వీరిద్దరికీ ఏమైంది?
శుంఠ, స్టూపిడ్... ఈ మాటలన్నది మామూలు మనుషులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అమాత్య పదవులు తలపండిన రాజకీయ నాయకుల నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. కేంద్రమంత్రి ఎస్. జైపాల్రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయల్లో దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. మంచి వక్తగా పేరున్న కేంద్ర మతం జైపాల్ రెడ్డి, ఆచితూచి మాట్లాడే రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి లాంటి నాయకులు కూడా మాట జారడంతో వీరిద్దరికీ ఏమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను సీమాంధ్ర నాయకులు ఖండించారు. ఇరు ప్రాంతాల్లో శుంఠలున్నారని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జైపాల్రెడ్డి లాంటి సీనియర్ రాజకీయ వేత్త ఇలా మాట్లాడడం తగదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు హితపు పలికారు.
వేతనాలు పెంచాలని కోరిన పాపానికి ఓ వీఆర్ఏపై ఒంటికాలిపై లేచారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని.. తమకు వేతనాలు ఎప్పుడు పెంచుతారని శేఖర్ అనే వీఆర్ఏ ప్రశ్నించాడు. దీంతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. 'నోర్ముయ్...స్టుపిడ్..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మరో మంత్రి మహీధర్ రెడ్డి కలుగచేసుకుని వేలు చూపిస్తూ...'ఏయ్...ఇక్కడ గోల చేయొద్దు' అంటూ కన్నెర్ర చేశారు. అమాత్యుల వైఖరితో అక్కడున్నవారంతా ముక్కుపై వేలేసుకున్నారు.
బాధ్యతయుత పదవుల్లో పెద్ద మనుషులు విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. తమ కింది వారిని నోటికొచ్చినట్టు దూషించడం అలవాటుగా మారు తోంది. కొంతమంది నేతాశ్రీలు చేతికి పని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. నాయకుడనేవాడు మార్గదర్శిగా ఉండాలి. ప్రజా ప్రతినిధి జనం సమస్యలను పరిష్కరించాలి గాని శిక్షించకూడదు. అధికారం ఉంద కదా అని మాట జారితే ప్రజల దృష్టిలో చులకనవడమే కాదు, విలువనూ కోల్పోతారు.