S. Jaipal Reddy
-
జైపాల్‌రెడ్డిపై విమర్శలు సరికాదు
టీఆర్ఎస్ ఎంపీలపై మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో విపక్షాలను సమన్వయపరచడంలో ఆయన కీలకమైన పాత్రను నిర్వహించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర లేదంటూ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బుధవారం మల్లు రవి విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక జైపాల్‌రెడ్డిని మొదట కేసీఆర్ కలసిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర ఏమిటో సీఎం కేసీఆర్‌ను అడిగితే టీఆర్ఎస్ నాయకులకు తెలుస్తుందన్నారు. కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, ఆయన ఏ విధమైన దీక్ష చేశారో, ఎలా విరమించారో, దానిపై ఓయూ విద్యార్థుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాదని టీఆర్ఎస్ నాయకులు నిరూపించగలరా అని ప్రశ్నించారు. -
'వాళ్లు పచ్చి అవకాశవాదులు'
మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి విధివిధానాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 2013 నాటి భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం అమలు చేయకుంటే నిరసనలు చేపడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదలిపెట్టి ఇతర పార్టీల్లోకి వెళ్లినవాళ్లు పచ్చి అవకాశవాదులని పేర్కొన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో సత్తా చాటుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని అంతకుముందు ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్రంలో ఏ వర్గానికి దక్కలేదని జైపాల్ రెడ్డి అన్నారు. -
'ఎమ్మెల్యేలను లాక్కోవడం అప్రజాస్వామికం'
హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం చేసే పోరాటానికి కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోఅధికార టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో కూడా కలవడానికే కూడా సిద్ధమేనన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. ప్రజల, హక్కులను, స్వేచ్ఛను హరించేవిధంగా ప్రభుత్వం వ్యవహరించరాదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాక్కోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి విధానాలతో నవతెలంగాణ నిర్మాణం జరపలేరన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని జైపాల్‌రెడ్డి అన్నారు. -
మెజారిటీతోనే బిల్లుకు ఆమోదం: జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో మూడిం ట రెండొంతుల మెజారిటీతో ఆమో దం లభించిందని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారంటూ ప్రచారం చేయడం సరికాదని, ఓటింగ్ ద్వారానే బిల్లు ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం తర్వాత మంగళవారం జైపాల్‌రెడ్డి నివాసానికొచ్చిన టీ-మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రు లు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్‌తోపాటు రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల, సారయ్య, ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులతో కలిసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘యూపీఏ, బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించాక కూడా బిల్లుకు తగిన సంఖ్యా బలం లేదని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ రావడం సీపీఎంకు ఇష్టం లేదు. అందుకే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి బిల్లుపై సవరణలు, ఓటింగ్ కోరాలనుకుంటే ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాదిరిగా సభలోని తమ తమ స్థానాల్లో ఎందుకు కూర్చోలేదు? అలాగాక వెల్‌లోకి దూసుకువచ్చి సవరణలపై ఓటింగ్ కోరడమేంటి?’’ అని ప్రశ్నించారు. కాగా తెలంగాణ ఏర్పాటు చారిత్రక విజయమని, దీన్ని ఉద్యమ అమరులకు అంకితమిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీభవన్‌లో టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబరాలు చేసుకున్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు. మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, మల్లురవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. -
మూడు వారాల్లో తెలంగాణ: జైపాల్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడతాయి: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే సమయం చాలుతుంది.. బీజేపీ మద్దతిస్తుంది కిరణ్ది పనికిరాని తొండి తీర్మానం దానిపై స్పీకర్‌ది తప్పుడు నిర్ణయం పార్లమెంటుకు కళ్లు కూడా ఉన్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఈ రెండూ ఫిబ్రవరి మూడో వారాంతానికల్లా ఏర్పడడం ఖాయమని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలన్న సీఎం కిరణ్ తీర్మానాన్ని తొండి తీర్మానంగా అభివర్ణించారు. దాన్ని ఒక ప్రహసనంగా కొట్టిపారేశారు. ఈ విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ప్రిసైడింగ్ అధికారులకు దురుద్దేశాలు ఆపాదించను. వాళ్లూ మానవమాత్రులే. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు’ అని అన్నారు. ‘‘ఆ తీర్మానాన్ని అసలు సభ ఏకగ్రీవంగా ఆమోదించిందా? మన లోకంలో మనం నివసిస్తున్నాం. భారత పార్లమెంటుకు చెవులు మాత్రమే కాదు, కళ్లు కూడా ఉన్నాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము నిరోధించామంటూ కొందరు గొప్పలు చెప్పుకునేందుకు తప్ప అసెంబ్లీ తీర్మానం దేనికీ ఉపయోగపడదు. బిల్లులో భాగంగా ఆమోదిస్తే ఆ తీర్మానానికి రాజ్యాంగ విలువ ఉండకపోయినా రాజకీయ విలువైనా ఉండేది’’ అన్నారు. జైపాల్ శుక్రవారం సాయంత్రం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తామంతా ఉన్నామని, తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే... తీర్మానం.. ఓ ప్రహసనం: ‘‘తీర్మానం పేరుతో రాష్ట్ర అసెంబ్లీలో జరిగినదంతా ఒక ప్రహసనంలా ఉంది తప్ప తెలుగు ప్రజల ప్రతిష్టను, అసెంబ్లీ సంప్రదాయాన్ని పెంచేలా లేదు. అంత వివాదగ్రస్తమైన తీర్మానాన్ని ఏకపక్షంగా మూజువాణితో సెకన్ల వ్యవధిలో ఆమోదించడం అవాంఛనీయం, తప్పుడు విధానం. మండలిలో, అసెంబ్లీలో జరిగిన పరిణామాలు నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పార్లమెంటు సర్వసత్తాక అధికారాన్ని ఈ తప్పుడు తీర్మానం ద్వారా తగ్గించామనే భ్రమ సృష్టిస్తున్నారు. దాంట్లో ఏ మాత్రం పస లేదు. పార్లమెంటు అధికారం వీసమంతా కూడా తగ్గదు. బిల్లును రాష్ట్రపతి పంపింది శాసనసభ అభిప్రాయాలు తెలుసుకునేందుకే తప్ప 77వ నిబంధన కింద అభిప్రాయం తెలపాలనో, తీర్మానం చేయాలనో కాదు. పైగా 77వ నిబంధన కింద ఏ తీర్మానాన్ని రూపొందించినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే పంపిస్తారు. అంతే తప్ప రాష్ట్రపతికి పంపే అధికారం శాసనసభకు లేదు. ఆ తీర్మానాన్ని చూసి సీమాంధ్ర మిత్రుల్లో భ్రమలు పెరగకూడదు. తెలంగాణలో భయాలుండాల్సిన అవసరమూ లేదు’’ సభ ఆమోదం ఖాయం ‘‘కావాల్సిన సవరణలతో పార్లమెంటులో బిల్లు యథావిధిగా ఆమోదం పొందుతుంది. ఫిబ్రవరి మూడో వారం చివరికల్లా తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడతాయి. ఇది నిస్సందేహం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయి. నాకున్న అవగాహన ప్రకారం అందుకు సమయం కూడా సరిపోతుంది. బిల్లు పాసవడమే కాదు.. గెజిట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. రాష్ట్రం ఏర్పడుతుంది. అందుకు ఇంత సమయం పడుతుందంటూ ఎక్కడా లేదు. గత దృష్టాంతాలను బట్టి 6 నుంచి 85 రోజుల వరకు నోటిఫికేషన్ పీరియడ్ ఉంది. గుజరాత్‌కు 6 రోజులుంది. వాళ్లు సిటీ మార్చారు. ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. ఆఫీసులు మార్చాల్సిన పనిలేదు. వాటిలో రూములు మార్చితే సరిపోతుంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వెంటనే పెడతారని నా వ్యక్తిగత అంచనా. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయని అనుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటు కేవలం కాంగ్రెస్ నిర్ణయం కాదు. ముందు బీజేపీ, తరవాత బీఎస్సీ తీసుకున్న నిర్ణయం. తుదకు మాత్రమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణను సమర్థించిన చంద్రబాబుకు, వైఎస్సార్సీపీకి బాధ్యత లేదా?’’ పార్లమెంటే సుప్రీం మూడో అధికరణం ప్రకారం పార్లమెంటుకు సర్వసత్తాక అధికారముంది. రాష్ట్రాల అధికారాలివీ, కేంద్రం అధికారాలివీ, ఉమ్మడి అధికారాలివీ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే ఆ జాబితాలను కూడా కాదని చట్టం చేసే అధికారాన్ని పార్లమెంటుకు 3వ అధికరణం ఇచ్చింది. బిల్లుపై బీజేపీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 3వ అధికరణ కింద ఉభయ సభలు ఒక బిల్లు రూపొందించాక అందులో కోర్టులు అంత సులువుగా జోక్యం చేసుకుంటాయనుకోను. సాంకేతిక కారణాలతో బిల్లును ఆపరు (ఆర్థిక ప్రతిపాదన పంపలేదనే వాదనపై స్పందిస్తూ)’’ సీమాంధ్రులవి ఏకపక్ష భావనలు ‘‘సీమాంధ్ర నేతలు ఒక్క విషయం ఆలోచించుకోవాలి. తెలుగు జాతి సమైక్యతను కాపాడతామంటున్నారు. తెలుగు జాతి తమిళనాడులో 25-35 శాతం ఉంది. బెంగళూరు నగరంలో 35-45 శాతం ఉంది. బళ్లారిలో 90 శాతం ఉంది. ఒడిషాలో జిల్లాలకు జిల్లాలే తెలుగు వారున్నారు. సీమాంధ్ర మిత్రులు ఏకపక్షంగా ఐక్యత కోరడంలోని అసహజత్వాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఇది అస్వభావికం. ఇంత విభజన తర్వాత ఈ దశలో ఎలా కలిసుంటారు? -
ఆయన కాలి గోటికి సరిపోరు: ఎంపీ పొన్నం
కరీంనగర్: కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై ఎంపీ పొన్నం ప్రభాకర్ త్రీవ్రస్థాయిలో మండిపడ్డారు. జైపాల్‌రెడ్డిని విమర్శించే వాళ్లు ఆయన కాలిగోటికి సరిపోరని ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణపై చర్చించేందుకు తనతో చర్చకు రావాలని ఉండవల్లికి ఆయన సవాల్ విసిరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తప్పుబట్టారు. కేంద్రమంత్రి అయివుండి సీమాంధ్రులను కించపరచడం పద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణపై జైపాల్‌రెడ్డితో ముఖాముఖి చర్చకు సిద్ధమని ప్రకటించారు. -
వీరిద్దరికీ ఏమైంది?
శుంఠ, స్టూపిడ్... ఈ మాటలన్నది మామూలు మనుషులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అమాత్య పదవులు తలపండిన రాజకీయ నాయకుల నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయల్లో దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. మంచి వక్తగా పేరున్న కేంద్ర మతం జైపాల్ రెడ్డి, ఆచితూచి మాట్లాడే రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి లాంటి నాయకులు కూడా మాట జారడంతో వీరిద్దరికీ ఏమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను సీమాంధ్ర నాయకులు ఖండించారు. ఇరు ప్రాంతాల్లో శుంఠలున్నారని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జైపాల్‌రెడ్డి లాంటి సీనియర్ రాజకీయ వేత్త ఇలా మాట్లాడడం తగదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హితపు పలికారు. వేతనాలు పెంచాలని కోరిన పాపానికి ఓ వీఆర్ఏపై ఒంటికాలిపై లేచారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని.. తమకు వేతనాలు ఎప్పుడు పెంచుతారని శేఖర్ అనే వీఆర్ఏ ప్రశ్నించాడు. దీంతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. 'నోర్ముయ్...స్టుపిడ్..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మరో మంత్రి మహీధర్ రెడ్డి కలుగచేసుకుని వేలు చూపిస్తూ...'ఏయ్...ఇక్కడ గోల చేయొద్దు' అంటూ కన్నెర్ర చేశారు. అమాత్యుల వైఖరితో అక్కడున్నవారంతా ముక్కుపై వేలేసుకున్నారు. బాధ్యతయుత పదవుల్లో పెద్ద మనుషులు విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. తమ కింది వారిని నోటికొచ్చినట్టు దూషించడం అలవాటుగా మారు తోంది. కొంతమంది నేతాశ్రీలు చేతికి పని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. నాయకుడనేవాడు మార్గదర్శిగా ఉండాలి. ప్రజా ప్రతినిధి జనం సమస్యలను పరిష్కరించాలి గాని శిక్షించకూడదు. అధికారం ఉంద కదా అని మాట జారితే ప్రజల దృష్టిలో చులకనవడమే కాదు, విలువనూ కోల్పోతారు. -
జైపాల్‌రెడ్డి పరమశుంఠ: అడుసుమిల్లి
విజయవాడ: సీమాంధ్ర ప్రాంత నాయకులను శుంఠలుగా అభివర్ణించిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పరమశుంఠ అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో విమర్శించారు. మహానుభావులైన పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరులు పుట్టిన ప్రాంతంలో శుంఠలు పుట్టారని జైపాల్ వ్యాఖ్యానించటాన్ని ఆయన తప్పుపట్టారు. మహనీయులు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు.. వంటివారు పుట్టిన గడ్డపై జైపాల్‌రెడ్డి చెడపుట్టారని విమర్శించారు. ఒకవిధంగా ఆయన తెలంగాణ ప్రాంత మహానుభావులను కూడా శుంఠలుగా అభివర్ణించినట్లేనని పేర్కొన్నారు. లోక్‌సభలో దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ.. జైపాల్‌రెడ్డిని ఉద్దేశించి ఆయనకు మనోవైకల్యం సిద్ధించిందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఇప్పటివరకూ జైపాల్‌రెడ్డి మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే రాజీవ్‌గాంధీ చెప్పింది నిజమే అనిపిస్తోందని పేర్కొన్నారు. పదవులకోసం కాళ్లుపట్టుకునే జైపాల్‌రెడ్డి ఇప్పుడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకుని దేబిరిస్తున్నారని విమర్శించారు. అదే ప్రాంతానికి చెందిన వి.హనుమంతరావు, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులంతా ఒకేగాటికి చెందినవారని పేర్కొన్నారు. -
'జైపాల్ వ్యాఖ్యలను ఖండించిన అశోక్‌బాబు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు సీమాంధ్రుల పాలిట మరణశాసనమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. విభజన బిల్లును రేపు భోగి మంటల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఎందుకు కలిసుండాలే పల్లె పల్లెకు వెళ్లి చెబుతామన్నారు. శాసనసభలో విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు 17, 18న సీమాంధ్ర బంద్‌కు పిలుపిచ్చామని చెప్పారు. సీమాంధ్రులను కించపరిచేలా వున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను అశోక్‌బాబు ఖండించారు. సీనియర్ రాజకీయవేత్తగా ఆయన హోదాకు ఇవి తగవన్నారు. గాదె వెంకటరెడ్డిపై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది: ఎస్.జైపాల్‌రెడ్డి
నిర్మల్ సభలో కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మునగాల, భద్రాచలంలు తెలంగాణవే.. సమన్యాయం నిర్వచనం ఏంటీ.. బాబూ.. విలీనంపై కేసీఆర్స్పష్టత ఇవ్వాలి సాక్షి ప్రతినిది, ఆదిలాబాద్ : దేశంలో 29వ రాష్ర్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా రాష్ట్ర విభజన ఆగదని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. 2014 నూతన సంవత్సరం వేడుకలు కొత్త రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. 1950 నుంచి 2013 వరకు సుదీర్ఘ ఉద్యమాలు జరిగాయని, అయితే దేశంలో 29 రాష్ట్రం గా తెలంగాణ ఏర్పడటం చరిత్రాత్మక ఘటన అని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో బుధవారం సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ జరిగింది. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రామచంద్ర కుంతియా పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘దేశానికి స్వరాజ్యం వచ్చి 60 యేళ్లు గడుస్తుంది. అనేక రాష్ట్రాలు వాటి ఏర్పాటుకు ఉద్యమాలు జరిగాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1953నుంచి 2013 వరకు ఉద్యమం జరుగుతూనే ఉంది’ అని చెప్పారు. దేశస్వాంత్య్రం కోసం ఎంతటి ఉద్యమం జరిగిందో అదే మాదిరిగా ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరగడం చరిత్రలో నిలుస్తుందన్నారు. ఆనాటి కొండా వెంకట్‌రెడ్డి నుంచి కొండా లక్ష్మణ్‌బాపూజీ వరకు అనేక మంది తెలంగాణ కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు మరువలేమన్నారు. సంకీర్ణయుగంలో తెలంగాణ పై సోనియాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకు న్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. సోనియా మనస్సు వెన్నలాంటిదని, నిర్ణయం మాత్రం వజ్రసంకల్పం వంటిదని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు పెట్టండి సమర్ధిస్తామంటూ చంద్రబాబు అసెంబ్లీలో అవహేళన చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అడుగుతున్న సమన్యాయం అనే బ్రహ్మపదార్థానికి నిర్వచనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని, అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంట్‌కు ఉన్న విశేషాధికారంతో బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నదీ జలాలపై మాట్లాడుతున్నారని, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం కంటే ముందే నది ఉందా.. లేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నది ఏర్పడిందో తెలుపాల న్నారు. హైదరాబాద్‌పై స్పష్టత అడుగుతున్నట్లే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విలీనంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కొమురంభీం ఆదిలాబాద్ జిల్లాగా పేరు పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.భద్రాచలం, మునగాల ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగమన్నారు. సీఎం నివేదికను ఎవరూ పట్టించుకోరూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కిరణ్ నివేదిక పంపడం శోచనీయమని, ఆనివేదికను ఎవరూ పట్టించుకోరని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటో లేకుండా నిర్వహించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్రుల భద్రతకు ఎక్కడ ఇబ్బంది కలిగిందో చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు సవాల్ విసిరారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని తీర్మానం సీడబ్ల్యుసీ, యూపీఏ సమన్వయకమిటీ తీర్మానించిన విధంగా కేంద్ర కేబినేట్ ఆమోదించిన ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రధానికి, సోనియాకు విన్నవించాలని సభ తీర్మానించింది. సమావేశంలో మంత్రులు రాంరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్అనిల్, ఎంపీలు మధుయాష్కీ, రాజయ్య, ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్ రెడ్డి, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, సీనియర్ నేతలు పాల్వాయి గోవర్దన్, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినమ్రంగా ప్రార్థిస్తున్నా.. బిల్లుకు సహకరించండి ‘ఈ నెల 26న అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వసుంది.. సీమాంధ్ర నేతలారా మీకు వినమ్రంగా నమస్కరిస్తున్నా బిల్లుకు సహకరించండి.. ’ అంటూ కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కృతజ్ఞత సభలో జైపాల్‌రెడ్డిని ఎమ్మెల్యే మహెశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించి కత్తిని బహుకరించినప్పుడు ‘ నేను కత్తులు దూసే వాడిని కాదు... గాంధేయవాదిని, సీమాంధ్ర నేతలు సుహృద్భావ వాతావరణంలో విడిపోయేందుకు సహకరించాలి’ అని కోరారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే నేడు జాతీయ పార్టీలన్నీ తెలంగాణను సమర్ధిస్తున్నాయని చెప్పారు. సీపీఐ తన నిర్ణయాన్ని వెల్లడించడం అభినందనీయమని, హైదరాబాద్‌పై ఎంఐఎం తీసుకున్న అభిప్రాయాన్ని అభినందిస్తున్నామన్నారు. -
శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు: జైపాల్‌రెడ్డి
హైదరాబాద్ తెలంగాణలో భాగమే: జైపాల్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం తెలంగాణ ప్రజల విజయమని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని, పార్లమెంటులో దానికి ఆమోదం కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది చారిత్రాత్మక దినం. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ప్రగాఢ కాంక్ష ఈ రోజు నెరవేరింది. కేబినెట్ నిర్ణయం తెలంగాణ ప్రజలందరి విజయం. తెలంగాణపై ఏం చర్చించారన్న దానికన్నా... తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ముఖ్యం. కేబినెట్ భేటీలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాను. సీమాంధ్ర మంత్రులు వారి ప్రాంత మనోభావాలు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కేబినెట్ నోట్ ద్వారా రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతం తెలిపిందని చెప్పే సువర్ణావకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం అంతా సమష్టిగా కృషి చేయాలి’’ అని జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటుపై నియమించే మంత్రుల బృందం తెలంగాణ బిల్లును తయారు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో రెండు ప్రభుత్వాలు సవ్యంగా నడిచేందుకు చట్టపరమైన, విధానపరమైన అంశాలను... విద్యుత్, గ్యాస్ వంటి అంశాల్లో ఎలా న్యాయం చేయాలన్నదానిపై మంత్రుల బృందం చర్చిస్తుందన్నారు. తర్వాత ఈ బిల్లు కేబినెట్ ముందుకు వస్తుందని, పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్టప్రతికి పంపిస్తారని తెలిపారు.