'జైపాల్ వ్యాఖ్యలను ఖండించిన అశోక్బాబు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు సీమాంధ్రుల పాలిట మరణశాసనమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు అన్నారు. విభజన బిల్లును రేపు భోగి మంటల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఎందుకు కలిసుండాలే పల్లె పల్లెకు వెళ్లి చెబుతామన్నారు. శాసనసభలో విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు 17, 18న సీమాంధ్ర బంద్కు పిలుపిచ్చామని చెప్పారు.
సీమాంధ్రులను కించపరిచేలా వున్న కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి వ్యాఖ్యలను అశోక్బాబు ఖండించారు. సీనియర్ రాజకీయవేత్తగా ఆయన హోదాకు ఇవి తగవన్నారు. గాదె వెంకటరెడ్డిపై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.