ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు
వాడూ.. వీడూ అంటూ మాజీ సీఎంను తూలనాడుతూ బహిరంగ ప్రసంగం
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఏబీవీ వ్యాఖ్యలు
విద్వేషాలు రెచ్చగొట్టడంపై సామాజికవేత్తల విభ్రాంతి
∙ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్
సాక్షి, అమరావతి : ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలి. అందుకోసం అహర్నిశలు కష్టపడాలి. అందుకు ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్త చర్యగా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’.. అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘వాడూ.. వీడూ’ అంటూ తూలనాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఏం చేసేందుకైనా కమ్మవాళ్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నా’.. అని ఆయన బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈనెల మొదటి వారంలో నిర్వహించిన కమ్మ సామాజికవర్గ సమావేశంలో ఏబీవీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఇలా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించడంపట్ల పోలీసు వర్గాలతోపాటు సామాజికవేత్తలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడీయన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత వివాదాస్పదంగా సాగిన ఈ ప్రసంగంలో ఏబీవీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండండి..
‘నెవ్వర్ ఎగైన్.. నెవ్వర్ ఎగైన్.. ఇటువంటి వాడు అటువంటి అధికారాన్ని మళ్లా పొందకుండా అహర్నిశలు కష్టపడాల్సిన బాధ్యత మనందరం (కమ్మవాళ్లు) తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఆ బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలి. దీనికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని మీ అందరికీ (కమ్మవాళ్లకు) పిలుపునిస్తున్నా’.
ఏబీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి..
ఇదిలా ఉంటే.. దాడులా.. దౌర్జన్యాలా.. హత్యలు చేయాలా.. అసలాయన ఉద్దేశం ఏమిటని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంతలా బరితెగించి సమాజంలో విద్వేషాలు, అల్లర్లను ప్రోత్సహించడం విభ్రాంతి కలిగిస్తోందని సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావు ప్రసంగం వీడియో చూసి ఎవరైనా ప్రభావితమై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఏబీ వెంకటేశ్వరరావు సమ్మతించకపోతే పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఏబీ వెంకటేశ్వరరావు విద్వేషపూరిత వ్యాఖ్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని భావించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment