సమైక్య తీర్మానం చేద్దాం : వైఎస్‌ జగన్‌ | Let we do for United Resolution: ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

సమైక్య తీర్మానం చేద్దాం : వైఎస్‌ జగన్‌

Published Tue, Oct 1 2013 2:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Let we do for United Resolution: ys jagan mohan reddy

' నోట్‌కు ముందు అప్రమత్తమైతేనే విభజన ఆగుతుంది: వైఎస్‌ జగన్‌
'  వైఎస్‌ జగన్‌కేబినెట్‌ నోట్‌ అసెంబ్లీకి వచ్చాక చేసేదేమీ ఉండదు
'  వైఎస్‌ జగన్‌అక్టోబర్‌ 15 నుంచి 20 తేదీల మధ్య హైదరాబాద్‌లో ‘సమైక్య శంఖారావం’ సభ
'  వైఎస్‌ జగన్‌కాంగ్రెస్‌తో డీల్‌ కుదిరితే 16 నెలల పాటు జైలులో ఎందుకుంటాను?    
' వైఎస్‌ జగన్‌వైఎస్సార్‌ కాంగ్రెస్‌, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నాయి
'  సమైక్యం కోసం లేఖ తీసుకువస్తే నేను తొలి సంతకం పెట్టటానికి సిద్ధంగా ఉన్నా
'  అన్ని పార్టీల అధ్యక్షుల చేత పెట్టిస్తే.. మూడు పార్టీలు నాలుగూ, ఐదూ అవుతాయి
'  ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్‌ విభజిస్తోంటే.. ఓట్లు, సీట్లు పోతాయని టీడీపీ మౌనంగా ఉంది
'  రాష్ట్రాన్ని విభజిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయి?
' హైదరాబాద్‌ మీదికాదు పొమ్మంటే.. చదువుకున్న ప్రతి పిల్లవాడి భవిష్యత్‌ ఏంకావాలి?
'  సమైక్యం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ మూడు ప్రాంతాలూ కావాలి
'  ప్రతి తెలంగాణ సోదరుడ్నీ అభివృద్ధి వైపు నడిపిస్తానని నేను గట్టిగా హామీ ఇవ్వగలను
'  60% మంది రోడ్లెక్కి ఆందోళన చేస్తోంటే.. అందరికీ ఆమోదయోగ్యమని ఎలా చెప్తారు?
'  మీడియా సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ కేబినెట్‌ నోట్‌ తయారు కాకముందే రాజకీయ పార్టీలు అప్రమత్తం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కేబినెట్‌ నోట్‌ సిద్ధమై అసెంబ్లీకి వచ్చిన తర్వాత చేసేదేమీ ఉండదని.. ముందుగానే అప్రమత్తమై తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని.. అలాగైతేనే విభజనను నిలువరించగలమని పేర్కొన్నారు. జగన్‌ సోమవారం పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ను కలిశారు. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం ఆమోదించాలని కోరుతూ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 16 నెలల జైలు నిర్బంధం తర్వాత కొద్ది రోజుల కిందట బెయిల్‌పై విడుదలైన తర్వాత జగన్‌ తొలిసారిగా మీడియా ముందుకు రావటంతో దాదాపుగా రాష్ట్ర, జాతీయ మీడియా అంతా హాజరైంది. జగన్‌ విలేకరుల సమావేశానికి విస్తృత ప్రాముఖ్యతనిచ్చింది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, ఇతర అంశాలను జగన్‌ ఈ సందర్భంగా సుదీర్ఘంగా వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జరుగుతున్న ఉద్యమం, ఆందోళనలు, కుమ్మక్కు రాజకీయాలు, జాతీయ రాజకీయాంశాల గురించి మాట్లాడారు.

హోంశాఖ కేబినెట్‌ నోట్‌ తయారుకాకముందే అప్రమత్తమై అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పుడే విభజనను ఆపగలమని జగన్‌ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఇదే అంశంపై పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో అక్టోబర్‌ 15 నుంచి 20 తేదీ మధ్యలో హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగన్‌ ప్రకటించారు. సమైక్య రాష్ట్రం కోసం జేఏసీ లేఖ తీసుకొస్తే తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా తొలి సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ.. తామేదో కుమ్మక్కయినట్టు వేలు తమవైపు చూపటాన్ని ఆయన ఆక్షేపించారు. కేసు నమోదైనప్పుడు దర్యాప్తు పూర్తి కాని పక్షంలో 90 రోజుల్లోగా బెయిల్‌ రావాలని రాజ్యాంగం చెప్తోందని.. కానీ తనకు ఆ హక్కును నిరాకరించారని.. కాంగ్రెస్‌తో డీల్‌ కుదిరితే తాను 16 నెలల పాటు జైలులో ఎందుకుంటానని జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ముందే తీర్మానం చేస్తే.. ‘‘అడ్డగోలుగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం తప్పు. అసలు కేబినెట్‌ నోట్‌ తయారు కాకముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయండని కోరడానికి ఒక కారణముంది.

కేబినెట్‌ నోట్‌ రూపొందాక కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటై, బిల్లు ముసాయిదా అయిపోయాక చివరిగా అది అసెంబ్లీకి వస్తే అపుడు మనం తీర్మానం ద్వారా వ్యతిరేకించినా దానికి ప్రాధాన్యత ఉండదు. అలా కాకుండా ఇపుడే అసెంబ్లీని సమావేశ పరచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే అపుడు కేంద్రంలోని పెద్దలు, దేశంలోని అందరూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తారు. అది చూసి కాస్తో కూస్తో వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందనే ఆశతోనే గవర్నర్‌ను కూడా కలిశాం’’ అని జగన్‌ వివరించారు. విభజన విషయంలో పలు పార్టీల తీరును తప్పుబట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌, సీపీఎం, ఎంఐఎంలు... ఈ మూడు పార్టీలే మనసా వాచా సమైక్యానికి కట్టుబడి ఉన్నాయని, మిగిలిన పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఈ వ్యవస్థలో కనిపించడం లేదన్నారు. సమస్యపై ఒక తండ్రిలా ఆలోచించాల్సిన పరిస్థితి కాకుండా మున్ముందు పిల్లలు కొట్టుకునే పరిస్థితి రానివ్వడం బాధ కలిగిస్తుందన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజిస్తుంటే.. అడగాల్సిన ధర్మం, బాధ్యత ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని అడక్కుండానే విభజన జరగనిస్తోందని దుయ్యబట్టారు. రోజూ నీటి కోసం కొట్టుకునే పరిస్థితికి నెడుతున్నారు... ‘‘నేను ఒక్క మాట అడుగుతున్నా... ఇవాళ రాష్ట్రాన్ని విభజించే వాళ్లు ఏమైనా ఆలోచన చేశారా..? రాష్ట్రాన్ని ఒక్కసారి తిరిగి చూడండి.
 రాష్ట్రం సమష్టిగా ఉన్నప్పుడే మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ డ్యాంలు నిండిన తరువాత కృష్ణా నదిలో కిందికి నీళ్లు రాని పరిస్థితి, వదలని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలంకు నీళ్లెలా వస్తాయి..? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా వస్తాయి..? ఈ పెద్దలను అడుగుతున్నా. ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాను అంటే.. ట్రిబ్యునళ్లు ఏం చెప్పినా... కోర్టులు ఏం చెప్పినా... ప్రధానమంత్రులు ఏం చెప్పినా కూడా రాష్ట్రం ఒకటిగా ఉన్నపుడే ఈ పరిస్థితి ఉంటే.. ఇక మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు కూడా ఎక్కడా దొరకని పరిస్థితుల్లోకి ఇవాళ ఈ కేంద్ర పెద్దలు, ఈ రాష్ట్ర పెద్దలు రాష్ట్రాన్ని తీసుకెళుతున్నారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలే కాదు.. ప్రకాశం, నెల్లూరే కాదు.. కృష్ణా, గుంటూరే కాదు.. పశ్చిమగోదావరిలోని సగం ప్రాంతాలే కాదు.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌.. మొత్తం ఈ మూడు జిల్లాలతో పాటు ఈ ఎనిమిదిన్నర జిల్లాలు కూడా మొత్తం ప్రతి రోజూ నీటి కోసం కొట్టుకుని తన్నుకునే పరిస్థితి నెలకొంటుంది.

మరో విషయం.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు చిట్ట చివరన వస్తుంది. రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు..? కేంద్ర పెద్దలను, రాష్ట్ర పెద్దలను అడిగాం. లేఖలు రాశాం. రాష్ట్రం ఎడారి అవుతుందని కూడా నిలదీశాం’’ అని అన్నారు. హైదరాబాద్‌ మీది కాదు పొమ్మంటారా? అడ్డగోలుగా విభజన చేసి హైదరాబాద్‌ వదిలిపెట్టి పొమ్మని చెప్పటం ఎంతవరకు న్యాయమని జగన్‌ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం 50 శాతం బడ్జెట్‌ హైదరాబాద్‌ నగరం నుంచే వస్తోందని గుర్తుచేశారు. ‘‘మీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కాదు పొమ్మంటే, పదేళ్లలో హైదరాబాద్‌ను వదిలి వేరే చోట రాజధాని నగరాన్ని కట్టుకోమంటే... ఏంటి పరిస్థితి? అప్పుడు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు సంక్షేమ పథకాలన్నీ కూడా నడిరోడ్డున ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్న పిల్లవాడైనా తన చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్‌ నగరంవైపు చూస్తున్నారు.. అలాంటప్పుడు వారి భవిష్యత్తేంకావాలి?’’ అని నిలదీశారు.

సమైక్యం అంటే మూడు ప్రాంతాలూ...
రాయలసీమ, కోస్తా, తెలంగాణతో కూడిన సమైక్య రాష్ట్రం మాకు కావాలని జగన్‌ విస్పష్టంగా చెప్పారు. ‘‘సమైక్యం అంటే అది ఒక్క రాయలసీమనే కాదు, కోస్తాంధ్రనే కాదు, తెలంగాణ కూడా కలిపి అంటున్నాను. మాకు తెలంగాణ కావాలి.. మాకు రాయలసీమ కావాలి.. మాకు కోస్తాంధ్ర కూడా కావాలి. అదే సమైక్యం అంటే. ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడికి గట్టిగా ఒక్క మాట చెప్పగలుగుతా.. ప్రతి తెలంగాణ సోదరుడినీ అభివృద్ధి వైపు నేను నడిపిస్తానని గట్టిగా హామీ ఇవ్వగలుగుతాను. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు అన్నది గతంలో ఎవ్వరూ కూడా ఆలోచన చేయలేదు. ఆలోచన చేసిందల్లా వె .ఎస్‌.రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ఈ ప్రాజెక్టును ఆయన చనిపోయాక పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడగొట్టడమనేది పరిష్కారం కాదు’’ అని స్పష్టంచేశారు.

నాటి మా లేఖను ఒక్కసారి పరిశీలించండి...
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరితే తమ వ్యతిరేకులు అనేక విమర్శలు చేస్తున్నారని.. తామేదో యూ టర్‌‌న తీసుకున్నామని అంటున్నారని జగన్‌ తప్పుపట్టారు. తమ పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రికి ఇచ్చిన లేఖలోని అంశాలను ఒక్కసారి పరిశీలించాలని కోరారు. ‘‘రకరకాల మాటలపై జైల్లో ఉన్నపుడు స్పందించలేకపోయా... కానీ మనసుకు బాధ కలిగింది. నేను ప్లీనరీ సమావేశాల్లో చెప్పిన మాటలను ఒక్కసారి తిరగేయండి. మా పార్టీ హోంమంత్రికి లేఖ ఇచ్చినపుడు ఆ లేఖలో రాసిన అంశాలను ఒక్కసారి చూడండి.. అని ప్రతి ఒక్కరినీ అడుగుతున్నా. ఎవరికీ అన్యాయం జరుక్కుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని ఆ లేఖలో స్పష్టంగా రాశాం. ఇవాళ 60 శాతం ప్రజలు రోడ్లెక్కారు, 60 రోజుల నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రోడ్లమీదకు వచ్చి బంద్‌లు చేస్తున్నారు. 60 శాతం మంది ప్రజలు రోడ్లెక్కి ‘అన్యాయం జరుగుతా ఉంది’ అనంటే.. ఇది అన్యాయంగా మీకు కనపడ్డం లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇన్ని ధర్నాలు, సమ్మెలు జరుగుతూ ఉంటే మీరెలా చెప్పగలరు.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని..?’’ అని ఘాటుగా విమర్శించారు. ప్రజల మనసుల్లో సమైక్య భావనను తీసేయలేరు...

‘‘ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు రావాలి. ఈ వ్యవస్థల్లో నిజాయితీ రావాలి. ఒక్కటే చెప్తున్నా.. చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుందో నాకూ అదే నష్టం జరిగేది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు సీట్లు పోతాయని చంద్రబాబు మాట్లాడలేదు. నేను జైలులో ఉన్నందున మాట్లాడలేని, స్పందించలేని పరిస్థితిలో ఉన్నాను’’ అని జగన్‌ పేర్కొన్నారు. ‘‘సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్‌ నగరం నుంచి బయటకు పోకుండా ననై్నతే కట్టడి చేస్తున్నారు గాని ప్రజల మనసుల్లో కలసి ఉండాలన్న భావనను ఎవరూ కూడా తీసేయలేరు. అందుకే సమైక్య ఉద్యమంలో భాగంగా సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్‌లో అక్టోబర్‌ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఒక భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నాం. ఈ విషయం మీద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ.. అందరూ కూడా ఆ సభకు విచ్చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని ఆయన తెలిపారు.

 రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరగాలి...
సమైక్యానికి కట్టుబడుతూ జేఏసీ తమ ఇష్టమొచ్చిన లేఖను తీసుకొచ్చినా ఒక పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి సంతకం తాను పెడతానని జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘ఇవాళ మూడు పార్టీల నుంచి నాలుగు పార్టీలు ఆ తరువాత ఐదు పార్టీలు అవుతాయి. చంద్రబాబుగారు ఏమో లేఖ వెనక్కి తీసుకోరు. సమైక్యానికి కట్టుబడి ఉన్నట్లుగా తాను లేఖ ఇవ్వరు. తాను రాజీనామా చేయరు. కానీ బయటేమో ప్రజల వ్యతిరేకత ఎక్కడ వస్తుందోనని చెప్పి నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబుకు సంబంధించిన నేతలు నిస్సిగ్గుగా జేఏసీ మీటింగ్‌లలో పాలు పంచుకుంటారు. నేను కోరేదేమంటే ప్రజలందరూ ఒక్కటై ప్రతి రాజకీయ పార్టీనీ ప్రశ్నించాలి. చంద్రబాబు గారితో మొదలు పెట్టి అందరినీ అడగాలి. ‘అయ్యా... నువ్వు సమైక్యానికి మద్దతుగా లేఖ ఇవ్వనపుడు.. ఎందుకు మీ పార్టీ వాళ్లు జేఏసీకి వస్తున్నారు?’ అని ప్రశ్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అపుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. పార్టీ పెద్దలు లేఖల మీద సంతకాలు పెట్టాలి. అపుడు తేటతెల్లంగా మూడు పార్టీలు కాస్తా నాలుగూ ఐదూ అవుతాయి. అప్పుడు విభజనకు అనుకూలంగా నాలుగు, వ్యతిరేకంగా నాలుగు పార్టీలవుతాయి. లేకపోతే సమైక్యానికి ఐదు, విభజనకు మూడు పార్టీలు కూడా అవుతాయి. అపుడే ఈ రాష్ట్రం విడిపోకుండా ఆపగలుగుతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement