శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు: జైపాల్‌రెడ్డి
హైదరాబాద్ తెలంగాణలో భాగమే: జైపాల్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం తెలంగాణ ప్రజల విజయమని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని, పార్లమెంటులో దానికి ఆమోదం కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది చారిత్రాత్మక దినం. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ప్రగాఢ కాంక్ష ఈ రోజు నెరవేరింది. కేబినెట్ నిర్ణయం తెలంగాణ ప్రజలందరి విజయం. తెలంగాణపై ఏం చర్చించారన్న దానికన్నా... తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ముఖ్యం.
కేబినెట్ భేటీలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాను. సీమాంధ్ర మంత్రులు వారి ప్రాంత మనోభావాలు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కేబినెట్ నోట్ ద్వారా రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతం తెలిపిందని చెప్పే సువర్ణావకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం అంతా సమష్టిగా కృషి చేయాలి’’ అని జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటుపై నియమించే మంత్రుల బృందం తెలంగాణ బిల్లును తయారు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో రెండు ప్రభుత్వాలు సవ్యంగా నడిచేందుకు చట్టపరమైన, విధానపరమైన అంశాలను... విద్యుత్, గ్యాస్ వంటి అంశాల్లో ఎలా న్యాయం చేయాలన్నదానిపై మంత్రుల బృందం చర్చిస్తుందన్నారు. తర్వాత ఈ బిల్లు కేబినెట్ ముందుకు వస్తుందని, పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్టప్రతికి పంపిస్తారని తెలిపారు.