సడలని పోరు... ఎడతెరపి లేని వానలోనూ మిన్నంటిన జనోద్యమం
సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో నాలుగైదు రోజులుగా ఎడతెరపిలేని వాన.. ఊళ్లను ముంచెత్తిన భారీవర్షాలు.. జలమయమైన నగరాలు.. చాలాచోట్ల జనజీవనం అస్తవ్యస్తం.. అయినా సరే.. సమైక్యాంధ్ర జనోద్యమం ఏమాత్రం తగ్గడంలేదు. 87వ రోజైన శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఆందోళనలు హోరెత్తాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జేఏసీ, మిట్స్ కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీతో కలిసి విద్యార్థులు, ఎన్జీవోలు మానవహారం ఏర్పాటు చేశారు. పుంగనూరులో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేయూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో విద్యార్ధులు మానవహారం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రైళ్లు, బస్సులకు సమైక్యాంధ్ర పోస్టర్లు అంటించారు. అమలాపురంలో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వాహనాలకు ‘జై సమైక్యాంధ్ర’ స్టిక్కర్లను అతికించారు. భీమవరం పట్టణంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు.
రైతుల దీక్షలు : కృష్ణాజిల్లా చల్లపల్లిలో లక్ష్మీపురానికి చెందిన రైతులు దీక్ష చేశారు. అవనిగడ్డలో పాత ఇనుము వ్యాపారులు, సిబ్బంది, సిం హాద్రి కాలనీ వాసులు దీక్ష చేశారు. నెల్లూరులో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్య సభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా గూడూరులో రైతు గర్జన పేరిట జరిగిన బహిరంగసభకు రైతులు, రైతుకూలీలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటికే ఎన్నో సాగు సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు... ఇక రాష్ట్రం విడిపోతే మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు, ఆదోనిలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో చేశారు.
ఆగని వైఎస్సార్ సీపీ దీక్షలు
సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వర్ష బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యాంధ్ర ఉద్యమ పథాన్ని మాత్రం వీడలేదు. శుక్రవారం జోరు వర్షంలోనూ నిరశన దీక్షలు కొనసాగించారు.