలో నిలదీసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.