
సింహం నిద్రపోతుంది కదా అని...
గుడివాడ: సింహం నిద్రపోతుంది కదా ఏమీ చేయలేదులే అని పిచ్చి పనులు చేస్తే ఒక్క పంజాతో చంపేస్తుంది.. ఇదేదో కొత్తగా వచ్చిన సినిమాలో డైలాగ్ కాదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలివి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన సింహంతో పోల్చారు. ఉద్యమంలో విశ్రాంతి మాత్రమే తీసుకున్నామని, విరమించలేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో శుక్రవారం రాత్రి జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు అశోక్బాబు పరోక్షంగా వెల్లడించారు. తనను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు, అవకాశవాద నాయకులను చూస్తుంటే రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల సూచనను మన్నించాల్సి వస్తుందేమోనని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన జరక్కుండా అడ్డుకోవాల్సిన ఎంపీలు, రాజకీయ పార్టీల చేతకానితనం వలనే రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. విభజన ప్రక్రియను తాము 2014 వరకు ఆపగలమని, తర్వాత అడ్డుకోవాల్సింది ప్రజలేనని చెప్పారు. ఈ నెల 5 తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశోక్బాబు తెలిపారు.