united resolution
-
స్వామి కార్యం.. స్వకార్యం.. !
విభజన బిల్లుపై హైకమాండ్ వ్యూహం అమలు చేసిన సీఎం కిరణ్ * సమైక్య తీర్మానం చేయకుండా.. బిల్లుపై కానీ, సవరణలపై కానీ ఓటింగే లేకుండా.. విభజన బిల్లును గండం గట్టెక్కించిన సీఎం * బిల్లుపై చర్చను ముందే పూర్తిచేయించి.. శాసనసభను వాయిదా వేయటానికి ముందుగా.. చిట్టచివర్లో తిరస్కరణ పేరుతో తీర్మానం * కనీసం విభజన బిల్లుపై చర్చకన్నా ముందే ఓటింగ్ పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరినా.. సహకరించని సీఎం, అధికార కాంగ్రెస్ * సమైక్య తీర్మానం, ఓటింగ్‌ల వల్ల బిల్లుకు ఇబ్బందులు వస్తాయనే పట్టించుకోని సీఎం.. విభజనపై హైకమాండ్‌కు పూర్తి సహకారం * సీడబ్ల్యూసీ భేటీ నుంచి.. అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని తిప్పి పంపేవరకూ కాంగ్రెస్ అధిష్టానం ‘రోడ్ మ్యాప్’ను అమలుచేసిన కిరణ్ * చర్చకు మరింత గడువు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినా.. అక్కడి నుంచి సమాచారం రాకముందే హడావుడిగా చర్చకు ముగింపు సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లు శాసనసభకు రాకముందే సభలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే.. రేపటి రోజున పార్లమెంటులో బిల్లుకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించి.. అలాంటి తీర్మానం రాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించారు. విభజన బిల్లు చర్చ జరపడానికంటే ముందే సమైక్య తీర్మానం చేసినా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని, ఓటింగ్‌లో దాన్ని ఓడిస్తామని చెప్తూవచ్చారు. సీఎం చెప్తున్న ఆ మాటలనే సీమాంధ్ర నేతలు నమ్ముతూ వచ్చారు. తీరా బిల్లుపై తాను మాట్లాడదలుచుకున్నదంతా మాట్లాడి.. ఆ తర్వాత తీరికగా దాన్ని తిరస్కరించా లంటూ నోటీసు ఇవ్వటం ద్వారా.. బిల్లుపై ఓటింగ్ జరక్కుండా పకడ్బందీగా వ్యవహరించారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చర్చ పూర్చిచేసి.. తిరస్కరణ తీర్మానం..! బిల్లు అసమగ్రంగా ఉందని, దాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం తీర్మానం ప్రవేశపెట్టదల్చుకుంటే.. ఆ అంశాన్ని బిల్లుపై చర్చలో పాల్గొనకముందే చెప్పి దానిపై నోటీసు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు. పైగా.. బిల్లుపై తన అభిప్రాయాన్ని శాసనసభలో మూడు రోజుల పాటు మూడు దఫాలుగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత నోటీసు ఇచ్చారు. ముందే నోటీసు ఇస్తే సభలో మిగిలిన వారంతా దానిపైనే పట్టుపట్టే అవకాశాలు ఉంటాయని.. దానివల్ల బిల్లుపై తదనంతర ప్రక్రియ పూర్తికాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుందని తెలిసే.. అలా జరగకుండా ఉండేందుకు సీఎం ముందస్తుగా నోటీసు ఇవ్వలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బిల్లు అసమగ్రంగా ఉందని చెప్పిన సీఎం దాన్ని పరిశీలించటానికి ఇంతకాలం సమయం దొరకలేదని.. తాను నోటీసు ఇచ్చిన మూడు రోజుల తర్వాత మీడియాతో చెప్పడాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. శాసనసభలో ఒకవైపు, మండలిలో మరోవైపు ప్రతి రోజూ విభజన బిల్లుపై చర్చ, నిరసనలు, ఆందోళనలు సాగుతుంటే.. తనకు బిల్లును పరిశీలించటానికే సమయం దొరకలేదని పేర్కొనడాన్ని బట్టి సీఎం ఆంతర్యమేంటో తేలిపోతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. విభజన బిల్లుపై చర్చ పూర్తయిందని, అభిప్రాయాలన్నింటినీ రాష్ట్రపతికి పంపిస్తున్నామని శాసనసభలో స్పీకర్ ప్రకటించటం పూర్తి చేసిన తర్వాత.. అంటే బిల్లుకు సంబంధించిన చర్చ, అభిప్రాయాల ఘట్టం ముగిసిన తర్వాత.. సీఎం ఇచ్చిన తిరస్కరణ నోటీసును చేపట్టారు. చర్చ పూర్తయిన తర్వాత తీర్మానం చేపట్టటమంటే రెండూ వేరువేరు అంశాలుగానే పరిగణిస్తారని రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ గురువారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. పైగా గతంలో రాష్ట్రాల విభజన జరిగిన చోట కూడా అసెంబ్లీలు ఇలాంటి తీర్మానం చేయగా.. వాటిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం ముఖ్యమంత్రికి బాగా తెలుసునని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అడ్డుపడుతుందనే సమైక్య తీర్మానం వద్దన్న వైనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో బిల్లు రావటానికి ముందుగానే సమైక్య తీర్మానం చేసి ఉంటే.. అసలు బిల్లుపై చర్చకు అవకాశముండేదే కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కనీసం బిల్లు వచ్చాక చర్చ ప్రారంభమయ్యే సమయంలోనైనా.. ముందుగా బిల్లుపై ఓటింగ్‌ను నిర్వహించి ఆ తరువాత చర్చిద్దామని వైఎస్సార్ సీపీ ప్రతిపాదించినా అధికార పార్టీ నేతలు సహకరించలేదు. అలా ముందే బిల్లుపై ఓటింగ్ జరిగి ఉంటే మెజారిటీ సభ్యులు వ్యతిరేకించటం ద్వారా కేంద్రం ఈ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు వెనకడుగు వేసే ఆస్కారముండేది. ఈ రెండింటికీ అవకాశం ఉండకుండా చివరి వరకూ నాన్చిన సీఎం కిరణ్.. తిరస్కరణ తీర్మానం నోటీసుతో బిల్లుపై అసలు ఓటింగే జరగకుండా విజయవంతంగా అడ్డుకున్నారని సమైక్యవాదుల్లో బలంగా వినిపించింది. గడువుకోరి.. సభను ముగించారు అసెంబ్లీలో చర్చలో 86 మందే పాల్గొన్నారని, అందరికీ అవకాశం దక్కేందుకు మూడు వారాల అదనపు గడువు ఇవ్వాలని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. సీమాంధ్ర మంత్రులతోనూ లేఖలు రాయించారు. అంతకుముందు ఆయన ఒక్కరే లేఖ రాయగా అసెంబ్లీ చివరి రోజున అంటే 23వ తేదీన చివరి నిమిషంలో వారం పాటు గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి నుంచి లేఖ వచ్చింది. మరింత గడువుకోసం తాజాగా లేఖ రాసిన సీఎం.. రాష్ట్రపతి నుంచి సమాచారం కోసం కూడా ఎదురుచూడలేదు. గడువు కోసం ఢిల్లీ పెద్దలతో, రాష్ట్రపతి కార్యాలయ వర్గాలతో కూడా సంప్రదింపులూ జరపలేదు. పైగా శాసనసభను గురువారం సాయంత్రం వరకు కొనసాగింపచేసే అవకాశమున్నా మధ్యాహ్నానికే ముగించే లా చూశారు. ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు అంశంపై ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్లు ఢిల్లీ వర్గాలను ఆరాతీశారు. ఢిల్లీలో పరిణామాలు మారుతున్నాయన్న సంకేతాలు ఇక్కడి నేతలకు అందాయి. మధ్యాహ్నానికి గడువు పొడిగింపుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉందని లగడపాటి అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పారు. అయితే ఈలోగానే బిల్లుపై చర్చ ముగించి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయించారు. సభ వాయిదా అనంతరం సీఎం తన చాంబర్ వైపు వస్తూ ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేశారని సీఎంఓ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావిస్తే ఆయనేమీ నినాదాలు చేయలేదని స్పష్టంచేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోతున్న సమయంలో సీఎం కిరణ్ తనను పలకరించిన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ‘‘ఇంకేముంది. అంతా అయిపోయిందిగా..!’’ అని వ్యాఖ్యానిస్తూ ముందుకు వెళ్లడం గమనార్హం. ‘రోడ్‌మ్యాప్’ పక్కాగా పూర్తి రాష్ట్ర విభజనకు సంబంధించి గత ఏడాది జూలై 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసేవరకు కాంగ్రెస్ అధిష్టానం జరిపిన ప్రతి కసరత్తులోనూ భాగస్వామిగా ఉన్న సీఎం కిరణ్.. అప్పటి నుంచీ తాజాగా బిల్లుపై అసెంబ్లీలో ‘చర్చను పూర్తిచేసి’ కేంద్రానికి తిప్పిపంపే వరకూ కాంగ్రెస్ రూపొందించిన ‘రోడ్ మ్యాప్’ను అమలు చేయటంలో కీలక పాత్ర పోషించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్టీ కోర్ కమిటీ భేటీలో విభజనకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించింది. సీడబ్ల్యూసీ తీర్మానం తరువాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం పార్టీలకతీతంగా ఒక్కుదుటన పైకి లేచింది. ఊరూవాడా ఏకమై 2 నెలల పాటు ఉద్యమం ఉధృతంగా సాగింది. ఏపీఎన్జీఓలు రెండు నెలలకు పైగా సమ్మెను కొనసాగించారు. సమ్మె కారణంగా కోట్లాది రూపాయల వేతనాలు కూడా వదులుకున్నారు. ఉద్యోగుల సమ్మెను సీఎం అర్థంతరంగా ముగింపచేశారు. ఈ ఉద్యమ వేడిని చూసి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటానికి సిద్ధపడగా తొంద రపాటు వద్దంటూ సీఎం వారిని వారించారు. శాసనసభ తీర్మానం లేకుండా అసలు బిల్లు తయారే కాదంటూ కొన్నాళ్లు.. బిల్లు రూపొందించినా కేంద్రం ఒక్క అడుగూ ముందుకు వేయలేదంటూ మరికొన్ని రోజులు నెట్టుకొచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సివచ్చినప్పుడు.. తీర్మానం అవసరం లేదు, బిల్లును ఓడిద్దామని మరి కొంత కాలం చెప్పుకొచ్చారు. చివరకు కేంద్ర కేబినెట్ విభజన నిర్ణయాన్ని ఆమోదించడం.. మంత్రుల కమిటీ ముసాయిదా బిల్లును రూపొందించడం, కేంద్రం దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపటం జరిగిపోయాక కూడా సీఎం ‘ఏమీ కాద’ంటూ ఎమ్మెల్యేల ఆవేశంపై నీళ్లు చల్లారు. విభజన నిర్ణయానికి నిరసనగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా వాటిని ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకొని ఇతర నేతలు రాజీనామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు అసెంబ్లీలో తీర్మానం ఉండదని, బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని ఢిల్లీ పెద్దలు పదే పదే ప్రక టించాక కూడా.. బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, దాన్ని ఓడించడం ద్వారా విభజనను అడ్డుకుందామని సీఎం కొత్త పాట మొదలుపెట్టారు. ఇలా అన్ని దశల్లోనూ సీఎం అధిష్టానం చర్యలకు పార్టీ రాష్ట్ర నేతల నుంచి, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవహరించారు. చివరకు అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగానే కేబినెట్ భేటీలో నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏ రోజున రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందో చూసుకొని అప్పటి నుంచే శాసనసభ సమావేశాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. బిల్లు రాష్ట్రానికి వచ్చిన తరువాత అసెంబ్లీకి సమర్పించడం, సభలో చర్చను చేపట్టించడంతో సహా అన్నీ సాఫీగా ముందుకు తీసుకువెళ్లేలా చేశారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందని, బిల్లుకు సవరణలు ప్రతిపాదించడం, వాటిపై కూడా చర్చ, ఓటింగ్ ఉంటుందని చెప్తూ.. చర్చలో అందరి అభిప్రాయాలకు వీలుకల్పించారు. ఇలా బిల్లుపై చర్చను ముందుకు సాగించి అందరి నుంచి వ్యతిరేకాభిప్రాయాలు వస్తున్న తరుణంలో మూడుసార్లు తానుకూడా చర్చలో పాల్గొన్నారు. సభ ఇంకా నాలుగు రోజుల పాటు కొనసాగి అందరి అభిప్రాయాలు ఉంటాయని, మెజారిటీ సభ్యుల వ్యతిరేకాభిప్రాయం.. వాటిపై ఓటింగ్‌తో విభజన బిల్లును ఓడించి రాష్ట్రపతికి పంపించడానికి వీలుంటుందని సీమాంధ్ర నేతలు భావించారు. కానీ.. అందుకు అవకాశం లేకుండా సీఎం స్వయంగా తిరస్కరణ తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దీంతో చివరి నాలుగు రోజులు సభలో గందరగోళం తలెత్తి సభ్యులు అభిప్రాయాలు చెప్పటానికి అవకాశం లేకుండాపోయింది. ఇదంతా సీఎం, డిల్లీ పెద్దలు ముందు నుంచీ రూపొందించిన ‘రోడ్ మ్యాప్’ ప్రకారమే సాగిందన ్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. -
బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుబడతాం: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇలా తరలించడం అప్రజాస్వామికమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరుతూ బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుబడతామని వైఎస్ విజయమ్మ చెప్పారు. బిల్లుపై చర్చ గడువు ముగుస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్య తీర్మానం గుర్తుకొచ్చిందని విజయమ్మ ఎద్దెవా చేశారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యతీర్మానం చేయాలని డిమాండ్ చేస్తోందని అన్నారు. అయినా తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని విజయమ్మ ఆవేధన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రజాపోరాటాలకు తాము సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సమైక్యాంధ్ర కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని విజయమ్మ తెలిపారు. కాగా, శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఆలోచనలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, కాపు రామచంద్రరెడ్డిలు ఆరోపించారు. బుధవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ... బీఏసీకి రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులు డ్రామా లాడుతున్నారన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోసం చిత్తశుద్ధితో పోరాడుతుంది తమ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. రూల్ 77 కింద సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ మొదటి నుంచి పట్టుబడుతుందన్న సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విజభనపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని అన్నారు. -
సమైక్య తీర్మానానికి టీడీపీ నోటీసులు!
టీ బిల్లుపై ఓటింగ్‌కు స్పీకర్‌కు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని, ఓటింగ్ ద్వారా విభజన బిల్లును తిరస్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ 77వ నిబంధన కింద నోటీసులు ఇచ్చింది. సమైక్య తీర్మానం విషయంలో ఇంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న టీడీపీ చివరకు ఇదే నిబంధన కింద శుక్రవారం స్పీకర్‌కు నోటీసులు అందజేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఓటింగ్ ద్వారా తిరస్కరించని పక్షంలో నష్టం జరుగుతుందని, స్పీకర్ వెంటనే స్పందించాలని టీడీపీ నేతలు కోరారు. రాజ్యాంగ సంప్రదాయాలకు భిన్నంగా బిల్లును ప్రవేశపెట్టారని, బిల్లును యధాతథంగా అమలు చేస్తే రాష్ట్రంలోని అన్ని రంగాలతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బిల్లులోని అంశాలను సభ తిరస్కరించటంతో పాటు రాష్ట్రపతి, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వాలు కూడా బిల్లు విషయంలో తదుపరి చర్యలను నిలిపి వేసేలా కోరాలని పేర్కొన్నారు. ఈ మేరకు గాలి ముద్దుకృష్ణమనాయుడు, పి.అశోక్ గజపతిరాజు, యరపతినేని శ్రీనివాసరావు, కేఈ ప్రభాకర్, కె.మీనాక్షి నాయుడు, కందుల నారాయణరెడ్డి, మల్లేల లింగారెడ్డి, కె.రామకృష్ణలు స్పీకర్‌కు రెండు లేఖలు రాశారు. 30 రోజుల గడువు కావాలి: బిల్లుపై చర్చించడానికి మరో 30 రోజుల గడువు కావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని పట్టుబట్టింది. శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు ముద్దుకృష్ణమనాయుడుతోపాటు మరికొందరు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సభలో మాట్లాడేందుకు కొంత మందికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా సమయం ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులకు, టీడీపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువ సమయం ఇస్తున్నారని, అందులో భాగంగానే మంత్రి సునీతా లకా్ష్మరెడ్డికి ఎక్కువ సమయం కేటాయించారని అన్నారు. ఈ నేపథ్యంలో కొంత సేపు సభను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చివరకు మంత్రి మాణిక్యవరప్రసాద్, చీప్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరుల జోక్యంతో శాంతించారు. -
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
-
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
శాసనసభలో శుక్రవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే ముసాయిదా బిల్లులో 108 సవరణలు ప్రతిపాదిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 17 నుంచి 23 వరకు చివరి దఫా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. -
'కిరణ్, చంద్రబాబులు నాటకాలాడుతున్నారు'
-
'కిరణ్, చంద్రబాబులు నాటకాలాడుతున్నారు'
సమైక్య తీర్మానం పెట్టిన తర్వాతే సభలో చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం చేయాలని తాము శాసన సభలో పట్టుబడతామని వారు వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం వారు మాట్లాడారు. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు అసెంబ్లీలో ఉండి కూడా బీఏసీకి రాకపోవడం దారుణమని ఆరోపించారు. విభజన బిల్లుపై చర్చ జరిగితే... సులువుగా రాష్ట్రాన్ని విభజించవచ్చనే కుయుక్తితో నాటకాలాడుతున్నారని వారు కిరణ్, చంద్రబాబులపై మండిపడ్డారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం జై సమైక్యాంధ్ర పేరుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లను శాసనసభకు తీసుకువచ్చారు. -
బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోంది
శాసనసభలో సమైక్య తీర్మానమే లక్ష్యంగా తాము పని చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లి మీడియా పాయింట్ వద్ద భూమన మాట్లాడుతూ... విభజనతో రెండు ప్రాంతాలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే విభజిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. విభజనతో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నదీ జలాలు విషయంలో తీవ్ర సమస్యలు ఏర్పడతాయన్నారు. దీని వల్ల సీమాంధ్రలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అండ చూసుకుని కేంద్ర ప్రభుత్వం విభజనకు దిగిందని ఆయన వెల్లడించారు. -
నిబంధనలకు విరుద్ధంగా సభ నడుస్తోంది: వైఎస్ఆర్ సీపీ
తెలంగాణ బిల్లు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని వెల్లడించారు. నిన్నటి సభకు సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ దూరంగా ఉండటం అశ్చర్యకరంగా ఉందని అన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందని మంత్రి చెప్పడం నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. సమైక్య తీర్మానం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తాన్నారు. టి.బిల్లుకు నిరసనగా అసెంబ్లీలో ఉన్న తమను అర్థరాత్రి నిర్ధాక్షణ్యంగా అరెస్ట్ చేశారని వారు తెలిపారు. మెజార్జీ సభ్యుల అభిప్రాయం మేరకే సభ జరగాలని వారు డిమాండ్ చేశారు. ఎజెండాను కూడా ఆ మేరకే ఖరారు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. -
అన్ని పార్టీలూ సహకరించాలి: శోభ
ఉద్యమాన్ని కిరణ్ నీరుగారుస్తున్నారంటూ ధ్వజం సమైక్య తీర్మానం కోసం స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసిచ్చిందని పార్టీ శాసనసభా పక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ బిల్లు కింద ఇచ్చిన ఈ తీర్మానానికి విభజనతో నష్టపోయే ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీల సభ్యులూ మద్దతివ్వాలని కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారానికోసారి పత్రికల్లో ప్రకటనలు తప్పితే సమైక్యం కోసం ఆయన ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. సభలో విభజన బిల్లును ఓడిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేలా కిరణ్ ప్రకటనలు చేస్తున్నారంటూ శోభ దుమ్మెత్తిపోశారు. ‘‘బిల్లు వచ్చినప్పుడు కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. ఓటింగ్ ఉండదు. అదే తీర్మానం విషయంలో అయితే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి సభ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో అదొక ఆయుధంలా పని చేస్తుంది’’ అని శోభ వివరించారు. కానీ కిరణ్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో విభజన దిశగా ముందుకెళ్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు తానేం మాట్లాడుతున్నదీ తనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. సమైక్యానికి మద్దతివ్వకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. -
సమైక్య తీర్మానం చేద్దాం : వైఎస్ జగన్
' నోట్‌కు ముందు అప్రమత్తమైతేనే విభజన ఆగుతుంది: వైఎస్ జగన్ ' వైఎస్ జగన్కేబినెట్ నోట్ అసెంబ్లీకి వచ్చాక చేసేదేమీ ఉండదు ' వైఎస్ జగన్అక్టోబర్ 15 నుంచి 20 తేదీల మధ్య హైదరాబాద్‌లో ‘సమైక్య శంఖారావం’ సభ ' వైఎస్ జగన్కాంగ్రెస్తో డీల్ కుదిరితే 16 నెలల పాటు జైలులో ఎందుకుంటాను? ' వైఎస్ జగన్వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నాయి ' సమైక్యం కోసం లేఖ తీసుకువస్తే నేను తొలి సంతకం పెట్టటానికి సిద్ధంగా ఉన్నా ' అన్ని పార్టీల అధ్యక్షుల చేత పెట్టిస్తే.. మూడు పార్టీలు నాలుగూ, ఐదూ అవుతాయి ' ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ విభజిస్తోంటే.. ఓట్లు, సీట్లు పోతాయని టీడీపీ మౌనంగా ఉంది ' రాష్ట్రాన్ని విభజిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయి? ' హైదరాబాద్ మీదికాదు పొమ్మంటే.. చదువుకున్న ప్రతి పిల్లవాడి భవిష్యత్ ఏంకావాలి? ' సమైక్యం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ మూడు ప్రాంతాలూ కావాలి ' ప్రతి తెలంగాణ సోదరుడ్నీ అభివృద్ధి వైపు నడిపిస్తానని నేను గట్టిగా హామీ ఇవ్వగలను ' 60% మంది రోడ్లెక్కి ఆందోళన చేస్తోంటే.. అందరికీ ఆమోదయోగ్యమని ఎలా చెప్తారు? ' మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు కాకముందే రాజకీయ పార్టీలు అప్రమత్తం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. కేబినెట్ నోట్ సిద్ధమై అసెంబ్లీకి వచ్చిన తర్వాత చేసేదేమీ ఉండదని.. ముందుగానే అప్రమత్తమై తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని.. అలాగైతేనే విభజనను నిలువరించగలమని పేర్కొన్నారు. జగన్ సోమవారం పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కలిశారు. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం ఆమోదించాలని కోరుతూ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 16 నెలల జైలు నిర్బంధం తర్వాత కొద్ది రోజుల కిందట బెయిల్‌పై విడుదలైన తర్వాత జగన్ తొలిసారిగా మీడియా ముందుకు రావటంతో దాదాపుగా రాష్ట్ర, జాతీయ మీడియా అంతా హాజరైంది. జగన్ విలేకరుల సమావేశానికి విస్తృత ప్రాముఖ్యతనిచ్చింది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, ఇతర అంశాలను జగన్ ఈ సందర్భంగా సుదీర్ఘంగా వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జరుగుతున్న ఉద్యమం, ఆందోళనలు, కుమ్మక్కు రాజకీయాలు, జాతీయ రాజకీయాంశాల గురించి మాట్లాడారు. హోంశాఖ కేబినెట్ నోట్ తయారుకాకముందే అప్రమత్తమై అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పుడే విభజనను ఆపగలమని జగన్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఇదే అంశంపై పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 15 నుంచి 20 తేదీ మధ్యలో హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగన్ ప్రకటించారు. సమైక్య రాష్ట్రం కోసం జేఏసీ లేఖ తీసుకొస్తే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలి సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ.. తామేదో కుమ్మక్కయినట్టు వేలు తమవైపు చూపటాన్ని ఆయన ఆక్షేపించారు. కేసు నమోదైనప్పుడు దర్యాప్తు పూర్తి కాని పక్షంలో 90 రోజుల్లోగా బెయిల్ రావాలని రాజ్యాంగం చెప్తోందని.. కానీ తనకు ఆ హక్కును నిరాకరించారని.. కాంగ్రెస్‌తో డీల్ కుదిరితే తాను 16 నెలల పాటు జైలులో ఎందుకుంటానని జగన్ సూటిగా ప్రశ్నించారు. ముందే తీర్మానం చేస్తే.. ‘‘అడ్డగోలుగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం తప్పు. అసలు కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయండని కోరడానికి ఒక కారణముంది. కేబినెట్ నోట్ రూపొందాక కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటై, బిల్లు ముసాయిదా అయిపోయాక చివరిగా అది అసెంబ్లీకి వస్తే అపుడు మనం తీర్మానం ద్వారా వ్యతిరేకించినా దానికి ప్రాధాన్యత ఉండదు. అలా కాకుండా ఇపుడే అసెంబ్లీని సమావేశ పరచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే అపుడు కేంద్రంలోని పెద్దలు, దేశంలోని అందరూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తారు. అది చూసి కాస్తో కూస్తో వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందనే ఆశతోనే గవర్నర్‌ను కూడా కలిశాం’’ అని జగన్ వివరించారు. విభజన విషయంలో పలు పార్టీల తీరును తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలు... ఈ మూడు పార్టీలే మనసా వాచా సమైక్యానికి కట్టుబడి ఉన్నాయని, మిగిలిన పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఈ వ్యవస్థలో కనిపించడం లేదన్నారు. సమస్యపై ఒక తండ్రిలా ఆలోచించాల్సిన పరిస్థితి కాకుండా మున్ముందు పిల్లలు కొట్టుకునే పరిస్థితి రానివ్వడం బాధ కలిగిస్తుందన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తుంటే.. అడగాల్సిన ధర్మం, బాధ్యత ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని అడక్కుండానే విభజన జరగనిస్తోందని దుయ్యబట్టారు. రోజూ నీటి కోసం కొట్టుకునే పరిస్థితికి నెడుతున్నారు... ‘‘నేను ఒక్క మాట అడుగుతున్నా... ఇవాళ రాష్ట్రాన్ని విభజించే వాళ్లు ఏమైనా ఆలోచన చేశారా..? రాష్ట్రాన్ని ఒక్కసారి తిరిగి చూడండి. రాష్ట్రం సమష్టిగా ఉన్నప్పుడే మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్ డ్యాంలు నిండిన తరువాత కృష్ణా నదిలో కిందికి నీళ్లు రాని పరిస్థితి, వదలని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలంకు నీళ్లెలా వస్తాయి..? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా వస్తాయి..? ఈ పెద్దలను అడుగుతున్నా. ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాను అంటే.. ట్రిబ్యునళ్లు ఏం చెప్పినా... కోర్టులు ఏం చెప్పినా... ప్రధానమంత్రులు ఏం చెప్పినా కూడా రాష్ట్రం ఒకటిగా ఉన్నపుడే ఈ పరిస్థితి ఉంటే.. ఇక మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు కూడా ఎక్కడా దొరకని పరిస్థితుల్లోకి ఇవాళ ఈ కేంద్ర పెద్దలు, ఈ రాష్ట్ర పెద్దలు రాష్ట్రాన్ని తీసుకెళుతున్నారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలే కాదు.. ప్రకాశం, నెల్లూరే కాదు.. కృష్ణా, గుంటూరే కాదు.. పశ్చిమగోదావరిలోని సగం ప్రాంతాలే కాదు.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్.. మొత్తం ఈ మూడు జిల్లాలతో పాటు ఈ ఎనిమిదిన్నర జిల్లాలు కూడా మొత్తం ప్రతి రోజూ నీటి కోసం కొట్టుకుని తన్నుకునే పరిస్థితి నెలకొంటుంది. మరో విషయం.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు చిట్ట చివరన వస్తుంది. రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు..? కేంద్ర పెద్దలను, రాష్ట్ర పెద్దలను అడిగాం. లేఖలు రాశాం. రాష్ట్రం ఎడారి అవుతుందని కూడా నిలదీశాం’’ అని అన్నారు. హైదరాబాద్ మీది కాదు పొమ్మంటారా? అడ్డగోలుగా విభజన చేసి హైదరాబాద్ వదిలిపెట్టి పొమ్మని చెప్పటం ఎంతవరకు న్యాయమని జగన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం 50 శాతం బడ్జెట్ హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని గుర్తుచేశారు. ‘‘మీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కాదు పొమ్మంటే, పదేళ్లలో హైదరాబాద్‌ను వదిలి వేరే చోట రాజధాని నగరాన్ని కట్టుకోమంటే... ఏంటి పరిస్థితి? అప్పుడు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు సంక్షేమ పథకాలన్నీ కూడా నడిరోడ్డున ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్న పిల్లవాడైనా తన చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరంవైపు చూస్తున్నారు.. అలాంటప్పుడు వారి భవిష్యత్తేంకావాలి?’’ అని నిలదీశారు. సమైక్యం అంటే మూడు ప్రాంతాలూ... రాయలసీమ, కోస్తా, తెలంగాణతో కూడిన సమైక్య రాష్ట్రం మాకు కావాలని జగన్ విస్పష్టంగా చెప్పారు. ‘‘సమైక్యం అంటే అది ఒక్క రాయలసీమనే కాదు, కోస్తాంధ్రనే కాదు, తెలంగాణ కూడా కలిపి అంటున్నాను. మాకు తెలంగాణ కావాలి.. మాకు రాయలసీమ కావాలి.. మాకు కోస్తాంధ్ర కూడా కావాలి. అదే సమైక్యం అంటే. ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడికి గట్టిగా ఒక్క మాట చెప్పగలుగుతా.. ప్రతి తెలంగాణ సోదరుడినీ అభివృద్ధి వైపు నేను నడిపిస్తానని గట్టిగా హామీ ఇవ్వగలుగుతాను. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు అన్నది గతంలో ఎవ్వరూ కూడా ఆలోచన చేయలేదు. ఆలోచన చేసిందల్లా వె .ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ఈ ప్రాజెక్టును ఆయన చనిపోయాక పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడగొట్టడమనేది పరిష్కారం కాదు’’ అని స్పష్టంచేశారు. నాటి మా లేఖను ఒక్కసారి పరిశీలించండి... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరితే తమ వ్యతిరేకులు అనేక విమర్శలు చేస్తున్నారని.. తామేదో యూ టర్న తీసుకున్నామని అంటున్నారని జగన్ తప్పుపట్టారు. తమ పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రికి ఇచ్చిన లేఖలోని అంశాలను ఒక్కసారి పరిశీలించాలని కోరారు. ‘‘రకరకాల మాటలపై జైల్లో ఉన్నపుడు స్పందించలేకపోయా... కానీ మనసుకు బాధ కలిగింది. నేను ప్లీనరీ సమావేశాల్లో చెప్పిన మాటలను ఒక్కసారి తిరగేయండి. మా పార్టీ హోంమంత్రికి లేఖ ఇచ్చినపుడు ఆ లేఖలో రాసిన అంశాలను ఒక్కసారి చూడండి.. అని ప్రతి ఒక్కరినీ అడుగుతున్నా. ఎవరికీ అన్యాయం జరుక్కుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని ఆ లేఖలో స్పష్టంగా రాశాం. ఇవాళ 60 శాతం ప్రజలు రోడ్లెక్కారు, 60 రోజుల నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రోడ్లమీదకు వచ్చి బంద్‌లు చేస్తున్నారు. 60 శాతం మంది ప్రజలు రోడ్లెక్కి ‘అన్యాయం జరుగుతా ఉంది’ అనంటే.. ఇది అన్యాయంగా మీకు కనపడ్డం లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇన్ని ధర్నాలు, సమ్మెలు జరుగుతూ ఉంటే మీరెలా చెప్పగలరు.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని..?’’ అని ఘాటుగా విమర్శించారు. ప్రజల మనసుల్లో సమైక్య భావనను తీసేయలేరు... ‘‘ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు రావాలి. ఈ వ్యవస్థల్లో నిజాయితీ రావాలి. ఒక్కటే చెప్తున్నా.. చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుందో నాకూ అదే నష్టం జరిగేది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు సీట్లు పోతాయని చంద్రబాబు మాట్లాడలేదు. నేను జైలులో ఉన్నందున మాట్లాడలేని, స్పందించలేని పరిస్థితిలో ఉన్నాను’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్ నగరం నుంచి బయటకు పోకుండా ననై్నతే కట్టడి చేస్తున్నారు గాని ప్రజల మనసుల్లో కలసి ఉండాలన్న భావనను ఎవరూ కూడా తీసేయలేరు. అందుకే సమైక్య ఉద్యమంలో భాగంగా సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్‌లో అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఒక భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నాం. ఈ విషయం మీద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ.. అందరూ కూడా ఆ సభకు విచ్చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరగాలి... సమైక్యానికి కట్టుబడుతూ జేఏసీ తమ ఇష్టమొచ్చిన లేఖను తీసుకొచ్చినా ఒక పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి సంతకం తాను పెడతానని జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘ఇవాళ మూడు పార్టీల నుంచి నాలుగు పార్టీలు ఆ తరువాత ఐదు పార్టీలు అవుతాయి. చంద్రబాబుగారు ఏమో లేఖ వెనక్కి తీసుకోరు. సమైక్యానికి కట్టుబడి ఉన్నట్లుగా తాను లేఖ ఇవ్వరు. తాను రాజీనామా చేయరు. కానీ బయటేమో ప్రజల వ్యతిరేకత ఎక్కడ వస్తుందోనని చెప్పి నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబుకు సంబంధించిన నేతలు నిస్సిగ్గుగా జేఏసీ మీటింగ్‌లలో పాలు పంచుకుంటారు. నేను కోరేదేమంటే ప్రజలందరూ ఒక్కటై ప్రతి రాజకీయ పార్టీనీ ప్రశ్నించాలి. చంద్రబాబు గారితో మొదలు పెట్టి అందరినీ అడగాలి. ‘అయ్యా... నువ్వు సమైక్యానికి మద్దతుగా లేఖ ఇవ్వనపుడు.. ఎందుకు మీ పార్టీ వాళ్లు జేఏసీకి వస్తున్నారు?’ అని ప్రశ్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అపుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. పార్టీ పెద్దలు లేఖల మీద సంతకాలు పెట్టాలి. అపుడు తేటతెల్లంగా మూడు పార్టీలు కాస్తా నాలుగూ ఐదూ అవుతాయి. అప్పుడు విభజనకు అనుకూలంగా నాలుగు, వ్యతిరేకంగా నాలుగు పార్టీలవుతాయి. లేకపోతే సమైక్యానికి ఐదు, విభజనకు మూడు పార్టీలు కూడా అవుతాయి. అపుడే ఈ రాష్ట్రం విడిపోకుండా ఆపగలుగుతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. -
'వైఎస్ఆర్ సీపీ సమైక్య తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సమైక్య తీర్మానానికి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ ప్రతిపాదించిన సమైక్య తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని సచివాలయం సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ నేత మురళీకృష్ణ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. సమైక్య తీర్మానం ద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అందులో భాగంగా ఏపీ భవన్ వరకు సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. అలాగే జంతర్ మంతర్ వద్ద సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు పలువురు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.