జైపాల్‌రెడ్డిపై విమర్శలు సరికాదు
టీఆర్‌ఎస్ ఎంపీలపై మల్లు రవి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో విపక్షాలను సమన్వయపరచడంలో ఆయన కీలకమైన పాత్రను నిర్వహించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర లేదంటూ టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
బుధవారం మల్లు రవి విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక జైపాల్‌రెడ్డిని మొదట కేసీఆర్ కలసిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర ఏమిటో సీఎం కేసీఆర్‌ను అడిగితే టీఆర్‌ఎస్ నాయకులకు తెలుస్తుందన్నారు. కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, ఆయన ఏ విధమైన దీక్ష చేశారో, ఎలా విరమించారో, దానిపై ఓయూ విద్యార్థుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాదని టీఆర్‌ఎస్ నాయకులు నిరూపించగలరా అని ప్రశ్నించారు.